మెఫీ ఆధ్వర్యంలో త్వరలో శిక్షణ తరగతులు

మెఫీ ఆధ్వర్యంలో త్వరలో శిక్షణ తరగతులు

ముద్ర, హైదరాబాద్​: నగరంలోని దేశోద్ధారక భవన్ లోని ఐజేయూ, మెఫీ కార్యాలయంలో శనివారం మీడియా ఎడ్యుకేషన్ ఫౌండేషన్, ఇండియా(మెఫి), ట్రస్ట్ బోర్డ్ సమావేశం జరిగింది. సమావేశంలో మెఫీ అధ్యక్షులు కె.శ్రీనివాస్ రెడ్డి అధ్యక్షత వహించారు. మేనేజింగ్ ట్రస్టీ దేవులపల్లి అమర్, ట్రస్ట్ బోర్డ్ సభ్యులు ఎం. ఏ. మాజిద్, ఆలపాటి సురేశ్ కుమార్, వై. నరేందర్ రెడ్డి, డి.సోమసుందర్, కే.విరాహత్ ఆలి పాల్గొన్నారు. ఈ సందర్భంగా  ఇటీవల మెఫీ నిర్వహించిన కార్యకలాపాలను సమావేశంలో సమీక్షించారు. మెఫి ఆశయాలను, లక్ష్యాలను, కార్యకలాపాలను వివరించే ఒక  బ్రోచర్ ను వెంటనే ప్రచురించాలని ఈ సందర్భంగా నిర్ణయించారు.

మెఫి  తరపున నిర్వహించ తలపెట్టిన శిక్షణ కోర్సులు, తరగతుల పాఠ్యాంశాలను ఖరారు చేసేందుకు రిసోర్స్ పర్సన్లుగా ఎంపిక చేసిన తెలంగాణ సీనియర్ పాత్రికేయులతో హైదరాబాద్ లో డిసెంబర్ 24 న మరో సమావేశం జరపాలని, జనవరిలో ఆంధ్ర ప్రదేశ్ లో రిసోర్స్ పర్సన్లుగా ఎంపికచేసిన  సీనియర్ పాత్రికేయులతో విజయవాడలో ఇంకో సమావేశం నిర్వహించాలని ట్రస్ట్ బోర్డ్ ఈ సందర్భంగా నిర్ణయించింది.

గతంలో అభ్యర్థనలు ఇచ్చిన జిల్లాల్లో  శిక్షణ తరగతుల నిర్వహణకు చర్యలు తీసుకోవాలని సమావేశం నిర్ణయించింది. సమకాలీన అంశాలపై పాత్రికేయుల అవగాహన పెంచేందుకు ప్రతినెలా ఒకటో తేదీన హైదరాబాద్ లోని యూనియన్ ఆఫీసు లో ‘మెఫి టేక్స్’ పేరిట ప్రారంభించిన ప్రసంగాల పరంపరను కొనసాగించాలని సమావేశం నిర్ణయించింది. ఈ సందర్భంగా మెఫి ఆడిట్ రిపోర్ట్ ను సభ్యులు ఆమోదించారు. అంతకుముందు మెఫి ట్రస్ట్ బోర్డ్ శాశ్వత సభ్యుడు అంబటి ఆంజనేయులు మృతికి బోర్డు సంతాపం తెలిపింది.