రైతుల సహకారంతో సంఘం లాభాల బాట

రైతుల సహకారంతో సంఘం లాభాల బాట
  • 2.50 కోట్ల లాభాలు
  • సొసైటీకి ఎకరం భూమి కొనుగోలుకు తీర్మానం
  • రైతులకు మరిన్ని సేవలు
  • చైర్మన్ జంగ వెంకట రమణారెడ్డి

చిగురుమామిడి ముద్ర న్యూస్: రైతుల సహకారంతో రూ. 2.50 కొట్ల లాభాలతో చిగురుమామిడి ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం నడుస్తుందని  చైర్మన్ జంగ వెంకటరమణారెడ్డి పేర్కొన్నారు. చిగురుమామిడి మండల కేంద్రంలో శుక్రవారం ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం అర్ధవార్షిక మహాసభ సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా రైతుల నుండి పలు సూచనలు తీసుకున్నారు. అనంతరం చైర్మన్ వెంకటరమణారెడ్డి మాట్లాడుతూ... రైతుల నుండి ధాన్యం కొనుగోలు ద్వారా సహకార సంఘం నష్టాల నుండి బయటపడి లాభాల బాటలో నడుస్తుందని ఆనందం వ్యక్తం చేశారు. రైతులకు మరిన్ని సేవలు అందించాలని పాలకవర్గం నిర్ణయించిందన్నారు. ఇందులో భాగంగా రైతులకు నాణ్యమైన విత్తనాలను, ఎరువులు, పెస్టిసైడ్ ను అందించాలని నిర్ణయించామన్నారు. యూరియా కొరత రాకుండా ఇందుర్తి, రేకొండ, చిగురుమామిడి సెంటర్ల ద్వారా  రైతులకు 12 వందల యూరియా బస్తాలను పంపిణీ చేశామన్నారు. నెల రోజుల్లో ఇందుర్తి పంపులో డీజిల్ తో పాటు పెట్రోల్ ను అందుబాటులోకి తెస్తామన్నారు. సొసైటీ ద్వారా 459 మంది రైతులు రుణమాఫీ అర్హత పొందగా 330 మందికి రుణ మాఫీ జరిగిందని... త్వరలో మిగిలిన 129 మంది రైతులకు రుణమాఫీ జరుగుతుందని తెలిపారు. ఈ మహాసభలో సొసైటీకి ఎకరం భూమి కొనుగోలు చేయుటకు తీర్మానం చేశారు. ఈ కార్యక్రమంలో వైస్ చైర్మన్ కరివేద మహేందర్ రెడ్డి, జిల్లా రైతుబంధు సభ్యులు సాంబారి కొమురయ్య, డైరెక్టర్లు, రైతులు, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.