సమ  దృష్టితో సంక్షేమం, అభివృద్ధి రాష్ట్రంలో లబ్దిపొందని కుటుంబం లేదు

సమ  దృష్టితో సంక్షేమం, అభివృద్ధి రాష్ట్రంలో లబ్దిపొందని కుటుంబం లేదు

బిసి, గొర్రెల లబ్ధిదారులకు మంజూరు పత్రాలు :ఎమ్మెల్యే పద్మాదేవందర్ రెడ్డి

ముద్ర ప్రతినిధి, మెదక్: తెలంగాణ వచ్చాక అందిస్తున్న  సంక్షేమ పధకాలు, వాటి ద్వారా లబ్దిపొందిన లబ్ధిదారుల మాటల ద్వారా వింటుంటే వారి  కళ్ళలో ఆనందం స్పష్టంగా కనిపిస్తుందని మెదక్ ఎమ్మెల్యే పద్మా దేవేందర్ రెడ్డి అన్నారు. పేదల సంక్షేమానికి కేసీఆర్ నిత్యం ఆలోచిస్తూ ప్రతి గడపకు పధకం చేరేలా, చక్కటి కార్యాచరణతో అమలు చేస్తున్నారని, నేడు రాష్ట్రంలో లబ్దిపొందని కుటుంబం లేదన్నారు. ప్రజలకు వివరించాలనే ఉద్దేశ్యంతో ప్రభుత్వం దశాబ్ది ఉత్సవాలు సాధించిన ప్రగతిపై  21 రోజుల పాటు కార్యక్రమాలు నిర్వహిస్తున్నదన్నారు. శుక్రవారం మాయా గార్డెన్ లో మెదక్ నియోజక వర్గ సంక్షేమ సంబురాలు కార్యక్రమంలో  పాల్గొనగా బోనాలతో స్వాగతం పలికారు. ఎమ్మెల్యే మాట్లాడుతూ  రాష్ట్ర ప్రభుత్వం సంక్షేమం,అభివృద్ధి రెండింటిని సమదృష్టితో అమలుచేస్తూ గత 70 ఏళ్లలో సాధించని  ప్రగతిని, ఈ 9 ఏళ్లలో చేసి చూపించిందన్నారు. నాడు గ్రామంలో ఒకరు చనిపోతే మరొకరి పింఛన్ వచ్చేదని, కానీ నేడు వయస్సును కూడా 57 సంవత్సరాలకు  తగ్గించి బీడీ కార్మికులు, ఒంటరి మహిళలు, వితంతువులు, ఫైలేరియా, డయాలసిస్ రోగులకు కూడా  పింఛను అందిస్తున్నామన్నారు. విద్య బలోపేతానికి గురుకుల పాఠశాలలు,విదేశ విద్యకు 20 లక్షలు అందిస్తున్నదని  అన్నారు.

అదేవిధంగా రైతాంగానికి రైతు బందు, రైతు భీమా, సాగునీటికి చెక్ డ్యాంల నిర్మాణం, మిషన్ కాకాతీయ   ద్వారా చెరువుల పూడిక తీత , పేదింటి ఆడపిల్లల కు కళ్యాణ లక్ష్మి, షాదిముబారక్  వంటి పలు అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలు అమలు చేస్తున్నదని  అన్నారు.  బి.సి. కుల వృత్తులు,  చేతి వృత్తుల వారికి   కుటుంబంలో ఒకరికి లక్ష రూపాయల ఆర్ధిక సహాయం అందించే  కార్యక్రమానికి శ్రీకారం చుట్టారన్నారు. ఈ సందర్భంగా  నియోజక వర్గంలో లాంఛనంగా 20 మంది బి.సి.లకు లక్ష చొప్పున  చెక్కులు పంపిణి చేశారు. రెండవ విడత  గొర్రెల పంపిణీ కార్యక్రమాన్ని కూడా లాంఛనంగా ప్రారంభించి 24 మందికి మంజూరు ఉత్తర్వులు అందజేశారు. 21 మందికి కళ్యాణ లక్ష్మి, షాదిముబారక్ చెక్కులను, పేరూరు, హవేళిఘనాపూర్, రాంపూర్ గ్రామాలకు చెందిన 116 మంది లబ్దిదారులకు ఇళ్ల పట్టాలను ఎమ్మెల్యే పంపిణి చేశారు. నియోజక వర్గంలో 9,693 మందికి కళ్యాణ లక్ష్మి,షాదిముబారక్ చెక్కులను, 50 వేల  మందికి పింఛన్లను అందిస్తున్నామన్నారు.జిల్లా కలెక్టర్ రాజర్షి షా మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం మానవీయ కోణంలో ఆలోచిస్తూ వారి సంక్షేమాన్ని కాంక్షించి కార్యక్రమాలకు రూపకల్పన చేసి  అందుకు తగిన విధంగా నిధులు కేటాయిస్తూ అమలు చేస్తున్నదని  అన్నారు.అంతకుముందు సంక్షేమ శాఖలు, డిఆర్డిఓ  అధికారులు నియోజకవర్గంలో అమలు చేస్తున్న కార్యక్రమాలు, లబ్దిదారులకు చేకూర్చిన ఆర్ధిక సహాయం ప్రగతి నివేదికను వినిపించారు.ఈ కార్యక్రమంలో ఇఫ్కో డైరెక్టర్ దేవేందర్ రెడ్డి, ఎంపిపి యమున జయరామి రెడ్డి, మునిసిపల్ చైర్మన్ చంద్రపాల్ వైస్ చైర్మన్ మల్లికార్జున్ గౌడ్, డిఆర్డిఓ  శ్రీనివాస్, జిల్లాఅధికారులు విజయలక్ష్మి,  విజయశేఖర్ రెడీ, శంకర్, బహ్మాజి, వివిధ మండలాల అధ్యక్షులు,జెడ్పిటిసిలు, సర్పంచులు, కౌన్సిలర్లు, లబ్ధిదారులు తదితరులు  పాల్గొన్నారు.