మహిళా సాధికారతే లక్ష్యం

మహిళా సాధికారతే లక్ష్యం
  •  జనగామ ఎమ్మెల్యే ముత్తిరెడ్డి యాదగిరిరెడ్డి
  •  ఘనంగా మహిళా సంక్షేమ దినోత్సవం

ముద్ర ప్రతినిధి, జనగామ: మహిళా సాధికారతే లక్ష్యంగా పనిచేస్తున్న కేసీఆర్‌‌ ప్రభుత్వాన్ని ముచ్చట మూడో సారి కూడా గెలిపించుకోవాలని జనగామ ఎమ్మెల్యే ముత్తిరెడ్డి యాదగిరిరెడ్డి పిలుపునిచ్చారు. తెలంగాణ రాష్ట్ర అవతరణ దశాబ్ది ఉత్సవాల్లో భాగంగా మంగళవారం జిల్లా కేంద్రంలోని ఓ ఫంక్షన్‌ హాల్‌లో మహిళా సంక్షేమ దినోత్సవాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా మహిళా సంక్షేమం కోసం ప్రభుత్వ చేపడుతున్న పలు పథకాలు, తెలంగాణ వచ్చిన తర్వాత జరిగిన అభివృద్ధి ఆయా శాఖ అధికారులు ప్రగతి నివేదిక ద్వారా వివరించారు.

అనంతరం ఎమ్మెల్యే ముత్తిరెడ్డి మాట్లాడుతూ సమాజంలో మహిళా శక్తి ముందు ఎవరైనా ఓడిపోవాల్సిందే అన్నారు. తెలంగాణ ప్రభుత్వం మహిళ అభ్యున్నతి, వారి ఆరోగ్యంపై ప్రత్యేక దృష్టి పెట్టిందన్నారు. అందులో భాగంగానే వడ్డీలేని రుణాలు, ఆరోగ్యలక్ష్మి, కేసీఆర్‌‌ కిట్‌, కల్యాణలక్ష్మి, షాదీ ముబారక్‌ వంటి పథకాన్ని తీసుకొచ్చిందన్నారు. రాష్ట్రంలో మహిళా సంక్షేమానికి పెద్దపీట వేస్తున్న సీఎం కేసీఆర్‌‌ను రాబోయే ఎన్నికల్లో ముచ్చటగా మూడో సారి ముఖ్యమంత్రిని చేయాలని కోరారు. ఈ సందర్భంగా మహిళా సంఘాలకు రూ.15 కోట్ల బ్యాంకు లింకేజీ రుణారు, రూ.2.45 కోట్ల స్త్రీ నిధి రుణాల చెక్కులను ఎమ్మెల్యే అందజేశారు. 

పిల్లలు మన సంస్కృతిని మరవద్దు..
పిల్లలు మన సంస్కృతి, సంప్రదాయాలను మర్చిపోవద్దని ఎమ్మెల్యే ముత్తిరెడ్డి సూచించారు. ప్రస్తుతం కొంత మంది పిల్లలు విదేశీ సంస్కృతికి అలవాటు పడి చెడుదారుల్లో పయనిస్తున్నరన్నారు. వారి తీరుతో తల్లిదండ్రులు ఎంతో క్షోభకు గురవుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. పిల్లలు తమ తల్లిదండ్రులను మించింది ఏదీ లేదని గుర్తించాలన్నారు. పిల్లలు ఎదిగి సమాజానికి ఉపయోగపడితే ఆ తల్లిదండ్రుల ఆనందం అంతాఇంతా కాదన్నారు. పిల్లలు సన్మార్గంలో పయనించి ప్రయోజకులు కావాలని ఆకాంక్షించారు. కార్యక్రమంలో అదనపు కలెక్టర్‌‌ రోహిత్‌ సింగ్‌(రెవెన్యూ), మహిళా కమిషన్‌ సభ్యురాలు గద్దల పద్మ, ఆర్డీవో మధుమోహన్‌, డీఏవో వినోద్‌కుమార్‌‌, మున్సిపల్‌ చైర్మన్‌ పోకల జమున, మార్కెట్‌ చైర్మన్‌ బాల్దె సిద్దిలింగం, కౌన్సిలర్లు, ఎంపీపీలు, జడ్పీటీసీలు, సర్పంచ్‌లు పాల్గొన్నారు.