ఇద్దరు నిందితుల అరెస్టు... 26 బైక్స్, 4 తులాల చైన్ స్వాధీనం

ఇద్దరు నిందితుల అరెస్టు... 26 బైక్స్, 4 తులాల చైన్ స్వాధీనం
  • డీసీపీ రాజేష్ చంద్ర, ఏసీపీ రవికిరణ్ వెల్లడి

ముద్ర ప్రతినిధి, బీబీనగర్: చెడువ్యసనాలకులోనై మోటార్ బైక్ లు దొంగిలించిన యువకుడు ఒకరైతే, ట్రాక్టర్ ఫైనాన్స్ కట్టడానికి చైన్ స్నాచింగ్ చేసిన యువకుడు మరొకరు. రాచకొండ పోలీసు కమిషనర్ తరుణ్ జోషి సారథ్యంలో విచారణ జరిపిన పోలీసులు వీరిద్దరు నిందితులను చాకచక్యంగా పట్టుకున్నారు. రాచకొండ కమిషనరేట్ పరిధిలోని భువనగిరి జోన్ డీసీపీ రాజేష్ చంద్ర, ఏసీపీ రవికిరణ్ రెడ్డి గురువారం బీబీనగర్ పోలీస్ స్టేషన్ లో నిర్వహించిన విలేకరుల సమావేశంలో నిందితునల వివరాలు అందించారు. 
26 ద్విచక్ర వాహనాలు స్వాధీనం
బీబీనగర్ స్టేషన్ హౌస్ ఆఫీసర్ ఎస్.రమేష్ కొండమడుగు మెట్టువద్ద బుధవారం రాత్రి వాహనాల తనిఖీలు నిర్వహిస్తుండగా, ఒక ద్విచక్ర వాహనదారుడి వద్ద సరైన పత్రాలు లేకపోవడాన్ని గుర్తించి, దీనిపై విచారణ చేపట్టిన సందర్భంలో ఈ బైక్ దొంగతనాల విషయం బయటపడింది. కొండమడుగు పంచాయతీ పరిధిలోని మాధవరెడ్డి కాలనీకి చెందిన కుతాడి భానుచందర్ చెడువ్యసనాలకు అలవాటు పడ్డాడు. సులువుగా డబ్బు సంపాదించాలనే తలంపుతో హైదరాబాద్ నగరం, తదితర ప్రాంతాలలో పార్కు చేసివున్న వాహనాలను తస్కరించేవాడు. గ్రామంతో పాటు పరిసర గ్రామాలలోని యువకులకు తక్కువ ధరకు వీటిని విక్రయిస్తున్నాడు. మొదట సగం డబ్బు తీసుకుని వాహనాలను ఇచ్చేస్తున్నాడు. మిగిలిన మొత్తం వాహనానికి సంబంధించిన పూర్తిస్థాయి పేపర్లు ఇచ్చిన తర్వాత ఇవ్వమని చెబుతుండడంతో, గ్రామానికి చెందిన పలువురు యువకులు నిందితుడి వద్ద సెకండ్స్ సేల్ కింద ద్విచక్ర వాహనాలు కొనుగోలు చేశారు. నిందితుడు కేవలం గత రెండు నెలల్లో వివిధ ప్రాంతాలలో 26 ద్విచక్ర వాహనాలు దొంగిలించినట్టు తమ విచారణలో తేలిందని డీసీసీ రాజేష్ చంద్ర వెల్లడించారు. ఆయా వాహనాలను స్వాధీనం చేసుకుని, నిందితుడిని అరెస్టు చేసి రిమాండ్ కు తరలించారు. ఈ కేసును ఛేదించిన భువనగిరి రూరల్ సీఐ ప్రభాకర్ రెడ్డి ఎస్ఐ ఎస్.రమేష్, సిబ్బందిని డీసీపీ అభినందించారు. 

ట్రాక్టర్ ఫైనాన్స్ కట్టడానికి చైన్ స్నాచర్ గా...

భువనగిరి మండలం నమాత్ పల్లికి చెందిన ఎల్లెంల మధు ట్రాక్టర్ ఫైనాన్స్ డబ్బులు కట్టడానికి సులువైన మార్గంగా దొంగతనాలను ఎంచుకున్నాడు. ఇంటర్మీడియట్ వరకు చదువుకున్న నిందితుడు ఫైనాన్స్ లో ట్రాక్టర్ తీసుకుని, తానే డ్రైవర్ గా పనిచేసుకుంటున్నాడు. గత కొద్దికాలంగా ట్రాక్టర్ ఫైనాన్స్ చెల్లించలేక, సులువైన మార్గంగా చైన్ స్నాచింగ్ ను ఎంచుకున్నాడు. రాయగిరి కూడలి వద్ద గురువారం గస్తీ నిర్వహిస్తున్న భువనగిరి రూరల్ సీఐ ప్రభాకర్ రెడ్డికి అనుమానాస్పదంగా సంచరిస్తున్న మధు తారసపడ్డాడు. అతని వద్ద ముత్తూట్ ఫైనాన్స్ లో బంగారు ఆభరణం కుదువ పెట్టినట్టుగా రశీదు కనిపించింది. దీనిపై ఆరా తీసిన పోలీసులకు విస్తుపోయే నిజం తెలిసింది. మధు తాకట్టు పెట్టిన నగ, ఈనెల 15న ఓ వృద్ధురాలి మెడలో నుంచి తెంచుకుని పోయిందిగా తెలిసింది. వృద్ధ దంపతులు మోటార్ సైకిల్ పై భువనగిరి నుంచి బస్వాపురం వైపు వెళ్తుండగా, నాలుగు తులాల బరువున్న మహిళ మెడలోని చైన్ ను మధు తెంచుకుని పరారయ్యాడు. దానిపై ఆ దంపతులు అప్పుడే పోలీసులకు ఫిర్యాదు చేశారు. అదే నగను తాకట్టు పెట్టి డబ్బులు తెచ్చుకున్నట్టుగా గుర్తించారు. ఈ మేరకు ఆ ఫైనాన్స్ సంస్థలో నిందితుడు తాకట్టు పెట్టిన నగను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. నిందితుడిని రిమాండ్ కు తరలించారు. నిందితుణ్ని పట్టుకున్న భువనగిరి రూరల్ సీఐ ప్రభాకర్ రెడ్డి, ఎస్ఐ శివనాగప్రసాద్ ను డీసీపీ రాజేష్ చంద్ర అభినందించారు.