మన ఊరు - మనబడి పనులపై కలెక్టర్ అసంతృప్తి

మన ఊరు - మనబడి పనులపై కలెక్టర్ అసంతృప్తి

కుంటి సాకులు చెబితే ఇక ముందు ఉపేక్షించేది లేదని హెచ్చరిక
ముద్ర ప్రతినిధి, మెదక్: మన ఊరు- మన బడి పల్ల నిర్మాణపై జిల్లా కలెక్టర్ రాజర్షి షా అసంతృప్తి వ్యక్తం చేశారు. గురువారం కలెక్టరేట్ లో ఎగ్జిక్యూటివ్  ఏజెన్సీలు, మండల విద్యాధికారులు, ప్రధానోపాధ్యాయులతో ఏర్పాటు చేసిన సమావేశంలో మాట్లాడుతూ ఇటీవల నిర్వహించిన  సమావేశంలో నెల వారీగా పాఠశాలల పనుల పురోగతి  లక్ష్యాన్ని నిర్దేశిస్తూ  ఆ మేరకు పనులను వేగవంతం చేస్తూ, చేసిన ఖర్చుకు ఎఫ్.టి.ఓ.లో నమోదు చేస్తూ కలెక్టర్ లాగిన్ కు పంపాల్సిందిగా సూచించినా ఆశించిన పురోగతి లేకపోవడంపట్ల తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. సమీక్ష సమావేశాలు పెట్టి ఏమి లాభమన్నారు. నిధుల కొరత లేదు, 30 లక్షల రూపాయలలోపు పనులను ఏప్రిల్ నెలాఖరు నాటికి పూర్తి చేయాల్సిందిగా  జిల్లా కలెక్టర్ రాజర్షి  షా ఎగ్జిక్యూటివ్  ఏజెన్సీలను ఆదేశించారు.  ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ఈ కార్యక్రమంలో  అలసత్వం వహించిన, కుంటి  సాకులు చెప్పినా  ఇక ముందు ఉపేక్షించేది లేదని హెచ్చరించారు. జిల్లాలో మన ఊరు మన బడి, ఉపాధి హామీ పధకం క్రింద 313 పాఠశాలలో  సుమారు 130 కోట్ల ఖర్చుతో వివిధ కాంపోనెంట్ పనులు చేపట్టాలని లక్ష్యం కాగా ఇప్పటి వరకు 262 పాఠశాలలో పనులు చేపట్టామన్నారు. ఇందులో 30 లక్షల లోపు పనులను 256 పాఠశాలలో, ఆపై పనులు  57 పాఠశాలలో చేపట్టామని,  మిగతా పాఠాశాలల పనులు  టెండరు దశలో ఉన్నాయని, వాటిని నామినేషన్ పద్దతిలో చేపట్టాలని అధికారులకు సూచించారు. 30 లక్షల పైన కోటి రూపాయల లోపు పనులకు టెండర్ రానట్లయితే స్కూల్ మేనేజిమెంట్ కమిటీ ద్వారా తీర్మాణం  చేసి నామినేషన్ పద్దతితో నాణ్యతగా పనిచేసే మంచి కాంట్రాక్టరుకు పనులు అప్పగించవలసినదిగా కలెక్టర్ అధికారులకు సూచించారు. అదేవిధంగా టెండర్ వేసి    పనులు చేపట్టేందుకు ముందుకు రాని  కాంట్రాక్టర్ల స్థానంలో నామినేషన్ పద్దతిలో పనులు చేపట్టాలన్నారు. పనులు వేగవంతం చేయడానికి వేసవి కాలం మంచి సమయమని, జులై దాటితే వర్షాలు పడతాయి, పనులకు ఆటంకం కలుగుతుందని, కాబట్టి  పరిపాలనా ఆమోదం పొందిన 30 లక్షల లోపు పనులతో పాటు ఆపై పనులను కూడా  చేపట్టి పూర్తి చేసేలా ఇంజనీరింగ్ అధికారులు, మండల్ నోడల్ అధికారులు, ప్రధానోపాధ్యాయులు కాంట్రాక్టర్లను ప్రోత్సహించాలన్నారు.


ఈ సమావేశంలో జిల్లా విద్యాశాఖాధికారి రాధాకిషన్, పంచాయత్ రాజ్ ఈఈ యుగంధర్, నీటిపారుదల ఈఈ శ్రీనివాస్, మిషన్ భగీరథ ఇంజనీరింగ్ అధికారి దినేష్, జిల్లా సైన్స్ అధికారి రాజిరెడ్డి,  విద్యాధికారులు, ప్రధానోపాధ్యాయులు, వివిధ ఏజెన్సీల డిప్యూటీ ఈఈలు, ఏ.ఈ.లు తదితరులు పాల్గొన్నారు.


25 నాటికి అదనంగా 32 కోట్ల పనులు చేయాలి
ఉపాధి హామీ పధకం క్రింద ఈ నెల 25 నాటికి అదనంగా 32 కోట్ల రూపాయల విలువగల సి.సి. రోడ్లు, మన ఊరు మన బడి క్రింద పాఠశాలలో కిచెన్ షెడ్ లు, ప్రహరీ గోడలు, శౌచాలయాల  వంటి నిర్మాణాలు చేపట్టి ఖర్చును జెనెరేట్ చేస్తూ ఎఫ్.టి.ఓ.లో వివరాలు నమోదు చేయాలని జిల్లా కలెక్టర్ రాజర్షి షా అధికారులకు సూచించారు.  ఆడిటోరియంలో వైకుంఠధామాలు, రైతు వేదికలు, తెలంగాణాకు క్రీడా ప్రాంగణాలు, నర్సరీలు, కూలీలకు ఉపాధి తదితర కార్యక్రమాలపై మండలాల వారీగా సమీక్షించారు. ఈ సందర్భంగా మాటాడుతూ ఉపాధి హామీ పధకం క్రింద 55 కోట్ల ఖర్చు లక్ష్యానికి గాను ఇంతవరకు 23 కోట్లు ఖర్చు చేశామని, మిగతా 32 కోట్ల రూపాయలను ఈ నెల 25 నాటికి  వేగవంతంగా పనులు చేపట్టి ఖర్చు చేయాలని, లేనిచో నిధులు ల్యాప్స్ అయ్యే ప్రమాదముందన్నారు.


ఈ సమావేశంలో డి.ఆర్.డి.ఓ. శ్రీనివాస్, జిల్లా పరిషద్ సి.ఈ.ఓ. వెంకట శైలేష్, జిల్లా పంచాయతీ అధికారి సాయిబాబ, పంచాయత్ రాజ్ ఈఈ యుంగధర్, మిషన్ భగీరథ అధికారి కమలాకర్, మండల అభివృద్ధి అధికారులు, డివిజనల్ పంచాయతీ అధికారులు, ఏ.పి.ఓ.లు పాల్గొన్నారు.