పుస్తకం తోనే జ్ఞాన సంపద

పుస్తకం తోనే జ్ఞాన సంపద
  • గూగుల్ ని మించిన సమాచారం
  • కవులకు, కళాకారులకు పుట్టినిల్లు కరీంనగర్
  • రాష్ట్ర మంత్రి గంగుల కమలాకర్

ముద్ర ప్రతినిధి కరీంనగర్: జ్ఞాన సంపదను భద్రపరిచేది, భావితరాలకు అందించేది పుస్తకమని, గూగుల్ ని మించిన సమాచారం పుస్తకాల్లో లభ్యం అవుతుందని రాష్ట్ర బీసీ సంక్షేమ, పౌర సరఫరాల శాఖ మంత్రి గంగుల కమలాకర్ అన్నారు. అంతర్జాతీయ మహిళా దినోత్సవ వేడుకలలో భాగంగా కరీంనగర్ పట్టణంలోని మహాత్మా జ్యోతి భాపులే గ్రౌండ్ లో ఏర్పాటు చేసిన పుస్తక మహోత్సవ కార్యక్రమాన్ని మంత్రి  ప్రారంబించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ కవులకు, కళాకారులకు పుట్టినిల్లు కరీంనగర్ జిల్లా అని, పుస్తకాలను భావి తరాలకు అందించి, పుస్తక ప్రాముఖ్యతను పెంచడానికి పుస్తక మహోత్సవ కార్యక్రమం తోడ్పడుతుందని అన్నారు. మహిళా దినోత్సవ సందర్భంగా నగరంలో రెండవ సారి పుస్తక మహోత్సవ కార్యక్రమం ఏర్పాటు చేయడం అభినందనీయమని అన్నారు.  

తరతరాల చరిత్రను సంపదను భద్ర పరచి, కీర్తించుకుంటామంటే పుస్తకాల ద్వారానే అని అన్నారు. స్వాతంత్ర్య పోరాటం నుండి తెలంగాణ ఏర్పాటుకు ముందు జరిగిన ఉద్యమాల పుస్తకాలను చదివే ముఖ్యమంత్రి కెసిఆర్ తెలంగాణ ఉద్యమాన్ని ప్రారంభించారని అన్నారు. కరీంనగర్ జిల్లా ఖ్యాతిని పెంచిన మహనీయులు మాజీ ప్రధాని పీవీ నరసింహారావు ఆర్థిక స్థితిని గాడిన పెట్టింది పుస్తక పఠనం తోనే అని అన్నారు. జిల్లాకు చెందిన అనేక మంది గొప్ప గొప్ప సాహితీ వేత్తలు పుస్తక పఠనం ద్వారానే కీర్తి ప్రతిష్టలను పొందారని గుర్తు చేశారు. మహిళలు ఎక్కడ గౌరవించబడతారో అక్కడ దేవతలు ఉంటారని అన్నారు. ఈ కార్యక్రమంలో తెలంగాణ సాహిత్య అకాడమీ చైర్మన్ జూలూరి గౌరీ శంకర్, సివిల్ సప్లై చైర్మన్ సర్దార్ రవీందర్ సింగ్, జడ్పీ చైర్మన్ కనుమల్ల విజయ, మేయర్ సునీల్ రావు, సుడా చైర్మన్ జివి రామకృష్ణారావు, మాజీ ఎమ్మెల్సీ నారదాసు లక్ష్మణరావు, గ్రంథాలయ కమిటీ చైర్మన్ పొన్నం అనిల్ కుమార్, డిప్యూటీ మేయర్ చల్లా స్వరూపారాణి హరిశంకర్ తో పాటు పలువురు పాల్గొన్నారు.