ఇతనాల్ ప్రాజెక్టుతో నష్టమే లేదు

ఇతనాల్ ప్రాజెక్టుతో నష్టమే లేదు
  •  రాజకీయ లబ్ధికోసం ప్రజలను రెచ్చగొట్టుడు 
  •  ప్రాజెక్టు పూర్తయితే అడ్లూరి రాజకీయం సమాప్తం 
  •  ప్రాజెక్టుతో నష్టముంటే ఎక్కడైనా చర్చకు రడి 
  •  డీసీఎంఎస్ చైర్మన్ ఎల్లాల శ్రీకాంత్ రెడ్డి

ముద్ర ప్రతినిధి , జగిత్యాల: ఇతనాల్ ప్రాజెక్టు తో ఎలాంటి నష్టం లేదని ప్రతిపక్ష కాంగ్రెస్ నాయకులు తమ రాజకీయ లబ్ధికోసం ప్రజలను రెచ్చగోడుతున్నారని, ఇతనాల్ ప్రాజెక్టుతో నష్టముంటే ఆధారాలతో రావాలని ఎక్కడైనా చర్చకు సిద్ధమని డీసీఎంఎస్ చైర్మన్ ఎల్లాల శ్రీకాంత్ రెడ్డి ప్రతిపక్ష కాంగ్రెస్ నాయకులకు సవాల్ విసిరారు. సోమవారం జగిత్యాల ప్రెస్ క్లబ్ లో ఏర్పాటు చేసిన విలేఖరుల సమావేశంలో శ్రీకాంత్ రెడ్డి మాట్లడుతూ పర్యావరణానికి ఎటువంటి హాని కలిగించని ఇతనాల్ ప్రాజెక్టు పూర్తి బయో ఇతనాల్ ప్రాజెక్టు అని అన్నారు. కోటిమంది రైతుల భాగస్వామ్యంతో నడిచే క్రిబ్ కో కంపెనీలో పదివేల సహకార సంఘాలు కలుపుకొని పనిచేస్తున్నదని అన్నారు. ఇతనాల్ ప్రాజెక్టు ఏర్పాటుతో రైతులకు మేలు తప్ప ఎటువంటి నష్టం లేదని కానీ ప్రతిపక్ష పార్టీల నేతలు లేనిపోనివి చెప్తూ ప్రజలను రెచ్చగొడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ ప్రాజెక్టు పూర్తిగా ప్రభుత్వ స్థలంలో నిర్మిస్తున్నారని దీనితో ఎవరికి ఎలాంటి నష్టం లేదన్నారు. దేశంలో మూడు ప్రాజెక్టులను కేంద్ర ప్రభుత్వం మంజూరు చేసిందన్నారు. ఇందులో గుజరాత్ లో ఒకటి ఆంద్రప్రదేశ్ లోని నెల్లూరు కృష్ణపట్నం, మూడవది ధర్మపురి నియోజకవర్గంలోనని చెప్పారు.

కేంద్రమే పెట్రోల్ లో 10 శాతం ఇతనాల్ కలపాలని సూచిస్తోందని ఈ ప్రాజెక్టు నిర్మాణం పూర్తయితే నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశాలు పెరుగుతాయని,  రైతుల పంట దిగుబడులను మద్దతు ధరకు కొనుగోలు చేయవచ్చని, తడిసిన ధాన్యం కూడా కొనుగోలు చేస్తారని అన్నారు. అనంతరం ఫ్యాక్స్ చైర్మన్ ల ఫోరమ్ అద్యక్షులు రాజసుమన్ రావు మాట్లాడుతూ తెలిసి తెలియకుండా కాంగ్రెస్ నేతలు మాట్లాడుతున్న తీరు చూస్తుంటే నవొస్తుందన్నారు. అడ్లూరి లక్ష్మణ్ కుమార్ తన చిల్లర రాజకీయాలు తెరలేపాడని సీనియర్ కాంగ్రెస్ నాయకులు జీవన్ రెడ్డి కూడా రాజకీయ లబ్ధికోసం అసత్య ప్రచారాలకు తెరలేపాడన్నారు. ఇతనాల్ ప్రాజెక్టు నుంచి చుక్క నీరు బయటకు రాకుండా బాబిలింగ్ చేస్తారని, ఇది కెమికల్ ఫ్యాక్టరీ కాదని అన్నారు.

ప్రాజెక్టు వల్ల ప్రజలకు లాభాలను చెప్పడానికి మేము నష్టాలను చెప్పడానికి కాంగ్రెస్ నాయకులు అడ్లూరి, జీవన్ రెడ్డిలు చర్చకు సిద్ధమా అని సవాల్ విసిరారు. చర్చకు ఎక్కడికైనా రావడానికి సిద్ధమేనని తోకముడిస్తే ఊరుకోమని హెచ్చరించారు. ప్రతిపక్షాల నేతల డ్రామాలను ప్రజలు గమనిస్తున్నారని అభివృద్ధిని అడ్డుకుంటే ప్రజలే ప్రజాక్షేత్రంలో భంగపాటు తప్పదని హెచ్చరించారు. అడ్లూరి లక్ష్మణ్ కుమార్ దొంగలెక్కలు ప్రజలకు తెలిసిపోయాయని ప్రజలను రెచ్చగొట్టే పనులు మానుకోవాలని లేకుంటే తగిన గుణపాఠం చెప్తామని హెచ్చరించారు. ఈ సమావేశంలో  ఫ్యాక్స్ ఛైర్మన్ లు మహిపాల్ రెడ్డి, సౌళ్ల నరేష్, గందే వెంకట మాధవరావు, మంత్రి వేణు, ఏనుగు మల్లారెడ్డి తోపాటు బోయినపల్లి మధు సుధన్ రావు ఉన్నారు.