దళిత బంధులో అవినీతికి పాల్పడిన ఎమ్మెల్యేల చిట్టా బహిరంగ పరచాలి..

దళిత బంధులో అవినీతికి పాల్పడిన ఎమ్మెల్యేల చిట్టా బహిరంగ పరచాలి..
  • ఎమ్ ఎస్ పి జిల్లా నేతలు రాజన్న, శ్రీనివాస్..
  • భూపాలపల్లిలో కొనసాగుతున్న ఎంఎస్ పీ దీక్షలు..

ముద్ర ప్రతినిధి, జయశంకర్ భూపాలపల్లి: దళిత బంధులో అవినీతికి పాల్పడిన ఎమ్మెల్యేల చిట్టా బహిరంగ పరచాలని ఎం ఎస్ పి జిల్లా కన్వీనర్ గట్ల రాజన్న, జిల్లా కోఆర్డినేటర్ నోముల శ్రీనివాస్ లు డిమాండ్ చేశారు. జయశంకర్ భూపాలపల్లి జిల్లా కేంద్రంలో ఎం ఎస్ పి ఆధ్వర్యంలో చేపట్టిన దీక్ష శనివారం రెండో రోజుకు చేరింది. దీక్షకు వారు ముఖ్య అతిథులుగా పాల్గొని మాట్లాడుతూ దళిత బంధు పథకంలో లబ్ధిదారుల వద్ద రూ.2 లక్షల నుండి రూ.3 లక్షల వరకు తీసుకున్న ఎమ్మెల్యేల చిట్టాను ముఖ్యమంత్రి కేసీఆర్ తెలంగాణ ప్రజల ముందు వెంటనే బహిరంగపరచకపోవడం ఎంతవరకు సమంజసమన్నారు. తెలంగాణలో అవినీతిలేని పాలనను అందిస్తామని, కన్నా కొడుకు తప్పు చేసినా సహించేది లేదని మాట్లాడిన కేసీఆర్, బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు దళితుల దగ్గర నుండి రూ.2 లక్షల నుండి రూ.3 లక్షల వరకు లంచం తీసుకుంటుంటే ఎందుకు చర్యలు తీసుకోవడం లేదని ప్రశ్నించారు. అవినీతి ఎమ్మెల్యేల చిట్టా ఉందని మాట్లాడుతున్న కేసీఆర్ ఎమ్మెల్యేల మీద చర్యలు తీసుకోకుండా కేవలం హెచ్చరిక చేసి వదిలేయడమంటే వారి అవినీతిని స్వయంగా  ప్రోత్సహిస్తున్నట్లుగా ఉందని ఎద్దేవా చేశారు. తక్షణమే ముఖ్యమంత్రి కేసీఆర్ దళిత బంధులో అవినీతికి పాల్పడిన ఎమ్మెల్యేలను పార్టీ నుండి సస్పెండ్ చేయాలని మండిపడ్డారు. 

పార్టీ నుండి సస్పెండ్ చేయకపోతే కేసీఆర్ ప్రభుత్వమే అవినీతికి పాల్పడుతుందని దళిత సమాజం భావించాల్సి వస్తుందని అన్నారు. సీఎం అవినీతి ఎమ్మెల్యేలను కాపాడుకునే ప్రయత్నం చేస్తున్న నేపథ్యంలో రాష్ట్ర గవర్నర్ తక్షణమే స్పందించి ముఖ్యమంత్రి కార్యాలయం నుండి ఎమ్మెల్యేల చిట్టాను తెప్పించుకోవాలని అన్నారు. దళిత బంధులో ఎమ్మెల్యేలు తీసుకున్న డబ్బులను తిరిగి లబ్ధిదారులకు ఇప్పించాలని, ఈ పథకంలో ఎమ్మెల్యేల జోక్యాన్ని తొలగించి దళితులకు న్యాయం చేయాలని కోరారు. అవినీతి జరుగకుండా దళిత బంధును అమలు చేయాలని వారు డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో ఎంఎస్ పి నియోజకవర్గ ఇంచార్జి గాజుల భిక్షపతి, మండల కన్వీనర్ అంతడుపుల సురేష్, 15వ వార్డు అధ్యక్షులు వైనాల శోభన్ బాబు, నాయకులు బోడికల సమ్మయ్య, రత్నం శంకర్, రేణిగుంట్ల శ్రావణ్ కుమార్, అంతడుపుల రవిశంకర్, ఎమ్మార్పీఎస్ మండల కన్వీనర్ దోర్నాల అబ్బాస్, నాయకులు ఏసు రాజు, తిరుపతి, దోర్నాల భరత్, భార్గవ్, లడ్డు పాల్గొన్నారు.