కార్మిక సంఘాల ఆధ్వర్యంలో అంగన్వాడీ టీచర్, ఆయాలు, సెకండ్ ఏఎన్ఎం ల ధర్నా

కార్మిక సంఘాల ఆధ్వర్యంలో అంగన్వాడీ టీచర్, ఆయాలు, సెకండ్ ఏఎన్ఎం ల ధర్నా
  • సమాన పనికి సమాన వేతనం ఇవ్వాలి: సెకండ్ ఏఎన్ఎం లు 

ముద్ర సిరిసిల్ల టౌన్:-రాజన్న సిరిసిల్ల జిల్లా, సిరిసిల్ల పట్టణం అంబెడ్కర్ చౌక్ లో అంగన్వాడీ టీచర్, ఆయాలను,సెకండ్ ఏఎన్ఎం ల పట్ల, కేంద్ర కార్మిక వ్యతిరేక విధానాల ను నిరసిస్తూ కార్మిక సంఘాలైనా ఏఐటియూసి, సిఐటియూ, ఐఎన్ టియూసి ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా కార్మిక సంఘాల నాయకులు మాట్లాడుతూ ప్రపంచీకరణలో భాగంగా కేంద్ర ప్రభుత్వం 44 కార్మిక చట్టాలను సవరించి 4 కోడ్ లుగా విభజించి కార్మికులకు ఉన్న హక్కులను కూడా లేకుండా పెట్టుబడి దారులకు, కార్పొరేట్ శక్తులకు దేశ పౌరులను బానిసలను చేసే విధంగా సమ్మె హక్కును , వేతన ఒప్పంద హక్కును, పని భద్రత హక్కును, 8 గంటల పనివిధానం లాంటి అనేక హక్కులు ఈ రోజు దేశ కార్మికులకు దక్కకుండా పోయాయి అన్నారు. వందలాది సంవత్సరాలుగా ప్రాణత్యాగాలకు సైతం ఓర్చి సాధించుకున్న హక్కులు కాగితంలో పెద్ద పులిలా ఉండేవి అని, అవి కూడా ఈ రోజు పూర్తి స్థాయిలో ఎత్తివేసి ఎఫ్ డిఐ లకు అనుకూలంగా మార్చడంతో కార్మికులందరూ వారి యొక్క న్యాయమయిన హక్కులను కోల్పోతున్నారు అని వాపోయారు.

గత 15, 16 సంవత్సరాలుగా ఎన్ హెచ్ఎం ప్రోగ్రామ్ లో భాగంగా సెకండ్ ఏఎన్ఎంలు పని చేస్తున్నప్పటికీ వారికి ఫస్ట్ ఏఎన్ఎం లతో సమానంగా వేతనాలు ఇవ్వకుండా సమానపనికి సమానవేతనం అని రాజ్యాంగం కల్పించిన హక్కు లభించకుండా, ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించకుండా అన్యాయం చేస్తున్నారు అన్నారు. 1975 అక్టోబర్ 2వ తేదీన బాలింతలు, గర్భిణీ స్త్రీలు, శిశువులు, ఆరోగ్యం కోసం ఐసిడిఎస్ ఏర్పాటు చేసి సుమారు 48 సంవత్సరాలుగా సేవలు అందిస్తున్నప్పటికీ అంగన్వాడీ టీచర్, ఆయాలను పర్మినెంట్ చేయకుండా అతి తక్కువ వేతనాలు ఇస్తు వేదిస్తున్నారు అని అన్నారు. అంగన్వాడీ టీచర్, ఆయా, సెకండ్ ఏఎన్ఎం లకు ఉద్యోగ భద్రత కల్పిస్తూ సమాన పనికి సమాన వేతనం ఇవ్వాలని, ప్రభుత్వ రంగ శాఖలలో కాంట్రాక్టు విధానం రద్దు చేసి కాంట్రాక్టు, అవుట్ సోర్సింగ్ ఉద్యోగులను వెంటనే పర్మినెంట్ చేయాలని డిమాండ్ చేశారు. అనంతరం సెకండ్ ఏఎన్ఎం లు బతుకమ్మ ఆడుతూ నిరసన వ్యక్తం చేశారు. ఈ ధర్నాలో ఏఐటియూసి జిల్లా అధ్యక్షులు రాము, ఉపాధ్యక్షులు పంతం రవి, సామల మల్లేశం, సోమ నాగరాజు, లు అంగన్వాడీ టీచర్ లు , ఆయాలు ,సెకండ్ ఏఎన్ఎం లు పాల్గొన్నారు.