మెదక్ జిల్లా కాంగ్రెస్ అధ్యక్షులు కంఠారెడ్డి తిరుపతి రెడ్డి పదవికి రాజీనామా

మెదక్ జిల్లా కాంగ్రెస్ అధ్యక్షులు కంఠారెడ్డి తిరుపతి రెడ్డి పదవికి రాజీనామా

ముద్ర ప్రతినిధి, మెదక్:మెదక్ జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు కంఠారెడ్డి తిరుపతి రెడ్డి తన పదవికి రాజీనామా చేశారు. ఈ మేరకు రాజీనామా పత్రం విడుదల చేశారు.  సుమారు గత పది సంవత్సరాల పాటు పార్టీ పటిష్టతకు కష్టపడి పని చేసిన నాలాంటి కార్యకర్తలకు ఈ పార్టీలో స్థానం లేదనే విషయం, ఈ మధ్య పార్టీలో వరుసగా జరుగుతున్న పరిణామాలు చూస్తే ఎవరికైనా అర్థమౌంతుందన్నారు. కాంగ్రెస్ పార్టీ కోసం చేసిన సేవలు, పార్టీ బలోపేతం కోసం చేసిన త్యాగాలు, పడ్డ కష్టాలు గుర్తించకుండా, కేవలం డబ్బు సంచులే ప్రాతిపదికగా జరుగుతున్న పార్టీ టికెట్ల కేటాయింపులపై ప్రతినిత్యం వస్తున్న ఆరోపణలు, వాటి పరిణామాలను చూసి నేను తీవ్రమైన మనోవేదనకు లోనయ్యాను. అనేక సంవత్సరాల పాటు విస్తృతంగా పార్టీని బలోపేతం చేసేందుకు నా శాయశక్తుల కృషిచేసి, నేను అందుకోసం అనేక అక్రమ పోలీస్ కేసులను ఎదుర్కొని న్యాయస్థానాల చుట్టూ తిరుగుతున్నాను. కానీ జీవితాంతం కాంగ్రెస్ కు వ్యతిరేకంగా పనిచేసిన వ్యక్తులకు నాయకత్వం అప్పగించడంతో, వారి చేతిలో పార్టీ బందీ అయ్యిందన్నారు. అలాంటి వారి నాయకత్వంలో పార్టీకి మనుగడ లేదు, ప్రజలకు కూడా ఉపయోగం లేదు, రాష్ట్రానికి ప్రయోజనం లేదు, కేవలం నోట్ల కట్టలను నమ్ముకునే వారు, రేపు రాష్ట్రాన్ని, తెలంగాణ ఆత్మగౌరవాన్ని నడిబజారులో నవ్వుల పాలు చేయడం ఖాయమన్నారు. 

గత పది సంవత్సరాలుగా పార్టీ అధికారంలో లేకున్నా ప్రజా క్షేత్రంలో ఉంటూ నేను పార్టీ పఠిష్టతకై పూర్తి అంకిత భావముతో పనిచేశానన్నారు. కర్ణాటక రాష్ట్ర ఎన్నికల తర్వాత తెలంగాణలో రాష్ట్రంలో పార్టీ పుంజుకుంటుందని నాలాంటి అనేకమంది కాంగ్రెస్ కార్యకర్తలు భావించారు, కర్ణాటక మోడల్, కాంగ్రెస్ మోడల్ అంటూ హడావిడి చేసిన పార్టీ నాయకత్వ వ్యవహార శైలి ఇప్పుడు అనేక అనుమానాలకు దారి తీస్తుందన్నారు. కేవలం డబ్బు సంచులు కలిగిన నాయకులకే సీట్లు అప్పగించడం కాంగ్రెస్ మోడల్, అని ప్రజలు విశ్వసించేలా పరిణామాలు ఉన్నాయన్నారు. నిఖార్సైన కాంగ్రెస్ కార్యకర్తలకు, ప్రజలతో సత్సంభదాలు, నిరంతరము ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలపై పోరాటం సాగిస్తున్న నాయకులకు కాకుండా, కేవలం డబ్బుల సంచులు ఉన్న నాయకులకు మాత్రమే సీట్లు దక్కుతాయని తేటతెల్లమైందన్నారు. వీటిపై ఏ.ఐ.సీ.సీ అధ్యక్షుడితోపాటు, సోనియా గాంధీ, రాహుల్ గాంధీ లాంటి అగ్ర నాయకులు కూడా మౌనం వహించడం నాకెంతో బాద కలిగించిందన్నారు. 

ఒక నిఖార్సైన కాంగ్రెస్ కార్యకర్తగా ఇలాంటి పరిణామాలను జీర్ణించుకొనలేక, చూస్తూ పార్టీలో ఉండ లేక, బరువెక్కిన గుండెతో కాంగ్రెస్ పార్టీని వీడటం తప్ప మరో మార్గం కనిపించడం లేదని లేఖలో పేర్కొన్నారు.పై విషయములు అన్ని దృష్టిలో ఉంచుకుని మనోవేధనతో ఈ నా రాజీనామా లేక ద్వారా మెదక్ జిల్లా కాంగ్రెస్ అధ్యక్ష పదవికి, కాంగ్రెస్ పార్టీ ప్రాథమిక సభ్యత్వానికి కూడా రాజీనామా చేస్తున్నట్లు తిరుపతి రెడ్డి ప్రకటించారు. కాంగ్రెస్ పార్టీలో ఇన్ని రోజులు నాకు అన్ని విధాల సహకరించిన వారందరికి కృతజ్ఞతలు తెలిపారు.