జేపీఎస్ సోనిది ముమ్మాటికీ ప్రభుత్వ హత్యే

జేపీఎస్ సోనిది ముమ్మాటికీ ప్రభుత్వ హత్యే

కోదాడ, ముద్ర: జూనియర్ పంచాయితీ కార్యదర్శులు తమ న్యాయ మైన డిమాండ్ ల సాధనకు సమ్మె చేస్తుంటే ప్రభుత్వం పరిష్కరించకుండా నిమ్మకు నిరేత్తినట్లు వ్యవహరిస్తుందని బీఎస్పీ కోదాడ నియోజకవర్గ ఇంచార్జీ పిల్లుట్ల శ్రీనివాస్ మండిపడ్డారు. శనివారం కోదాడ పట్టణంలోని బిఎస్పీ కార్యాలయంలో ఆయన రాష్ట్రంలో తీవ్ర రూపం దాల్చిన ఈ సమస్య పై ఆయన విలేకరుల సమావేశంలో మాట్లాడారు. రాష్ట్ర ముఖ్యమంత్రి, పంచాయితీ రాజ్ శాఖ మంత్రి జెపిఎస్ లను పట్టించుకోకపోగా, ఉద్యోగంలో చేరకపోతే తొలగిస్తామని బెదిరింపులకు పాల్పడడం వల్లే అభద్రతా భావంతో మనస్తాపానికి గురై, వరంగల్ జిల్లా ఖానాపూర్ మండలంలో భైరి సోని అనే ఉద్యోగిని గ్రామ పంచాయితీ కార్యాలయంలోనే పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకుందని ఆవేదన వ్యక్తం చేశారు.

ఇది ఆత్మహత్య కాదని ముమ్మాటికీ ప్రభుత్వ హత్యేనని ఆగ్రహం వ్యక్తం చేశారు. బీయస్పీ రాష్ట్ర ఈసీ మెంబర్ కొండ భీమయ్య గౌడ్ మాట్లాడుతూ సోని మరణంపై ప్రభుత్వం వెంటనే స్పందించి,కోటి రూపాయల ఎక్స్ గ్రేషియా ప్రకటించి, కుటుంబంలో ఒకరికి ఉద్యోగం కల్పించాలని బీయస్పీ డిమాండ్ చేస్తుందన్నారు. పరీక్ష రాసి వచ్చినటువంటి జూనియర్ పంచాయతీ కార్యదర్శులును పర్మినెంట్ చేయకపోవడం దురదృష్టకరమన్నారు. ఈ కార్యక్రమంలో నియోజకవర్గ అధ్యక్షులు కందుకూరి ఉపేందర్, కోశాధికారి పాతకోట్ల శ్రీనివాస్, నియోజకవర్గ మహిళా కన్వీనర్ అంతోటి జ్యోతి, నియోజకవర్గ బీవీఎఫ్ కన్వీనర్ కత్తి నాగబాబు, కో కన్వీనర్ ముదిగొండ నాగయ్య, నియోజకవర్గ నాయకులు నెమ్మాది సురేష్ తదితరులు పాల్గొన్నారు.