తరిగిపోతున్న మారక నిల్వలు

తరిగిపోతున్న మారక నిల్వలు
India Forex Reserves Plunges

విదేశీ మారక నిల్వలు దేశంలో తరిగిపోతున్నాయని, అవి ఇటీవల రెండేళ్ళ కనిష్ట స్థాయికి పడిపోతున్నాయి.విదేశీ పెట్టుబడులను ఆకర్షించడం ద్వారా విదేశీ మారక నిల్వల పెంపుదలకు ప్రభుత్వం, రిజర్వ్‌ బ్యాంక్‌ అనేక చర్యలను ప్రకటించవలసి వచ్చింది. గవర్నమెంట్‌ బాండ్లు, కార్పొరేట్‌ బాండ్లలో పెట్టుబడులకు సంబంధించిన విధి విధానాలను సరళతరం చేయడంతో పాటు ఎన్‌ఆర్‌ఐల నుంచి డిపాజిట్లను ఆకర్షించేందుకు బ్యాంకులకు సంబంధించి అనేక నియమాలను కూడా సులభతరం చేసింది. విదేశీ మారక ద్రవ్య నిల్వలు విదేశీ కరెన్సీ రూపంలో వున్న ఆస్తులు. వీటిని దేశీయ కేంద్ర బ్యాంకు నిర్వహిస్తుంది. ఇవి విదేశీ కరెన్సీ బాండ్లు, ట్రెజరీ బిల్లులు, ఇతర గవర్నమెంట్‌ సెక్యూరిటీలు, బంగారం నిల్వల రూపంలో ఉంటాయి..

దేశంలో విదేశీ మారక నిల్వలు 5,24,520 మిలియన్‌ డాలర్ల స్థాయికి చేరాయి. డాలర్‌తో రూపాయి విలువ సంవత్సర కాలంలోనే 12 శాతం క్షీణించి అత్యధిక కనిష్ట స్థాయికి చేరి రూపాయి విలువ 83గా నమోదవుతున్నది. ఈ తరుణంలో, పతనమౌతున్న రూపాయి విలువను పరిరక్షించడానికి రిజర్వ్‌ బ్యాంక్‌ డాలర్లను విక్రయించడం వంటి చర్యలు కూడా విదేశీ మారక నిల్వల క్షీణతకు కారణం అనేది ఒక ప్రధాన విశ్లేషణ. ఫలితంగా రిజర్వ్‌ బ్యాంక్‌ వద్ద ఫారెక్స్‌ నిల్వలలో భారీ తగ్గుదల చోటుచేసుకుంది. ఎక్కువ విదేశీ మారక నిల్వలు అమెరికన్‌ డాలర్‌ రూపంలో నిల్వలుగా ఉండటం గమనార్హం. అయితే ఇవి బ్రిటీష్‌ ‘పౌండ్‌’, యూరోపియన్‌ ‘యూరో’, చైనీస్‌ ‘యువాన్‌’, జపనీస్‌ ‘యెన్‌’ రూపాలలో కూడా ఉంటాయి. విదేశీ మారక నిల్వలు కేవలం దిగుమతుల చెల్లింపుల పరిధికే పరిమితం కాకుండా దేశ ద్రవ్య పరపతి విధాన ప్రక్రియపై కూడా క్రియాశీలక ప్రభావితం చూపుతున్నాయి. అంతర్జాతీయ వ్యాపారాన్ని సంతులనం చేయడానికి, దేశీయ కరెన్సీ మారకం విలువను స్థిరంగా ఉంచేందుకు, స్వదేశీ, విదేశీ పెట్టుబడిదారులకు ఆర్థిక వ్యవస్థ పట్ల విశ్వాసాన్ని పాదుకొల్పటంలో కూడా ఇవి నిర్ణయాత్మకమైన పాత్రను పోషిస్తున్నాయి.

ఒక దేశం ఎగుమతుల ద్వారా సముపార్జించే ఆదాయం దిగుమతుల కన్నా ఎక్కువ మేరకు ఉన్నపుడు విదేశీ మారకపు ద్రవ్య నిల్వలలో వృద్ధి నమోదవుతుంది. కరెంట్‌ ఖాతా మిగులు వలన కూడా దేశంలో విదేశీ మారక నిల్వల పెరుగుదలకు ఆస్కారం ఏర్పడుతుంది. ఈ దిశగా గత కొన్ని సంవత్సరాలుగా క్రమంగా కూడపెట్టిన విదేశీ మారకపు ద్రవ్య నిల్వలలో చైనా, జపాన్‌, స్విట్జర్లాండ్‌ ప్రపంచంలోనే అత్యధిక విదేశీ కరెన్సీ నిల్వలు ఉన్న దేశాలుగా ఆవిర్భవించటం గమనార్హం.ఫారెక్స్‌ నిల్వలు 2022 మార్చి 31, నాటికి 607.31 బిలియన్ల స్థాయికి చేరినప్పటికీ, దీనికి భిన్నంగా సరుకుల వర్తకపు లోటు 1.2 ట్రిలియన్‌ డాలర్లకు చేరింది. సాఫ్ట్‌వేర్‌ ఉత్పత్తులు, ఇతర దేశాలలో ఉన్న భారతీయులు దేశానికి పంపుతున్న నగదు నిల్వలు, పర్యాటకం వంటి పరిశ్రమలు, ఆదాయం ఆర్థిక వ్యవస్థకు జమ అవుతుండగా, రుణాలపై వడ్డీ, రాయల్టీలు, డివిడెండ్‌ చెల్లింపులు, లైసెన్స్‌ ఫీజులు, విదేశీ ప్రయాణాలు, ఇతర ఆర్థిక సేవలకు చెల్లింపుల స్థాయిలో కూడా గణనీయమైన వృద్ధి నమోదయింది.ఈ సంవత్సరం ఏప్రిల్‌ 2వ తేదీన 606.475 బిలియన్‌ డాలర్లుగా ఉన్న ఫారెక్స్‌ నిల్వలు సెప్టెంబర్‌ 23 నాటికి 537.5 బిలియన్‌ డాలర్ల స్థాయికి తగ్గిపోయాయి. ఇటీవల ఒక దశలో భారతదేశ విదేశీ మారక నిల్వలు 23 నెలల కనిష్ట స్థాయికి పడిపోయాయి. ఫారెక్స్‌ నిల్వలలో మెజారిటీ వాటా కలిగిన విదేశీ కరెన్సీల విలువ 652.7 కోట్ల డాలర్లు తగ్గి 49,211 కోట్ల డాలర్లకు పడిపోయింది.

బంగారం నిల్వలు కూడా 133 కోట్ల మేర తగ్గి 3,830 కోట్ల డాలర్లుకు పరిమితమైనాయి. అంతర్జాతీయ ద్రవ్యనిధి సంస్థ (ఐఎంఎఫ్‌) వద్ద దేశ ప్రత్యక్ష డ్రాయింగ్‌ రైట్స్‌ (ఎస్‌డిఆర్‌) విలువ 5 కోట్ల డాలర్ల మేర తగ్గి 1778 కోట్ల డాలర్ల స్థాయికి దిగజారింది. ఐఎంఎఫ్‌ వద్ద దేశ నిల్వల స్థాయి 2.4 కోట్ల డాలర్లు క్షీణించింది.అంతర్జాతీయ కరెన్సీల స్థాయితో పోలిస్తే ఈ ఆర్థిక సంవత్సరంలో సెప్టెంబర్‌ మాసాంతానికి అమెరికన్‌ డాలర్‌ 14.5 శాతం మేరకు బలపడి వృద్ధి చెందగా ఇదే సమయంలో భారతదేశ రూపాయి 7.4 శాతం క్షీణించింది. అక్టోబరు మాసంలో మొత్తం ఫారిన్‌ రిజర్వ్‌లలో సింహభాగంగా ఉన్న ఫారిన్‌ కరెన్సీ ఎసెట్స్‌ (ఎఫ్‌సిఎ) 3.59 బిలియన్‌ డాలర్లు తగ్గి 465.08 బిలియన్లుగా ఉన్నాయి. రూపాయి విలువ 83 స్థాయికి పడిపోయిన నేపథ్యంలో కరెన్సీ క్షీణతను కాపాడడానికి రిజర్వ్‌ బ్యాంకు 100 బిలియన్ల విదేశీ నిల్వలను వినియోగించింది. పరిస్థితిని అంచనా వేసి విదేశీ ద్రవ్య మార్కెట్‌లో కల్పించుకోవలసి వస్తుందన్న ఆర్‌బిఐ అంచనా పొంచి ఉన్న ప్రమాదానికి సంకేతం. ఆర్థిక రంగంలో అనేక విపత్తులకు విదేశీ మారక ద్రవ్య నిల్వల లోటు ప్రభావం కారణమౌతోంది. సహజ వనరులు, బంగారం వంటి నిల్వలు ఉన్నప్పటికీ విదేశీ మారక ద్రవ్యానికి ఉన్న లిక్విడిటీ వీటికి ఉండడు. త్వరితగతిన అంతర్జాతీయ వ్యాపార లావాదేవీలు నిర్వహించే పరిస్థితులలో స్థబ్దత ఏర్పడి దేశీయ కరెన్సీ పట్ల విశ్వవిపణిలో విశ్వాసం సన్నగిల్లే పరిస్థితులు ఏర్పడతాయి.