ఛత్తీస్ గఢ్ లో మావోయిస్టుల పంజా

ఛత్తీస్ గఢ్ లో మావోయిస్టుల పంజా

- జవాన్లు ప్రయాణిస్తున్న బస్సు పేల్చివేత
- 10 మంది జవాన్లు, డ్రైవర్ మృతి

ముద్ర ప్రతినిధి జయశంకర్ భూపాలపల్లి:  ఛత్తీస్‌గఢ్ లో మావోయిస్టులు బుధవారం పోలీసు జవాన్లపై పంజా విసిరారు. జవాన్లు ప్రయాణిస్తున్న బస్సును పేల్చివేశారు. ఈ దుర్ఘటనలో డ్రైవర్ సహా మొత్తం 11 మంది అక్కడికక్కడే మృతి చెందారు. వివరాలు ఇలా ఉన్నాయి.. ఛత్తీస్ గఢ్ రాష్ట్రంలోని దంతెవాడ జిల్లా అరన్ పూర్ ప్రాంతంలో జవాన్లు ప్రయాణిస్తున్న మినీ బస్సుపై మావోలు మందు పాతర పేల్చారు. ఈ ఘటనలో 10మంది పోలీసులు ఒక డ్రైవర్ మృతి చెందారు. మరి కొంతమంది గాయపడ్డారు. క్షతగాత్రులని చికిత్స నిమిత్తం సమీప ఆస్పత్రికి తరలించారు. ఛత్తీస్ గఢ్ లో గత కొంతకాలంగా స్థబ్దతగా ఉన్న మావోలు ఒక్కసారిగా విరుచుకుపడ్డారు. పోలీసులే లక్ష్యంగా భారీ పేలుడుకు పూనుకున్నారు. ఆంధ్ర, తెలంగాణ సరిహద్దుల్లో ఉన్న బీజాపూర్, జగదల్పూర్, దంతేవాడ, సుకుమా జిల్లాలు మావోయిస్టులకు పెట్టని కోటగా ఉంటున్నాయి. ఇటీవల కాలంలో ఈ ప్రాంతంలో పోలీసులు కూంబింగ్ నిర్వహించారు. పోలీసుల చర్యలతో ఈ ప్రాంతంలో మావోయిస్టుల అలజడి తగ్గినట్లు కనిపించింది. ఈ క్రమంలో అదును కోసం వేచిచూస్తున్న మావోయిస్టులు పథకం ప్రకారం ఈ పేలుడుకు రూపకల్పన చేసినట్లు తెలుస్తోంది. ఇంప్రూవ్ వైడ్ ఎక్స్ ప్లోజీవ్ డివైస్ (ఐఈడి) బ్లాక్ చేసి ఈ దాడికి పాల్పడినట్లు అధికార వర్గాలు వెల్లడించాయి. పోలీసులు యాంటీ మావోయిస్టు ఆపరేషన్ ముగించుకొని వస్తున్న క్రమంలో మావోలు ఈ ఘాతుకానికి పాల్పడినట్లు తెలుస్తుంది. ఈ దాడిలో పదిమంది పోలీసులతోపాటు వాహనం నడుపుతున్న డ్రైవర్ మృతి చెందారు. దాడి జరిగిన సమాచారం అందగానే అధికారులు సహాయక చర్యలు చేపట్టారు. భారీ సంఖ్యలో భద్రతా సిబబ్బందిని మోహరించారు. మరణించిన జవాన్లు డిఫెన్స్ రీసెర్చ్ కు టీంకు చెందిన వారీగా గుర్తించారు. అరన్ పూర్ లో మవోయిస్టుల ఉనికి ఉందన్న పక్కా సమాచారంతో డీఆర్జీ బృదం నక్సల్ వ్యతిరేక ఆపరేషన్ చేపట్టింది. జవాన్లు పహారా ముంగించుకుని తిరిగి తమ కార్యాలయానికి వెళ్తున్న సమయంలో మావోయిస్టులు ఈ ఘాతుకానికి పాల్పడ్డారు.