కొరఢా ఝుళిపించిన ఈసీ

కొరఢా ఝుళిపించిన ఈసీ
  • నలుగురు కలెక్టర్లు, 13 మంది ఎస్పీల బదిలీ
  • హైదరాబాద్, వరంగల్, నిజామాబాద్ కమిషనర్లకూ స్థానచలనం
  • రవాణా, ఎక్సైజ్​ శాఖల కార్యదర్శులకు ట్రాన్స్​ఫర్​

ముద్ర, తెలంగాణ బ్యూరో : ఎన్నికల కమిషన్ కొరఢా ఝుళిపించింది. రాష్ట్రంలో పలువురు జిల్లా కలెక్టర్లు, 13 మంది ఎస్పీలు, పోలీస్​కమిషనర్ల బదిలీకి ఈసీ ఆదేశించింది. యాదాద్రి, నిర్మల్, రంగారెడ్డి, మేడ్చల్ మల్కాజిగిరి కలెక్టర్లు వినయ్ కృష్ణారెడ్డి, వరుణ్​రెడ్డి, హరీశ్, అమయ్​ కుమార్​ ల బదిలీ, వరంగల్ పోలీస్​ కమిషనర్​ రంగనాథ్, హైదరాబాద్ సీపీ సీవీ ఆనంద్, నిజామాబాద్, ఖమ్మం సీపీలు సత్యనారాయణ, విష్ణు ఎస్​వారియర్​ను బదిలీ చేయాలని బుధవారం ఆదేశించడం కలకలం రేపింది. ట్రాన్స్ ఫర్​అయిన శాఖలకు వెంటనే ప్రత్యేక కార్యదర్శులను నియమించాలని ప్రభుత్వాన్ని ఆదేశించింది. గురువారం సాయంత్రం 5 గంటలలోపు ప్యానల్‌కు పంపాలని ఈసీ తెలిపింది.

ALSO READ: బీఆర్ఎస్​కు అనుకూలతే కారణమా..?

వీరితో పాటు రవాణా శాఖ కార్యదర్శి శ్రీనివాస రాజు, ఎక్సైజ్ శాఖ డైరెక్టర్ ముషారఫ్​అలీ పారూఖీ, వాణిజ్య పన్నుల శాఖ కమిషనర్‌ టికె శ్రీదేవీలను బదిలీ చేయాలని ఈసీ ఆదేశాలు జారీ చేసింది. అలాగే ఎక్సైజ్, వాణిజ్య పన్నుల శాఖకు ప్రత్యేక కార్యదర్శులను నియమించాలని ఆదేశించింది. అయితే పని అధికారుల పనితీరే ప్రామాణికంగా సీఈసీ ఈ నిర్ణయం తీసుకున్నట్లుగా ప్రచారం జరుగుతోంది. కాగా ఈ నెల 3 నుంచి 5 వరకు తెలంగాణలో పర్యటించిన కేంద్ర ఎన్నికల సంఘం ఎలక్షన్ల నిర్వహణపై హైదరాబాద్​లో సమీక్ష నిర్వహించిన విషయం తెలిసిందే. ఇందులో పలు ప్రభుత్వ శాఖలతో పాటు పోలీస్ శాఖ సమీక్షలో పలువురు అధికారుల పనితీరుపై ఎన్నికల సంఘం తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేసింది. అదే సమయంలో ఎన్నికల కమిషనర్​రాజీవ్​కుమార్​పనితీరుపై సదరు అధికారులను హెచ్చరించారు. పారదర్శకంగా పని చేయాల్సిన అత్యున్నత హోదా కలిగిన అధికారులే పక్షపాతంగా వ్యవహరిస్తున్న తీరుపై మండిపడ్డ సీఈసీ వారిపై బదిలీ వేటు వేయడం సంచలనం రేపుతోంది. ఈ మేరకు నేడు 5 గంటల్లోపు ప్యానల్​ పంపాలని సీఎస్​ శాంతికుమారిని ఆదేశించింది.