కెసిఆర్ ది నియంత పాలన

కెసిఆర్ ది నియంత పాలన
  • జూనియర్ పంచాయతీ  కార్యదర్శులను వెంటనే రెగ్యులరైజ్ చెయాలి
  • వ్యవసాయ కార్మిక సంఘం రాష్ట్ర కార్యదర్శి  సృజన్ కుమార్

ముద్ర ప్రతినిధి కరీంనగర్ : తెలంగాణను కెసిఆర్ నియంతలా పాలిస్తున్నాడని తెలంగాణ వ్యవసాయ కార్మిక సంఘం రాష్ట్ర కార్యదర్శి కొయ్యడ సృజన్ కుమార్ అన్నారు. జూనియర్ పంచాయతీ కార్యదర్శులను వెంటనే రెగ్యులరైజ్ చేయాలని   రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. 

ఉద్యోగ భద్రతలో భాగంగా తమ డిమాండ్లను నెరవేర్చాలని న్యాయ బద్దంగా సమ్మె చేస్తున్న జూనియర్ పంచాయతీ కార్యదర్శుల పట్ల రాష్ట్ర ప్రభుత్వం నిర్లక్ష్యం చేయకుండా వారితో చర్చలు జరిపి సమస్యల పరిష్కారానికి ప్రభుత్వం చొరవ చూపాలని అన్నారు. గ్రామాల అభివృద్ధిలో పంచాయతీ కార్యదర్శుల పాత్ర కీలకమని అటువంటి వారికి భద్రత లేకపోవడం బాధాకరంగా ఉందన్నారు. సీఎం కేసీఆర్ ఇచ్చిన హామీ ప్రకారం పంచాయతీ కార్యదర్శుల సమస్యలను పరిష్కరించాలని కోరారు. వివిధ ప్రభుత్వ రంగ సంస్థలలో పని చేస్తున్న కాంటాక్టు, ఔట్ సోర్సింగ్ కార్మికులను అణగదొక్కిన మాదిరిగా వీరి ఉద్యమాన్ని అణిచివేయాలని చూడడం సరికాదన్నారు.

క్షేత్రస్థాయిలో పంచాయతీ కార్యదర్శులు ఎదుర్కొంటున్న సమస్యలను శాసన సభ్యులు రాష్ట్ర ముఖ్యమంత్రి దృష్టికి  తీసుకెళ్లి పంచాయతీ కార్యదర్శుల డిమాండ్లను వెంటనే పరిష్కరించేలా కృషి చేయాలన్నారు. సమస్యను పరిష్కరించకుండా కొన్ని జిల్లాల్లో ఉద్యమాన్ని అణిచి వేయడానికి కుట్ర చేస్తూ పోలీసుల చేత టెంట్లను తొలిగిస్తున్నారని ఆవేదన వ్యక్తంచేశారు.
 ఉదయం నుంచి రాత్రి వరకు విధులు నిర్వహిస్తున్న ఉద్యోగ భద్రత లేకపోవడంతో వారి కుటుంబాలు రోడ్డున పడ్డాయని,కుటుంబ సభ్యులతో కలిసి నాలుగు రోజులుగా సమ్మె చేస్తున్న ఎందుకు పట్టించుకోవడం లేదని ప్రశ్నించారు. సీఎం కేసీఆర్ హిట్లర్ లా నియంత పాలన చేస్తున్నారని ఆరోపించారు. జూనియర్ పంచాయతీ కార్యదర్శుల సమస్యలను పరిష్కరించి వారిని వెంటనే రెగ్యులరైజ్ చేయాలని సృజన్ కుమార్ రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.