ఈసీ నిఘా నీడన అభ్యర్థుల ప్రచారం!

ఈసీ నిఘా నీడన అభ్యర్థుల ప్రచారం!

సీసీ కెమెరాతో ప్రత్యేక వాహనం
కేసముద్రం, ముద్ర: అసెంబ్లీ ఎన్నికల్లో ఈసారి ఎన్నికల కమిషన్ ప్రత్యేకంగా అభ్యర్థుల ప్రచారం, ఎన్నికల సరళిని ప్రత్యక్షంగా పరిశీలించేందుకు వినూత్న తరహాలో ప్రత్యేకంగా నిఘా (సీసీ) కెమెరాతో రూపొందించిన వాహనాన్ని వినియోగిస్తోంది. రెండు మండలాలకు కలిపి ఒక వాహనాన్ని కేటాయించి ఆ వాహనంపైన 360 డిగ్రీల రొటేట్ తో రికార్డు చేసే విధంగా కెమెరాను ప్రత్యేకంగా ఏర్పాటు చేశారు. జిల్లా ఎన్నికల కంట్రోల్ రూమ్ కు ఆ వాహన కదలికలను తెలుసుకునే విధంగా చర్యలు తీసుకున్నారు. ఒక్కొక్కరు 8 గంటల చొప్పున విధులు నిర్వహించే విధంగా ఒక గెజిటెడ్ అధికారి పర్యవేక్షణలో ఫొటోగ్రాఫర్, పోలీస్, ఇతర సిబ్బందిని వాహనానికి కేటాయించారు. ఆయా మండలాల్లో అభ్యర్థుల ప్రచార కార్యక్రమాన్ని నిఘానేత్రం ద్వారా రికార్డు చేయిస్తున్నారు.

ఎన్నికల్లో అవకతవకలు, అక్రమాలు చోటు చేసుకోకుండా ఈసీ కొత్తగా ప్రవేశపెట్టిన నిఘానేత్రం పనిచేస్తోంది. ఎక్కువసేపు ఎక్కడ కూడా వాహనం నిలిపి ఉండకుండా నిరంతరం కేటాయించిన మండలాల్లో సంచరించే విధంగా చర్యలు తీసుకున్నారు. అభ్యర్థుల ప్రచారానికి కూడా గతంలో మాదిరిగా కాకుండా ముందుగానే అనుమతి తీసుకోవాలని షరతు విధించడంతో, ఆ మేరకు అభ్యర్థుల ప్రచార కార్యక్రమాన్ని కూడా ఎన్నికల నిఘా వాహన పర్యవేక్షకుడికి తెలిపి ఆ మేరకు ప్రచార సరళిని పరిశీలించే విధంగా చర్యలు చేపట్టారు. ఎన్నికల కోడ్ కట్టుదిట్టంగా అమలు చేయడానికి సంచార నిఘానేత్రం గట్టిగానే పనిచేస్తున్నట్లు ప్రచారం సాగుతోంది.