చెరువుల్లో చేపలు చనిపోతున్నాయ్..

చెరువుల్లో చేపలు చనిపోతున్నాయ్..

 ఉష్ణోగ్రతల్లో మార్పులు చోటు చేసుకుంటున్నయ్.. మత్స్యకారులు అప్రమత్తమవ్వాలి.. నిర్లక్ష్యం చేస్తే మరింత నష్టం.ఎప్పటి కప్పుడు చేపలు పట్టేసుకోవాలి..

ముద్ర ప్రతినిధి, జయశంకర్ భూపాలపల్లి :ఉష్ణోగ్రతల్లో మార్పులు చోటు చేసుకుంటున్నాయి. ఈ పరిస్థితుల్లో చెరువులో ఉన్న చేపలు ఆకస్మికంగా  చనిపోతున్నాయి. మత్స్యకారులు అప్రమత్తం కాకపోతే మరిన్ని చేపలు చనిపోయే అవకాశం ఉందని ఆ శాఖ జిల్లా అధికారులు భావిస్తున్నారు. ఇటీవల రెండు చెరువుల్లో ఆకస్మికంగా చేపలు చనిపోయి నీటిలో తేలాయి. చేపలు చనిపోవడంతో మత్స్యకారులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. వాతావరణంలో చోటుచేసుకుంటున్న మార్పులకు అనుగుణంగా మత్స్యకారులు తగు జాగ్రత్తలు పాటించాలని లేనట్లయితే మరిన్ని చేపలు చనిపోయే ఆకాశాలు ఉన్నాయని ఆ శాఖ అధికారి వాపోతున్నారు.

- రెండు చెరువుల్లో మృతి చెందిన చేపలు..

 జయశంకర్ భూపాలపల్లి జిల్లా  చిట్యాల మండలం ఒడితల,  గణపురం మండలం కొండపూర్ గ్రామాల్లోని రెండు చెరువుల్లో ఇటీవలె చేపలు మృతి చెందాయి. ఆయా చెరువుల్లోని చేపలు చనిపోయి పైకి తేలడంతో మత్స్యకారులు ఆందోళన చెందుతున్నారు. గంపెడు ఆశతో చేపల పెంపకం చేపట్టడం జరిగిందని, ఈ పరిస్థితిలో ఆకస్మికంగా చేపలు చనిపోవడం తీరని దుఃఖాన్ని మిగిల్చిందని ఆవేదన చెందుతున్నారు.

తగు జాగ్రత్తలు తీసుకోవాలి..

చెరువులో చేపల పెంపకందారులు తగు జాగ్రత్తలు తీసుకోవాలని సంబంధిత మత్స్యశాఖ ఆఫీసర్లు చెబుతున్నారు. ప్రస్తుత వేసవిలో అధిక ఉష్ణోగ్రత కారణంగా జిల్లాలోని పలు చెరువుల్లో చేపలు మృత్యువాత పడ్డాయి. దీనికి గల కారణం వాతావరణంలోని మార్పులు. మత్స్యకారుల సంఘాలు, సభ్యులు ఈ విషయంపై అవగాహన పెంపొందించుకోవాల్సిన అవసరం ఉంది. చెరువులు, కుంటల్లో నీటి మట్టం తగ్గినట్లయితే త్వరగా చేపలు పట్టుకోవాలి. చెరువు లోని నీటి నాణ్యత, లోతు, విస్తీర్ణం, చేపల కదలికలు ప్రతి రోజు గమనిస్తూ ఉండాలి. చెరువులోని కొన్ని చేపలను మచ్చుకు పట్టి వాటి పెరుగుదల, రంగు, తోక, రెక్కల స్వభావము, మొప్పెల రంగు, ఫై జిగురు తదితర లక్షణాలను నిశితంగా పరిశీలించాలి. తేడాలు గమనించిన ఎడల, జిల్లా మత్స్య శాఖా అధికారి సలహాలు, సూచనలు తీసుకొని నివారణ చర్యలు సత్వరమే చేపట్టినట్లయితే ఆర్థిక నష్టాన్ని కొంత మేర తగ్గించుకోవచ్చు.
 ఉదయాన్నే చేపలు చెరువు ఫై భాగాన నోరు తెరచుకొని తిరుగుతూ ఉంటే ప్రాణవాయువు కొరత  ఉందని గమనించాలి. అలాంటి సందర్భాలలో చెరువులో నీరు పెట్టడం, ఆది సాధ్యం కాని పక్షంలో పెద్దగా పెరిగిన చేపలను పట్టి అమ్మి వేసుకోవాలి. దీనివలన చేపల సాంద్రత తగ్గడం వలన ప్రాణవాయువు కొరతను అధిగమించవచ్చు. కాని మత్స్యకారులు చేపలు మార్కెట్ సైజు రాలేదనో లేదా మార్కెట్లో రేట్లు తక్కువున్నయనో, ఐస్ దొరకకపోవటం కారణాలతో నిర్లక్ష్యం చేయొద్దు. చెరువులోని నీటి నాణ్యత తగ్గిపోయినప్పుడు సున్నాన్ని ఒక హెక్టారుకు 100 నుండి 250 కేజీల వరకు చెరువులో చల్లినట్లయితే, నీటి నాణ్యత పెరగడమే కాకుండా ప్రాణవాయువు శాతం పెరుగి ఉదజని సూచికను అదుపులో ఉంటుంది. చెరువులోని కలుపు మొక్కలని ఎప్పటి కప్పుడు తగ్గిస్తూ ఉండాలి. లేనట్లయితే రాత్రి సమయాలలో అవి కేవలం కార్బన్ డయాక్సైడ్ విడుదల చేయడం, చేపలు తీవ్ర ప్రాణవాయువు కొరత వలన ఎక్కువ మొత్తంలో చనిపోతు ఉంటాయి. అలాంటి సందర్భాలలో మత్స్యకారులు ఎవరైన గిట్టని వారు విషం కలిపారని అనుమానిస్తూ ఉంటారు. విషం కలిపినా ఎడల కర్పూ జాతి చేపలే కాకుండా కొర్రమట్ట (మర్రల్), మార్పు, జెల్లలు, తక్కువ ఆక్సిజన్ ను తట్టుకునే చేపలు, కప్పలు, నీటి పాములు కూడా చనిపోతాయి. వ్యాధితో చేపలు చనిపోయినప్పుడు వెంటనే చని పోయిన చేపలను తొలగించి చెరువుకు దూరంగా కాల్చివేయాలి లేదా ఒక గోతి తీసి అందులో పూడ్చి వెయ్యాలి. వెంటనే సున్నాన్ని ఒక హెక్టారుకు 100 నుండి 250 మోతాదులో చల్లాలి. ఇంకా అదుపులోకి రాకుంటే నీటి నాణ్యత పెంచే రసాయనాలు అనగా బీకేసీ (బెంజాల్ కొలియం క్లోరైడ్) ను ఒక హెక్టారుకు ఒక లీటరు చొప్పున నీటిలో కలిపి చెరువులో చల్లాలి. ఈ చర్యల వలన నీటి నాణ్యత పెరగడమే కాకుండా చేపల ఫై ఉన్న పరాన్న జీవులు చనిపోతాయి. ఇన్ని చేసిన తదుపరి కూడా ఎలాంటి మార్పు లేకపోతే చివరి అస్త్రంగా అంటి బయాటిక్ మందులను సూచించిన మోతాదులో మేతతో పాటు కలిపి ఇవ్వాలి. ప్రాణవాయువు పెంచుకోవడానికి చెరువులోని నీటిని మోటార్ల ద్వారా రీసైక్లింగ్ చేసుకున్న ఎడల విష వాయువులు తగ్గి ప్రాణవాయువు శాతం పెరుగుతుంది. పైన తెలిపిన సందర్బాలలో చేపలను పట్టి వేయడం అత్యంత శ్రేయస్కరం. జిల్లాలో ఉన్నా అని మత్స్య శాఖ సంఘాల పరిధిలో ఉన్న 835 చెరువులు, కుంటలలో పైన తెలిపిన సూచనలు పాటించాలని మత్స్యశాఖ అధికారులు కోరుతున్నారు.