ఆత్మగౌరవ భవనాలు ఎంతగానో ఉపయోగం ముదిరాజ్ భవనానికి మంత్రి హరీష్ శంకుస్థాపన

ఆత్మగౌరవ భవనాలు ఎంతగానో ఉపయోగం ముదిరాజ్ భవనానికి మంత్రి హరీష్ శంకుస్థాపన

ముద్ర ప్రతినిధి, మెదక్: జిల్లా కేంద్రం మెదక్ పట్టణంలో ముదిరాజ్ ఆత్మగౌరవ భవనానికి రాష్ట్ర ఆర్ధిక శాఖ మంత్రి హరీశ్ రావు సోమవారం రాత్రి శంకుస్థాపన చేశారు. ఈ కార్యక్రమంలో మండలి డిప్యూటీ చైర్మన్ బండ ప్రకాష్, మెదక్ ఎమ్మెల్యే పద్మ దేవేందర్ రెడ్డి, ఎమ్మెల్సీ శేరి సుభాష్ రెడ్డి, మహిళా కమిషన్ చైర్మన్ సునీత లక్ష్మారెడ్డి, నర్సాపూర్,ఆందోల్ ఎమ్మెల్యేలు మదన్ రెడ్డి, ఎమ్మెల్యే క్రాంతి కిరణ్, స్థానిక ప్రజా ప్రతినిధులు, ముదిరాజ్ సామాజిక వర్గ నాయకులు పాల్గొన్నారు. ఈ సందర్బంగా సభలో మంత్రి హరీశ్ రావు మాట్లాడుతూ ఆత్మగౌరవ భవనాలకు ఉమ్మడి మెదక్ జిల్లా వేదిక అయిందన్నారు. జహీరాబాద్, సంగారెడ్డి, గజ్వేల్, సిద్దిపేటలో ఆత్మగౌరవభవనాలు ఏర్పటయ్యాయన్నారు. సమాజంలో ముందుకు సాగేందుకు ఈ ఆత్మగౌరవ భవనాలు ఎంతగానో ఉపయోగపడతాయని పేర్కొన్నారు.

దాదాపు 1000 కోట్లు ఖర్చు చేసి ముదిరాజ్ సామాజిక వర్గానికి రాష్ట్ర ప్రభుత్వం అనేక సంక్షేమ కార్యక్రమాలు చేపట్టిందన్నారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో కాంగ్రెస్ పాలనలో చెరువుల బోరేసి నీళ్ళు తీసుకున్న రోజుల నుండి ఇప్పుడు చెరువులో నీళ్లు ఎక్కువయ్యే వరకు వచ్చిందన్నారు. తెలంగాణలో మత్స్యకారుల సంఘంలో నాలుగున్నర లక్షల మంది సభ్యత్వం నమోదయిందని, తెలంగాణ రాకముందు రెండు లక్షల మాత్రమే ఉండేదన్నారు. ఇంకా 3 లక్షల మందికి సభ్యత్వం ఇప్పించే అవకాశం ఉందన్నారు. ముదిరాజ్ సామాజిక వర్గం నుండి మండలి డిప్యూటీ చైర్మన్గా బండ ప్రకాష్ కు అవకాశం ఇచ్చారన్నారు. ముదిరాజ్ సామాజిక వర్గానికి తెలంగాణ ప్రభుత్వం తగిన గౌరవాన్ని ఇస్తుందన్నారు. భవిష్యత్తులో ముదిరాజ్ సామాజిక వర్గం నుండి ఎమ్మెల్యేలు రావాలని కోరుకుంటున్నామన్నారు. మీ తోడుతో మూడవసారి కేసీఆర్ ప్రభుత్వం అధికారంలోకి వస్తుందని ధీమా వ్యక్తం చేశారు.