అక్రమ కేసులు పెట్టి వేధిస్తున్నారు  మాజీ సైనికుడు డి.వెంకటయ్య

అక్రమ కేసులు పెట్టి వేధిస్తున్నారు  మాజీ సైనికుడు డి.వెంకటయ్య

జిల్లా కలెక్టర్ కార్యాలయంలో మాజీ సైనికుడి ఫిర్యాదు.

నాగర్ కర్నూల్ ముద్ర ప్రతినిధి: గత నెలలో బిజినపల్లి మండలం పాలెం గ్రామంలో మెయిన్ రోడ్డుపై ఉన్న కీర్తిశేషులు పాలెం గ్రామ అభివృద్ధి ప్రదాత సుబ్బయ్య  విగ్రహానికి అడ్డంగా రాజకీయ నాయకుల ఫోటోలతో ఉన్న ఫ్లెక్సీలు ఏర్పాటు చేయడం జరిగిందని ఆ విషయంపై మన ఊరు పాలెం గ్రామం గ్రూపులో సుబ్బయ్య విగ్రహాం కనిపించకుండా అడ్డంగా ఉన్న ఫ్లెక్సీలను తొలగించాలని వాట్సప్ గ్రూపులో విజ్ఞప్తి చేస్తే బిఆర్ఎస్ నాయకులు నాపై అక్రమ కేసులు బనాయిస్తున్నారని మాజీ సైనికుడు పాలెం గ్రామం నివాసి డి.వెంకటయ్య సోమవారం జిల్లా కలెక్టర్ కార్యాలయంలో నిర్వహించిన ప్రజావాణి లో ఫిర్యాదు చేశారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మున్సిపల్ ఆక్ట్ నిబంధనలు ఉల్లంఘించి ఫ్లెక్సీలను ఏర్పాటు చేసిన వాటిపై జరిమానాలు విధించాలని మన  రాష్ట్ర మంత్రివర్యులు కల్వకుంట్ల తారక రామారావు చాలాసార్లు వివిధ పత్రికలు, న్యూస్ ఛానల్ ద్వారా సూచించారని, అయినా ఇక్కడి నియోజకవర్గ రాజకీయ నాయకులు నిబంధనలు ఉల్లంఘించి ఫ్లెక్సీలు రోడ్లపై అడ్డంగా కడుతున్నా వారిపై చట్టపరమైన చర్యలు తీసుకోకుండ నాపై అక్రమ కేసు బనాయించారని ఆవేదన వ్యక్తం చేశారు.

సుబ్బయ్య విగ్రహాం కనిపించకుండా ఫ్లెక్సీలు అడ్డంగా పెట్టిన వాటిని ప్రక్కన కట్టుకోవాలని విజ్ఞప్తి చేస్తే Cr.No:58/2023 ఐ.పి.సి 504,505(2) ప్రకారం అక్రమ కేసులు పెట్టించడం బాధాకరమని,కేసు పెట్టడమే కాకుండా సి. ఆర్. పి.సి 41 నోటీసు ఇవ్వకుండా ఒక ప్రభుత్వ ఉద్యోగి అయిన ఎస్సై స్టేషన్ పిలిపించుకొని మా ఎమ్మెల్యే గురించి నీకు అవసరమా అంటూ దుర్భాషలాడుతూ,నా ఫోను గుంజుకుని ఎక్స్ ఆర్మీ ఐ.డి కార్డ్ డాక్యుమెంట్స్ ఇవ్వనిచో మీపై మరిన్ని కేసులను పెట్టించగలను అని బెదిరించారని తెలిపారు. బనాయించిన అక్రమ కేసులపై రాజ్యాంగపరంగా,సమగ్రంగా విచారించ వలసిందిగా విజ్ఞప్తి చేస్తూ ప్రజల పన్నులతో జీతం తీసుకుంటూ కొంతమంది రాజకీయ నాయకుల ప్రోద్బలంతో అక్రమ కేసులు బనాయిస్తున్న బిజినపల్లి స్టేషన్ లో విధులు నిర్వహిస్తున్న ఎస్సై పై క్రమశిక్షణా చర్యలు  తీసుకోవాలని జిల్లా అధికారులను కోరారు.