సమస్యను సత్వరమే పరిష్కరించాలి అధికారులకు కలెక్టర్ రాజర్షి షా ఆదేశం

సమస్యను సత్వరమే పరిష్కరించాలి అధికారులకు కలెక్టర్ రాజర్షి షా ఆదేశం

ముద్ర ప్రతినిధి, మెదక్: ప్రజావాణి కార్యక్రమంలో ప్రజల నుండి వచ్చిన ఫిర్యాదులను సంబంధిత అధికారులు క్షుణ్ణంగా పరిశీలించి సమస్యను సత్వరమే పరిష్కరించాలని జిల్లా కలెక్టర్ రాజర్షి షా ఆదేశించారు. సోమవారం కలెక్టరేట్ లో అదనపు కలెక్టర్లు ప్రతిమ సింగ్, రమేష్, డిఆర్ డిఓ శ్రీనివాస్ లతో కలిసి జిల్లాలోని వివిధ ప్రాంతాల నుండి వచ్చిన ఫిర్యాదీదారుల నుండి  విజ్ఞప్తులు స్వీకరించారు. ఇందులో ప్రధానంగా భూ సమస్యలు, ధరణి, ఆసరా పింఛన్లు, డబుల్ బెడ్ రూమ్ ఇండ్లు, ఇండ్లకు సంబంధించి విజ్ఞప్తులు అధికంగా వచ్చాయి. జప్తి శివనూరుకు చెందిన వికలాంగురాలు హారతి  త్రిచక్ర సైకిల్ కొరకు అభ్యర్థించగా వెంటనే అందజేయవలసినదిగా జిల్లా మహిళా శిశు సంక్షేమాధికారిని ఆదేశించారు. కాగా  పంచాయతీ రాజ్, మునిసిపల్ , విద్య  తదితర శాఖలకు సంబంధించి వచ్చిన విజ్ఞప్తులతో పాటు విదేశీ విద్య కొరకు ఆర్థిక సహాయం అందించాలని,  ఉద్యోగం ఇప్పించాలని కోరుతూ వచ్చిన వినతులను ఆయా శాఖాధికారులకు అందజేస్తూ పరిష్కరింప దగిన వాటిపై వెంటనే చర్య తీసుకోవాలని, మిగతా వినతులపై ఫిర్యాదీదారులకు తగు మార్గనిర్దేశం చేయాలని  సూచించారు. 

అనంతరం అధికారులతో వివిధ అంశాలపై  సమీక్షిస్తూ  ఆర్థిక సంవత్సరం గడవు ముగింపుకు మూడు రోజులే ఉన్నందున  నిర్దేశించిన లక్ష్యాలను ఛేదించాలని, స్వయం  సహాయక సంఘాలకు వెంటనే బ్యాంకు లింకేజి అందేలా చూడాలన్నారు. మంగళవారం నిర్వహించే ఆరోగ్య మహిళా కేంద్రాలను, కంటి వెలుగు శిబిరాలను సందర్శించి ఎక్కువ సంఖ్యలో వినియోగించుకునేలా పర్యవేక్షించాలని మండల ప్రత్యేకాధికారులకు  సూచించారు.  ఈ సమావేశంలో జిల్లా అధికారులు వెంకట  శైలేష్, సాయిబాబ, రాధాకిషన్, కేశురాం, జెంలా నాయక్, విజయలక్ష్మి, ఇందిర, కరుణ , శ్రీనివాస్ రావు, నాగరాజ్,  లీడ్ బ్యాంక్ అధికారి వేణుగోపాల్ రావు తదితరులు పాల్గొన్నారు.