బస్సుల్లేక తిప్పలు... సారూ అర్ధరాత్రి కూడా బస్సులు నడపండి

బస్సుల్లేక తిప్పలు... సారూ అర్ధరాత్రి కూడా బస్సులు నడపండి

ముద్ర,హైదరాబాద్:- గ్రేటర్‌లో ఆర్టీసీ బస్‌ సర్వీసులు అర్ధరాత్రి కూడా నడపాలని ప్రయాణికులు కోరుతున్నారు. జిల్లాల నుంచి ఎంజీబీఎస్‌, జేబీఎస్లకు రాత్రి 12 గంటల తర్వాత పదుల సంఖ్యలో బస్సుల రాకపోకలు సాగిస్తుంటాయి. జిల్లాల నుంచి బస్టాండ్లకు వచ్చిన ప్రయాణికులు నగరంలోని ఇళ్లకు చేరేందుకు బస్సులు లేక ఇబ్బందులు పడుతున్నారు. రాత్రి సమయంలో ఆటోవాలాలు రెట్టింపుచార్జీలు వసూలు చేస్తున్నారంటూ ప్రయాణికులు చెబుతున్నారు.

సికింద్రాబాద్‌ నుంచి పఠాన్‌చెరువు వరకు అర్ధరాత్రి తర్వాత ఆర్టీసీ రెండు బస్సులు నడుపుతోంది. అదే తరహాలో సికింద్రాబాద్‌ నుంచి బోరబండ, కొండాపూర్‌, కోఠి, ఉప్పల్‌, కూకట్‌పల్లి ప్రాంతాలకూ నైట్‌ సర్వీసులు నడపాలన్న డిమాండ్లు పెరుగుతున్నాయి. రాత్రి 12 నుంచి ఉదయం 6 గంటల వరకు రద్దీ రూట్లలో బస్సులు నడిపితే తక్కువ చార్జీలతో ఇళ్లకు చేరుకునే అవకాశాలుంటాయని ప్రయాణికులు కోరుతున్నారు.