నడిరోడ్డుపై యువకుడి దారుణ హత్య

నడిరోడ్డుపై యువకుడి దారుణ హత్య

సారంగాపూర్ ముద్ర: పట్టపగలే నడిరోడ్డుపై యువకుడిని దారుణ హత్య చేసిన సంఘటన బీర్పూర్ మండలంలోని తుంగూరు గ్రామంలో ఆదివారం జరిగింది. స్థానికుల కథనం ప్రకారం వివరాలు ఇలా ఉన్నాయి... మండల కేంద్రానికి చెందిన జువ్వి కింది వంశీ (25) అనే యువకుడు మండలంలోని తుంగూరు గ్రామంలో మోటార్ డ్రైవింగ్ స్కూల్ లో కార్ డ్రైవింగ్ శిక్షకుడిగా పని చేస్తున్నాడు. ఆదివారం ఉదయం కార్ డ్రైవింగ్ నేర్పడానికి  తుంగూరులో గల మోటర్ డ్రైవింగ్ స్కూల్ కి వెళ్లి విధులు ముగించుకొని తిరిగి తన ఇంటికి  TS 02ED 3837 తన ద్విచక్ర వాహనం పై  వెల్లుతుండగా గుర్తు తెలియని వ్యక్తులు ద్వి చక్ర వాహనాలపై వచ్చి వంశీ వాహనాన్ని అడ్డగించారు. 

వంశీ తన వాహనం దిగగానే గుర్తు తెలియని వ్యక్తులు వారి వెంట తెచ్చుకున్న గొడ్డలితో తలపై బలంగా బాదడంతో వంశీ అక్కడిక్కడే కింద పడి మృతి చెందాడు. అనంతరం హంతకులు మృతుడి సెల్ ఫోన్ తీసుకొని అక్కడి  నుండి పరారయ్యారు. కాగా సంఘటన స్థలాన్ని జగిత్యాల డిఎస్పి రత్నాపురం ప్రకాష్, జగిత్యాల రూరల్ సీఐ ఆరిఫ్ అలీ ఖాన్ చేరుకుని మృతదేహాన్ని పరిశీలించి వివరాలు తెలుసుకున్నారు. కాగా మండలంలోని ఓ గ్రామానికి చెందిన వివాహితను పాత పరిచయంతో ప్రేమ పేరుతో వేధించడం తో పాటు ఆమె కుటుంబ సభ్యులకు ఫోన్ చేసి వేదిస్తుండటం తో హత్య చేసినట్లు తెలుస్తుంది. కాగా హత్య చేసిన నిందితులను పోలీసులు అదుపులోకి తీసుకొని విచారిస్తున్నట్లు సమాచారం.