గ్రామీణాభివృద్ధిలో యావత్ దేశానికి ఆదర్శం తెలంగాణ

గ్రామీణాభివృద్ధిలో యావత్ దేశానికి ఆదర్శం తెలంగాణ
  • సుపరిపాలన, స్థానిక సంస్థల కృషితోనే రాష్ట్రానికి అవార్డుల వెల్లువ
  • నిరంతరం ఇదే స్ఫూర్తితో ముందుకు సాగాలి
  • రాష్ట్ర ఐ.టీ, పురపాలక శాఖా మంత్రి కే.తారకరామారావు
  • ఉత్తమ జీ.పీలకు అదనపు నిధులు అందించాలని సిఫార్సు

ముద్ర ప్రతినిధి, రంగారెడ్డి:  ప్రభుత్వ సుపరిపాలన, స్థానిక సంస్థల సమిష్టి కృషితో గ్రామీణాభివృద్ధిలో తెలంగాణ రాష్ట్రం యావత్ భారతదేశానికే ఆదర్శంగా నిలుస్తోందని రాష్ట్ర ఐటీ, పురపాలక శాఖ మంత్రి కే తారక రామారావు అన్నారు. రంగారెడ్డి జిల్లా రాజేంద్రనగర్ లోని ఆచార్య జయశంకర్ వ్యవసాయ విశ్వవిద్యాలయం ఆడిటోరియంలో శుక్రవారం రాష్ట్ర పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకరరావు అధ్యక్షతన జరిగిన జాతీయ పంచాయతీ అవార్డుల ప్రదానోత్సవ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా  మంత్రి కేటీఆర్ పాల్గొన్నారు. ఈ సందర్బంగా మంత్రి కేటీఆర్ మాట్లాడుతు  గ్రామీణ నేపథ్యం కలిగి ఉండడం వల్ల ముఖ్యమంత్రి కేసీఆర్ పల్లెల ప్రగతికి కావాల్సిన వనరులు, వసతుల గురించి లోతైన ఆలోచనలతో వినూత్న కార్యక్రమాలు అమలు చేస్తున్నారని చెప్పారు. దేశంలోనే మరెక్కడా లేని విధంగా తెలంగాణలోని ప్రతి గ్రామంలో నర్సరీలు, డంపింగ్ యార్డ్, వైకుంఠధామం, హరితహారం అమలు, పల్లె ప్రకృతి వనాలు, ఇంటింటికి శుద్ధి జలాలు అందుబాటులో ఉన్నాయన్నారు. దీంతో వివిధ అంశాలను ప్రాతిపదికగా చేసుకొని కేంద్రం అందించే అవార్డులు తెలంగాణకు కోకొల్లలుగా వరిస్తున్నాయని మంత్రి కేటీఆర్ హర్షం వెలిబుచ్చారు. 2015 నుండి 2022వ సంవత్సరం వరకు ఏకంగా తెలంగాణ రాష్ట్రం 79 జాతీయ గ్రామీణ అవార్డులను సాధించిందన్నారు.

2022లో సంసద్ ఆదర్శ గ్రామీణ యోజన కింద దేశవ్యాప్తంగా 20 ఉత్తమ గ్రామ పంచాయతీలను ఎంపిక చేయగా, అందులో 19 అవార్డులు తెలంగాణకే వచ్చాయని గుర్తు చేశారు. స్వచ్ఛ సర్వేక్షన్ అవార్డులలోనూ తెలంగాణ రాష్ట్రమే అగ్రతాంబూలం దక్కించుకుందని, జిల్లా స్థాయిలో జగిత్యాల, నిజామాబాద్ జిల్లాలు అవార్డులను సాధించాయని తెలిపారు. పక్కా ప్రణాళిక, సునిశిత పర్యవేక్షణ, సమర్థవంతమైన పాలన యంత్రాంగం, పకడ్బందీ చట్టాల అమలు వల్లే తెలంగాణలో సమీకృత, సమ్మిళిత అభివృద్ధి వేగంగా విస్తరిస్తోందని స్పష్టం చేశారు. పర్యావరణంతో పాటు పరిశ్రమలు, పల్లె ప్రగతి తో పాటు పట్టణ ప్రగతి, వ్యవసాయ విస్తరణతో పాటు ఐటీ ఎగుమతులు ఏకకాలంలో అభివృద్ధి జరుగుతున్న ఏకైక రాష్ట్రం తెలంగాణ మాత్రమేనని తేల్చి చెప్పారు. అభివృద్ధిలో అగ్రగామిగా, అవినీతిలో  అట్టడుగున ఉన్న రాష్ట్రంగా తెలంగాణ ప్రశంసలు అందుకుంటోందని, సర్వేలు ఈ విషయాన్ని చెబుతున్నాయన్నారు. ప్రత్యేక రాష్ట్రం ఆవిర్భించిన అనంతరం తెలంగాణలో 7.7% పచ్చదనం పెరిగిందని, ఇంత పెద్ద ఎత్తున దేశంలోనే మరెక్కడా పచ్చదనం పెంపొందించబడలేదన్నారు. 2014లో తెలంగాణ తలసరి ఆదాయం రూ. 1,24,000 ఉండగా, అది నేడు మూడు రెట్లు పెరిగి మూడు లక్షల 17 వేల కు పెరిగిందన్నారు. రైతుబంధు అమలుతో వ్యవసాయ భూముల విలువ గణనీయంగా పెరిగిందన్నారు.

65 లక్షల మంది రైతుల ఖాతాల్లో 65 వేల కోట్ల రూపాయలను జమ చేసిన ఘనత తెలంగాణ ప్రభుత్వానికే దక్కిందన్నారు. పల్లె ప్రగతి కార్యక్రమం కింద తెలంగాణలో ఇప్పటివరకు 14వేల235 కోట్ల రూపాయలను వెచ్చించడం జరిగిందని వివరించారు. అధికార వికేంద్రీకరణతో ప్రజలకు పాలనను మరింత చేరువ చేయవచ్చని, నిశిత పర్యవేక్షణతో అద్భుత ఫలితాలు అందించవచ్చనే సంకల్పంతో ప్రభుత్వం విరివిగా నూతన గ్రామపంచాయతీలను ఏర్పాటు చేసిందన్నారు. ఇదివరకు 8796 జి పీ లు ఉండగా, ప్రస్తుతం వాటి సంఖ్య 12,769కి పెరిగిందన్నారు. కొత్త జిపిల ఏర్పాటుతో గిరిజన తండాలు గూడెం వాసుల దశాబ్దాల కాలం నాటి స్వయంపాలన కల నెరవేరిందని మంత్రి కేటీఆర్ అన్నారు. పరిపాలన సౌలభ్యం కోసం జి పీ ల తరహాలోనే 10 జిల్లాలను 33 జిల్లాలకు, 68 మున్సిపాలిటీలను 142 మున్సిపాలిటీలుగా చేశామని, కొత్తగా 50 రెవెన్యూ డివిజన్లు 140 మండలాలను ఏర్పాటు చేశామన్నారు. ఐదంచెల పరిపాలన వ్యవస్థలో ప్రజా ప్రతినిధులు తమ బాధ్యతలను గుర్తెరిగి సమర్థవంతంగా విధులు నిర్వర్తించాలని హితవు పలికారు. తమ భవిష్యత్తు తరాలు గుర్తుంచుకునే రీతిలో అభివృద్ధి పనులు చేపట్టాలన్నారు. ఈ దిశగా స్థానిక సంస్థల ప్రజాప్రతినిధులకు సమర్థవంతమైన నాయకత్వం వహించేలా, వారి బాధ్యతలను, విధులు, అధికారాలను పూర్తి స్థాయిలో ఆకళింపు చేసుకునేలా  శిక్షణ తరగతులు నిర్వహించాలని మంత్రి కేటీఆర్ గ్రామీణాభివృద్ధి, పంచాయతీ రాజ్ శాఖ అధికారులకు సూచించారు. అదేవిధంగా జిల్లా, రాష్ట్ర, జాతీయ స్థాయిలో ఉత్తమ అవార్డులు సాధించిన గ్రామపంచాయతీలకు కనీసం 10 లక్షలు, 20 లక్షలు, 30 లక్షల రూపాయల చొప్పున అదనపు నిధులు కేటాయిస్తే బాగుంటుందని సిఫార్సు చేశారు. దీనివల్ల అవార్డులు సాధించిన పాలకవర్గాలను ప్రోత్సహించినట్లు అవుతుందని, ఇతరులకు ఇది స్ఫూర్తిగా నిలుస్తుందని అన్నారు.
      
పంచాయతీరాజ్, గ్రామీణ అభివృద్ధి శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు మాట్లాడుతూ, ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర రావు గ్రామీణ ప్రాంతాల అభివృద్ధిని ఆకాంక్షించి ప్రతి గ్రామంలో డంపింగ్ యార్డులు, నర్సరీలు, పల్లె ప్రకృతి వనాలు ఏర్పాటు చేసి గ్రామాల అభివృద్ధికి కృషి చేస్తున్నారని అన్నారు. ఇదివరకు గ్రామ పంచాయతీలు నిధుల కొరతతో సతమతం కావాల్సి వచ్చేదన్నారు. కేంద్రం ద్వారా సమకూరే అత్తెసరు నిధులు పంచాయతీల నిర్వహణ, సిబ్బంది జీతభత్యాలు, తాగునీటి అవసరాలకే సరిపోయేవని తెలిపారు. ముఖ్యమంత్రి కేసీఆర్ సుపరిపాలనతో పల్లెల్లో తొంభై శాతానికి పైగా పాలనా వ్యవస్థ మెరుగుపరచడం జరిగినదని అన్నారు. ప్రధానంగా కృష్ణ, గోదావరి జలాలను తాగునీటి అవసరాల కోసం వినియోగంలోకి తెచ్చి ఇంటింటికి రక్షిత మంచినీటిని అందిస్తున్నారని మంత్రి గుర్తు చేశారు. ఫలితంగా మిగులు నిధులు ఇతర అభివృద్ధి పనులకు ఉపయోగించే వెసులుబాటు కలిగిందన్నారు. కేంద్రం కేటాయిస్తున్న నిధులకు సమానంగా రాష్ట్ర ప్రభుత్వం కూడా పల్లె ప్రగతి కింద గ్రామ పంచాయతీలకు నిధులు మంజూరు చేస్తుండడంతో తెలంగాణ పల్లెలు అన్ని మౌలిక సదుపాయాలను సంతరించుకుంటూ, జాతీయ అవార్డులను సాధిస్తున్నాయని తెలిపారు. కేంద్ర నిధులకు సమానంగా రాష్ట్ర ప్రభుత్వం నిధులను విడుదల చేసి గ్రామాల అభివృద్ధికి తోడ్పడుతున్న ఏకైక రాష్ట్రం తెలంగాణ రాష్ట్రమని అన్నారు.  గ్రామాలను పరిశుభ్రంగా, పచ్చదనంతో ఉట్టిపడేలా  కృషి చేస్తున్నారని, మిషన్ భగీరథ, మిషన్ కాకతీయ కార్యక్రమాల ద్వారా గ్రామాల్లోని చెరువులను పునరుద్ధరించి, ఎల్లవేళలా జలకళ తో నిండుగా  ఉండేలా చూడడం జరుగుతుందన్నారు.  గ్రామపంచాయతీలకు ట్రాక్టర్లను అందజేసి చెత్త సేకరణకు ఉపయోగించడం జరుగుతుందని తెలిపారు.


రాష్ట్ర కార్మిక శాఖ మంత్రి చామకూర మల్లారెడ్డి మాట్లాడుతూ, గ్రామ స్థాయిలో పనిచేస్తున్న అందరూ  ముఖ్యమంత్రి కేసీఆర్  ఆశయాల మేరకు అంకితభావంతో పనిచేసి అవార్డులు గెలుచుకోవడం జరిగినదని అన్నారు. నిజాయితీగా పనిచేస్తూ కష్టపడితే ఆశించిన ఫలితం తప్పక దక్కుతుందని నిరూపించారని అన్నారు. జాతీయ, రాష్ట్ర స్థాయిలో అవార్డులు వచ్చినందుకు బాధ్యత కూడా అంతే పెరుగుతుందని, మునుముందు కూడా ఇదే స్ఫూర్తిగా రెట్టింపు ఉత్సాహంతో పని చేయాలని మంత్రి మల్లారెడ్డి పిలుపునిచ్చారు.  అభివృద్ధిలో తెలంగాణ రాష్ట్రం దేశంలోనే అగ్రస్థానంలో నిలబడిందని, దేశంలోని మిగతా రాష్ట్రాలకు ఆదర్శంగా నిలిచిందని ఈ సందర్భంగా మంత్రి హర్షాతిరేకాలు వెలిబుచ్చారు. ఈ సందర్భంగా వివిధ అంశాల ప్రాతిపదికన ఉత్తమ గ్రామపంచాయతీలుగా ఎంపికైన పాలకవర్గాలకు ముఖ్య అతిథుల చేతుల మీదుగా అట్టహాసంగా అవార్డులను అందజేశారు. ఈ కార్యక్రమంలో వికారాబాద్ శాసనసభ్యులు మెతుకు ఆనంద్, పంచాయతీరాజ్, గ్రామీణ అభివృద్ధి శాఖ ప్రిన్సిపల్ సెక్రెటరీ సందీప్ కుమార్ సుల్తానియా, కమిషనర్ హనుమంతరావు,  అదనపు కలెక్టర్లు, జిల్లా పరిషత్ చైర్ పర్సన్ లు, జిల్లా పంచాయతీ అధికారులు, జిల్లా గ్రామీణ అభివృద్ధి శాఖ అధికారులు, జడ్పిటిసిలు, ఎంపీపీలు, ఎంపీటీసీలు, సర్పంచులు, పంచాయితీ సెక్రటరీలు, ఎంపీడీవోలు, సంబంధిత అధికారులు, తదితరులు పాల్గొన్నారు