జియో... గయా..

జియో... గయా..
  • జిల్లాలో 5 గంటలపాటు స్తంభించిన నెట్వర్క్...
  • తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్న వినియోగదారులు..

ముద్ర పెద్దపల్లి ప్రతినిధి:- టెలికం రంగంలో దిగ్గజం అయిన జియో సంస్థ నెట్వర్క్ మంగళవారం ఒక్కసారిగా స్తంభించిపోయింది. మధ్యాహ్నం అందాల బంతిలో 9:30 నుంచి గోదావరిఖనిలో 12 గంటల ప్రాంతంలో జియో నెట్వర్కు కు సంబంధించి సిగ్నల్ పూర్తిగా కనుమరుగయింది. పెద్దపల్లి జిల్లాలో రామగుండం, మంథని, పెద్దపల్లి ప్రాంతాలలోని జియో టవర్ల నుంచి సెల్ ఫోన్లకు పూర్తిగా సిగ్నల్ ఆగిపోయింది. దీంతో జియో ఇంటర్నెట్ సేవల పూర్తిగా స్తంభించి పోవడంతో పాటు కాల్స్ కూడా పనిచేయకపోవడంతో వినియోగదారులు తీవ్రంగా ఇబ్బందులు ఎదుర్కొన్నారు.

అసలేం జరిగిందో తెలియక చాలామంది వినియోగదారులు తికమక పడ్డారు. కొంతమంది తమ సెల్ ఫోన్ లోనే సమస్య వచ్చిందేమో అని సర్వీస్ సెంటర్లకు పరుగులు తీశారు. తర్వాత జియో సేవలు అంతటా స్తంభించిపోయాయని తెలుసుకొని ఆందోళన చెందారు. సాయంత్రం 4:30 గంటలకు తర్వాత మళ్లీ జియో నెట్వర్క్ సేవలు పునరుద్ధరణ కావడంతో వినియోగదారులు ఊపిరి పీల్చుకున్నారు. ఇది ఇలా ఉండగా జియో నెలవారి కాల పరిమితి పూర్తయి మళ్లీ రీచార్జ్ చేసుకోవడంలో ఒకటి రెండు రోజులు ఆలస్యం అయితేనే జియో సంస్థ నుంచి గంటకొకసారి ఫోన్ చేసి రీఛార్జ్ చేసుకోవాలంటూ ఇబ్బందులు పెట్టే సంస్థ సిబ్బందికి మరి సేవలు మాత్రం అంతంత మాత్రంగానే అందించడం పట్ల వినియోగదారులు మంగళవారం జిల్లా అంతట విమర్శలు, ఆందోళన వ్యక్తం చేశారు.