పోలింగ్ తో ముగిసిన ఎన్నికల సమరం

పోలింగ్ తో ముగిసిన ఎన్నికల సమరం

హుజూర్ నగర్ ముద్ర: తెలంగాణ రాష్ట్రంలో గురువారం జరిగిన పోలింగ్ తో ఎన్నికల సమరం ముగిసింది. సూర్యాపేట జిల్లా హుజూర్ నగర్ లో పోలింగ్ శాతం 86.31%గా నమోదయింది. నియోజకవర్గ వ్యాప్తంగా ఉన్న7 మండలాలలో ఏర్పాటు చేసిన 308 పోలింగ్ కేంద్రాలలో ఓటర్లు ఓటు హక్కును వినియోగించుకున్నారు.అత్యధికంగా చింతలపాలెం మండలంలో 90 శాతం అత్యల్పంగా నేరేడుచర్ల మండలలో 81 శాతంగా పోలింగ్ నమోదయింది.అక్కడక్కడ ఈవీఎంల మొరాయింపు చిన్న చిన్న సమస్యలు కారణంగా పోలింగ్ కాసేపు ఆలస్యమైనప్పటికీ అధికారులు వెంటనే స్పందించి పోలింగ్ సక్రమంగా జరిగేలా చేశారు. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలకు తావు లేకుండా పోలింగ్ ని ప్రశాంతంగా జరిగేలా ఎన్నికల సంఘం అధికారులు చర్యలు తీసుకున్నారు.

గత ఎన్నికలతో పోలిస్తే ఈసారి పోలింగ్ శాతం పెరిగింది. 2018 ఎన్నికల్లో 85.96% 2014 ఎన్నికల్లో 81.51 % గా పోలింగ్ శాతం ఉంది. బీఆర్ఎస్ అభ్యర్థి శానంపూడి సైదిరెడ్డి తన స్వగ్రామమైన మఠంపల్లి మండలం గుండ్లపల్లి గ్రామంలో ఓటు హక్కును వినియోగించుకోగా కాంగ్రెస్ అభ్యర్థి ఉత్తంకుమార్ రెడ్డి తన సతీమణి కోదాడ కాంగ్రెస్ అభ్యర్థి పద్మావతి రెడ్డి తో కలిసి కోదాడ పట్టణంలో ఓటు హక్కు వినియోగించుకున్నారు. సిఐతో బీఆర్ఎస్ అభ్యర్థి సైదిరెడ్డి వాగ్వాదం హుజూర్ నగర్ పట్టణంలోని వివి మందిర్ స్కూల్లో పోలింగ్ ప్రక్రియను పరిశీలించేందుకు వచ్చిన బీఆర్ఎస్ అభ్యర్థి శానంపూడి సైదిరెడ్డి ఎలక్షన్ డ్యూటీలో ఉన్న సిఐ లకు కాసేపు వాగ్వాదం జరిగింది.

పోలింగ్ సెంటర్ లోకి ప్రవేశించిన సైదిరెడ్డిని పార్టీ కండువా మెడలో వేసుకొని ఎందుకు వచ్చారనీ కండువాలను తీసేయాలని సీఐ ఆదేశించగా అది పార్టీ కండువా కాదని కేవలం గులాబీ రంగులో మాత్రమే ఆ కండువా ఉందని దానిపై ఎటువంటి పార్టీ గుర్తులు కానీ పేర్లు కానీ వ్యక్తుల ఫోటోలు కానీ లేవని దానికి ఎందుకు అభ్యంతరం తెలుపుతున్నారని సైదిరెడ్డి వాదనకు దిగారు.

మండలాల వారీగా హుజూర్ నగర్ పోలింగ్ వివరాలు

హుజూర్ నగర్: 84.41%

మేళ్లచెరువు : 85.57%

మఠంపల్లి : 89.12%

నేరేడుచర్ల : 81.72%

గరిడేపల్లి : 86.73%

చింతలపాలెం : 90.27%

పాలకీడు : 88.97%

మొత్తం పోలింగ్ శాతం 86.31%

నియోజకవర్గ ఓటర్ల సంఖ్య 2,47,592

పోలైన ఓట్ల సంఖ్య 2,13,702.