రాహుల్‌పై అనర్హత..బీజేపీ  సెల్ఫ్‌ గోల్‌: శశిథరూర్‌

రాహుల్‌పై అనర్హత..బీజేపీ  సెల్ఫ్‌ గోల్‌: శశిథరూర్‌

కాంగ్రెస్‌ నేత రాహుల్‌ గాంధీపై  అనర్హత వేటు పడిన నేపథ్యంలో ఆ పార్టీ సీనియర్‌ నేత, ఎంపీ శశిథరూర్‌  కీలక వ్యాఖ్యలు చేశారు.  ఈ ఘటన భారతీయ జనతా పార్టీ  సెల్ఫ్‌గోల్‌గా అభివర్ణించారు. రాహుల్‌ అనర్హత విషయంలో లోక్‌సభ సచివాలయం గంటల వ్యవధిలో నిర్ణయం తీసుకోవడాన్ని తప్పుబట్టిన ఆయన.. ఈ ఒక్క ఘటన విపక్షాలు ఏకమవ్వడానికి కారణమైందన్నారు. ఇది రాహుల్‌ గాంధీకి సైతం మేలు చేయనుందని చెప్పారు. దీని పరిణామాలు బీజేపీ  ఎదుర్కోవాల్సి ఉంటుందని చెప్పారు.  ''రాహుల్‌ గాంధీ విషయంలో ఏం జరిగిందనేది ఇప్పుడు అన్ని చోట్లా హెడ్‌లైన్స్‌గా మారింది.

ప్రపంచంలో అన్ని దేశాలు దీని గురించి చర్చించుకుంటున్నాయి. అలాగే, ఎప్పుడూ అంటీముట్టనట్లు ఉండే విపక్షాలన్నీ ఈ ఒక్క ఉదంతంతో ఏకం అయ్యాయి. తమ తమ రాష్ట్రాల్లో కాంగ్రెస్‌ను తీవ్రంగా వ్యతిరేకించే ప్రాంతీయ పార్టీలు సైతం రాహుల్‌పై అనర్హత వేటు వేయడాన్ని ముక్త కంఠంతో ఖండించాయి'' అని శశి థరూర్‌ అన్నారు. తీర్పుపై అప్పీల్‌కు వెళ్లేందుకు గడువు ఉన్నా.. ఆగమేఘాలపై లోక్‌సభ సెక్రటేరియట్‌ అనర్హత వేటు వేయడాన్ని శశిథరూర్‌ తప్పుబట్టారు.