దేశాలపై నిఘా..

దేశాలపై నిఘా..
  •  చైనా బెలూన్ల కలకలం..
  • స్పష్టం చేసిన యూఎస్​ నిఘా వర్గాలు..
  • తాజాగా చిత్రాల విడుదల

న్యూఢిల్లీ: చైనా బెలూన్లు ఆయా దేశాల్లో ఎగురుతూ కలకలం రేకెత్తిస్తున్నాయి. ఓ వైపు బెలూన్లు వాతావరణ పరిస్థితులను అధ్యయనం చేసేందుకు ప్రయోగించామని చైనా చెబుతుండగా ఈ కథనాలపై అంతర్జాతీయ సమాజం నమ్మడం లేదు. ఇటీవలే అమెరికాలో ఎగురుతున్న రెండు బెలూన్లను అమెరికా కూల్చివేసింది. అంతేగాక మరోమారు నంగనాచి నాటకాలాడితే సమాధానం ఇదేవిధంగా ఉంటుందని బైడెన్​ మంగళవారం కాస్త గట్టిగానే హెచ్చరించారు. తమ దేశ సరిహద్దుల్లో బెలూన్లు ఎగరవేయడమే కాకుండా వాతావరణ పరిస్థితులంటూ చైనా బొంకడాన్ని ఆయన తప్పుబట్టారు. బెలూన్లతో ఇతర దేశాల అంతర్జాతీయ సైనిక శక్తి, ఆయుధ శక్తి తదితరాలపై చైనా నిఘా పెడుతోందని అమెరికా ఆరోపిస్తుంది.

బెలూన్ విషయంతోపాటు పలు రహస్యాలను భారత్ సహా తమ మిత్రదేశాలకు వెల్లడించింది అమెరికా. దీంతో ఈ వ్యవహారంపై ఆయా దేశాలు అప్రమత్తమవుతున్నాయి. వాషింగ్టన్ లో ఉన్న 40 దేశాల ఎంబసీ అధికారులతో ఈ సమాచారం పంచుకున్నట్లు సమాచారం. వాషింగ్టన్ పోస్ట్‌లోని ఒక నివేదిక ప్రకారం.. యూఎస్​ డిప్యూటీ సెక్రటరీ ఆఫ్ స్టేట్ వెండి షెర్మాన్ చైనా గూఢచర్యం విషయంపై 40 రాయబార కార్యాలయాల ప్రతినిధులకు వివరించారు. అట్లాంటిక్ మహాసముద్రంలోని దక్షిణ కరోలినా తీరంలో గత శనివారం యుద్ధ విమానాలతో చైనా నిఘా బెలూన్‌ను కూల్చేసిన విషయంతోపాటు పలు రహస్యాలను భారత్ సహా తమ మిత్రదేశాలకు పంచుకున్నారు.

యూఎస్ స్పై బెలూన్ అనేక దేశాలలో సైనిక ఆస్తులపై గూఢచర్యం చేయడానికి చైనా చేసిన కుట్రలో ఇది భాగమని అమిరికా పేర్కొంది. వ్యూహాత్మక దేశాల రక్షణ వ్యవస్థ, సైనిక శక్తి లాంటి వాటి గురించి వివరాలు సేకరించేందుకు నిఘా బెలూన్ తో చైనా అడుగులు వేస్తుందని పేర్కొంది. చైనాలోని హైనాన్ ప్రావిన్స్ నుంచి ఇది పాక్షికంగా పనిచేస్తుందని పేర్కొంది. ఈ నిఘా బెలూన్లు లేదా ఎయిర్‌షిప్‌లు ఐదు ఖండాలలో గుర్తించినట్లు అమెరికా పేర్కొంది. ఈక్రమంలో అమెరికా కొన్ని బెలూన్లు ఎగురుతున్న చిత్రాలను తాజాగా విడుదల చేసి ప్రపంచ దేశాలు చైనాతో అప్రమత్తంగా ఉండాలని హితవు పలికింది.