యువతికి పునర్జన్మనిచ్చిన శ్రీరామానుజ సేవా ట్రస్ట్

యువతికి పునర్జన్మనిచ్చిన శ్రీరామానుజ సేవా ట్రస్ట్

హైదరాబాద్, ముద్ర ప్రతినిధి:- సామాజిక, ఆధ్యాత్మిక, వైద్య సేవా కార్యకలాపాల ద్వారా తమకుంటూ ప్రత్యేక గుర్తింపును, గౌరవాన్ని పెంపొందించుకుంటున్న నగరానికి చెందిన శ్రీ రామానుజ సేవా ట్రస్టువారు సమాజం హర్షించే మరో చిరస్మరణీయ సేవా కార్యక్రమం నిర్వహించారు.

నగరంలోని ఓ పేద ఇంటికి చెందిన కుమారి అనే 23 ఏళ్ళ అమ్మాయి తన పొత్తుకడుపులో పెద్ద కణితి ఏర్పడడంతో భరించలేని నొప్పితో బాధపడుతోంది. ఇంట్లో దగ్గరుండి చూసుకునే తండ్రి ఇటీవలే కాలంచేయడంతో ఆ అమ్మాయిని ఆసుపత్రికి తీసుకెళ్ళి చికిత్స చేయించే వారు లేకపోయారు. దీంతో ఆ అమ్మాయి ఇంటి ఇరుగు పొరుగువారు ఆ అమ్మాయి బంధువులకు కబురుచేసి, నగరంలో ప్రముఖ సామాజిక సేవా సంస్థ అయిన శ్రీ రామానుజ సేవా ట్రస్టు గురించి సమాచారం ఇచ్చారు. దీంతో ఆ అమ్మాయి బంధువులు ట్రస్టువారికి ఫోను ద్వారా తమ అమ్మాయి ఎదుర్కొంటున్న సమస్య గురించి తెలియజేశారు. ట్రస్టువారు వెంటనే స్పందించి, ముందుగా ఆ అమ్మాయికి సాధారణ వైద్య పరీక్షలు నిర్వహించారు. ఆ పరీక్షలో ఆమెది మామూలు సమస్య కాదని, చాలా క్లిష్టమైన సమస్య అని తెలుసుకొని, వెంటనే తమకు చిరకాల ఆత్మీయ వైద్యులు, గాంధీ ఆసుపత్రి రిటైర్డ్ సూపరింటెండెంట్, సీనియర్ గైనకాలజిస్టు అయిన డాక్టర్ జె.వి. రెడ్డికి పేషెంట్ ను అప్పగించారు.

ఆపరేరషన్ తో అమ్మాయికి భవిష్యత్తునిచ్చిన డాక్టర్ జె.వి. రెడ్డి పేషెంట్ కుమారిని పరిశీలించిన డాక్టర్ జె.వి. రెడ్డి.. ఆ అమ్మాయి పొత్తుకడుపులో పెద్ద కణితి ఏర్పడిందని, ఇందువల్ల గర్భాశయం దెబ్బతినిపోయే ప్రమాదం సంభవించనుందని, వెంటనే ఆపరేషన్ చేయకపోతే అమ్మాయి వైవాహిక జీవితానికి దూరమైపోతుందని తేల్చి చెప్పారు. దీంతో శ్రీ రామానుజ సేవా ట్రస్టువారు ఆ అమ్మాయి పేదకుటుంబ పరిస్థితిని వివరించి, మానవతా దృష్టితో ఉచితంగా ఆపరేషన్ చేసి ఆదుకోవాలని డాక్టర్ ను కోరారు.

ఇప్పటికే సేవా ట్రస్టువారు సిఫారసు చేసిన అనేకమంది రోగులకు సంతృప్తికరమైన, విజయవంతమైన సేవలుచేసి ఆదుకున్న డాక్టర్ జె.వి. రెడ్డి ఈ కేసును కూడా స్వీకరించి దేవుడిలా ఆదుకున్నారు. ఆపరేషన్ చేసిన తర్వాత ఆయన ఆ అమ్మాయి పొత్తుకడుపు (యుటెరస్) నుంచి రెండున్న ర కిలోల బరువున్న కణితిని ఆమె గర్భసంచికి ఎటువంటి ప్రమాదం వాటిల్లకుండా జాగ్రత్తగా వెలికితీసి, వైద్యనారాయణుడిలా ఆదుకున్నారు. ప్రాణాంతకమైన ఆపరేషన్ విజయవంతంగా, సంతృప్తికరంగా పూర్తికావడంతో అటు డాక్టర్ జె.వి రెడ్డితోపాటు ఇటు శ్రీరామానుజ సేవా ట్రస్టువారు, వైద్యసేవలు అందుకున్న కుమారి బంధువులు, ఇరుగుపొరుగువారు ఆనందంతో హర్షం వ్యక్తంచేశారు.