ప్రజల చైతన్యoతోనే సైబర్ నేరాల నియంత్రణ: ఎస్పీ పుల్లా కరుణాకర్

ప్రజల చైతన్యoతోనే సైబర్ నేరాల నియంత్రణ: ఎస్పీ పుల్లా కరుణాకర్

ముద్ర ప్రతినిధి, జయశంకర్ భూపాలపల్లి:  ప్రజల చైతన్యంతోనే సైబర్ నేరాల నియంత్రణ చేయవచ్చునని జిల్లా ఎస్పీ పుల్లా కరుణాకర్ తెలిపారు. జయశంకర్ భూపాలపల్లి జిల్లా కేంద్రంలో శుక్రవారం ఎస్పీ మాట్లాడుతూ సైబర్ నేరాలు రోజురోజుకు పెరుగుతున్నాయని, టెక్నాలజీ వాడుకుని నేరగాళ్లు ప్రజల డబ్బును దోచుకుంటున్నారని, అనవసర లింకులు క్లిక్ చేయొద్దని, ఓటిపి పాస్వర్డ్ లు ఎవరికి చెప్పద్దని, జిల్లా  ప్రజలు అప్రమత్తంగా ఉండాలని కోరారు. అపరిచిత వ్యక్తులతో ఫోన్ కాల్స్, వాట్సాప్, ఫేస్బుక్ చాటింగ్ లకు దూరంగా ఉండాలని, ఓటీపీ ఎవరికి చెప్పొద్దని సూచిoచారు. లాటరీలు, రివార్డులు, జాబ్స్, కమిషన్లు, డిస్కౌంట్ ల పేరుతో సులభంగా డబ్బు సంపాదించుకోవడానికి ప్రజలకు ఆశ చూపిస్తారని, బ్యాంకు నుంచి మాట్లాడుతున్నామని, ఆధార్ నెంబర్,  మొబైల్ నెంబర్, మొబైల్ కు వచ్చిన ఓటీపీ చెప్పాలని, ఏటీఎం పనిచేయడం లేదని, కారు గెలుచుకున్నారని, డబ్బు రెట్టింపు అవుతుందని, మనీ ఇన్వెస్ట్మెంట్ పేరుతో, క్రెడిట్ కార్డు లిమిట్ పెంచుతామని, ఇలా రకరకాలుగా సైబర్ నేరగాళ్లు  ప్రజలను మోసగిస్తున్నారని వివరించారు. 

సైబర్ నేరగాళ్ల చేతిలో మోసపోయిన ప్రజలు  వెంటనే 1930 టోల్ ఫ్రీ నెంబర్, లేదా డయల్ 100 కాల్ చేసి సంబంధిత వివరాలు తెలియజేస్తే , 24 గంటల్లో డబ్బు తిరిగి వచ్చే అవకాశం ఉందని తెలిపారు. సైబర్  నేరాలను నివారించేందుకు ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, ప్రజల చైతన్యమే సైబర్ నేరాల నివారణకు ఉపయోగపడుతుందని, సామాజిక మాధ్యమాల ద్వారా వ్యక్తిగత వివరాలు ఇతరులతో పంచుకోకూడదని, ఈ విషయంలో ప్రజలు అవగాహనతో ఉండాలని ఎస్పీ వెల్లడించారు.