రైతుకు వెన్నుదన్నుగా వ్యవసాయ న్యాయ సహాయ కేంద్రాల- జిల్లా ప్రధాన న్యాయమూర్తి, జిల్లా న్యాయ సేవా అధికార సంస్థ అధ్యక్షులు వి. బాల భాస్కరరావు

రైతుకు వెన్నుదన్నుగా వ్యవసాయ న్యాయ సహాయ కేంద్రాల- జిల్లా ప్రధాన న్యాయమూర్తి, జిల్లా న్యాయ సేవా అధికార సంస్థ అధ్యక్షులు వి. బాల భాస్కరరావు

భువనగిరి ముద్ర న్యూస్ : రైతుకు వెన్నుదన్నుగా వ్యవసాయ న్యాయ సహాయ కేంద్రాల ద్వారా రైతుల సమస్యల పరిష్కారానికి కృషి చేయడం జరుగుతుందని జిల్లా ప్రధాన న్యాయమూర్తి, జిల్లా న్యాయ సేవా అధికార సంస్థ అధ్యక్షులు వి.బాల భాస్కరరావు తెలిపారు. గురువారం నాడు భువనగిరి పట్టణంలోని రైతు వేదికలో జిల్లా న్యాయ సేవా అధికార సంస్థ, జిల్లా వ్యవసాయ శాఖ సంయుక్త ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన వ్యవసాయ న్యాయ సహాయ కేంద్రం న్యాయ విజ్ఞాన సదస్సును ఆయన రిబ్బన్ కట్ చేసి ప్రారంభించారు. సదస్సులో రైతులు, అధికారులు పాల్గొన్నారు.

ఈ సందర్భంగా జిల్లా ప్రధాన న్యాయ మూర్తి వి. బాల భాస్కరరావు మాట్లాడుతూ, అన్నం పెట్టే రైతు దేశానికి వెన్నముక అని, అలాంటి రైతు వ్యవసాయం, పశుపోషణలో ఎరువులు, విత్తనాలు, క్రిమి సంహా రక మందులు, ఇన్సూరెన్స్ తదితర విషయాలలో నష్టపోకుండా అవగాహన కలిగించడం, రైతుకు వెన్నుదన్నుగా అండగా ఉండి అధికారులు, డీలర్లు మధ్య సమన్వయంతో రైతుకు లబ్ది చేకూర్చడం, రైతుల సమస్యలు, అవసరాలను న్యాయపరంగా పరిష్కరించడం కోసం న్యాయ సహాయ కేంద్రాలు పనిచేస్తాయని, జిల్లాలో 92 రైతు వేదికలలో వారానికి రెండు సార్లు పారా  లీగల్ వాలంటీర్లు, అధికారులతో కలిసి రైతులకు సహాయం, సమస్యలను తెలుసుకోవడం జరుగుతుందని, రైతులకు ఏ అధికారుల అవసరం వుందో తెలుసుకొని ఆ అధికారులతో  పరిష్కారానికి కృషి చేయడం జరుగుతుందని, ధరణి, రైతుబంధు, రైతుబీమా తదితర రైతుకు ఉపయోగపడే ప్రభుత్వ పథకాలు సంబంధిత శాఖల అధికారుల సమన్వయంతో రైతుకు సత్వరంగా అందేలా చూడడం, రైతుకు భరోసా కల్పించడం జరుగుతుందని, రైతులు కూడా తమ సమస్యలను రైతువేదికలలో నిర్వహించే వ్యవసాయ న్యాయ సహాయ సదస్సులలో తెలియచెప్పాలని, న్యాయ సహాయ కేంద్రాలను సద్వినియోగం చేసుకోవాలని కోరారు. న్యాయ సేవా సంస్థ ఉన్నదే న్యాయం కోసమని, ఇన్సూరెన్స్ కోసం కంపెనీలకు, ప్రభుత్వానికి మధ్య సమన్వయంతో నష్టపరిహారం ఇప్పించేందుకు అలాగే న్యాయ సహాయం కోసం న్యాయవాదిని కూడా ఏర్పాటు చేయడం జరుగుతుందని తెలిపారు. తెలంగాణ రాష్ట్ర లీగల్ సర్వీసెస్ అధారిటీ సూచనల మేరకు తొలుత జనగాం జిల్లా బమ్మెరలో సదస్సు ప్రారంభించడం జరిగిందని, ఈ రోజు యాదాద్రి జిల్లాలో ప్రారంభించుకుంటున్నామని, మిగతా 91 రైతుల వేదికలలో కూడా ప్ర్రారంభించడం జరుగుతుందని తెలిపారు.

జిల్లా మొదటి అదనపు న్యాయమూర్తి శ్రీమతి కె.మారుతీ దేవి మాట్లాడుతూ, రైతే అన్నదాత అని, రైతు లేనిదే ప్రపంచం లేదని, అలాంటి రైతుకు పంట ద్వారా రావలసిన ఆదాయం అందేలా, నకిలీ విత్తనాలు, మందులు, ఎరువుల బారినపడకుండా, భూసార పరీక్షల ద్వారా పంటల నిర్ధారణ, వర్షాభావం వలన కలిగే నష్టాలు, పశు పోషణలో కలిగే నష్టాలు, ఇతర సమస్యల పట్ల అధికారులు, ఏజెన్సీలు, డీలర్ల తోడ్పాటుతో రైతుకు అండగా వుండడానికి, రైతులకు కల్పించిన ప్రభుత్వ పథకాల అమలుకు వ్యవసాయ న్యాయ సహాయ కేంద్రాలు పనిచేస్తాయని అన్నారు.

జిల్లా ప్రధాన సీనియర్ సివిల్ జడ్జి, జిల్లా లీగల్ సర్వీసెస్ అధారిటీ సంస్థ సెక్రటరీ కె దశరథ రామయ్య మాట్లాడుతూ, జిల్లాలో వ్యవసాయ న్యాయ సహాయ కేంద్రాలు ప్ర్రారంభించామని, రైతుకు న్యాయపరంగా సహాయం అందించడం, రైతుల సమస్యలను పరిష్కరించడం ముఖ్య ఉద్దేశమని అన్నారు.

జిల్లా ప్రధాన జూనియర్ సివిల్ జడ్జి డి.నాగేశ్వరరావు మాట్లాడుతూ, ఈ మధ్యనే జిల్లాలో నిబంధనలకు విరుద్ధంగా ప్రవర్తించిన విత్తనాలు, ఎరువుల డీలర్లకు సంబంధించి 25 కేసులు నమోదు కావడం జరిగిందని, వీటిని సాధ్యమైనంత వేగంగా పరిష్కరించడం జరుగుతుందని, కేసులు బుక్ చేయడమే కాదు కేసును త్వరగా పరిష్కరించడం ముఖ్యమని తెలిపారు. వ్యవసాయ సీజన్ బట్టి వ్యవసాయ అధికార్లు డీలర్లు, షాపులపై అవసరమైన చోట రైడింగ్ నిర్వహిస్తే మంచి ఫలితాలు వస్తాయని, రైతులకు నష్టం కలుగకుండా చూడవచ్చని సూచించారు. రైతులకు న్యాయ సహాయం అందించే ఇలాంటి వేదికలు మంచి పరిణామమని, రైతును విస్మరించకుండా ధైర్యం కలిగించేలా వుంటుందని అన్నారు.

జిల్లా వ్యవసాయ అధికారి శ్రీమతి అనూరాధ మాట్లాడుతూ, ఇది మంచి కార్యక్రమమని, రైతుకు భూతగాదాలే కాకుండా పంట, విత్తనాలు, ఎరువులు, డీలర్లు, తదితర సమస్యలకు ఈ వేదిక చక్కని పరిష్కార వేదిక అని, తద్వారా రైతుకు నాణ్యమైన ఎరువులు, విత్తనాలు అందుతాయని అన్నారు. ప్రతిమంగళ,శుక్రవారాలలో జరిగే రైతు వేదికల కార్యక్రమాలలో న్యాయ సదస్సులు నిర్వహించాలని లీగల్ సర్వీసెస్ అథారిటీని కోరారు. అలాగే రైతులు కూడా . విత్తనాలు, ఎరువులు, మందుల పట్ల అనుమానాలు ఉంటే మండల వ్యవసాయ అధికారులకు ఫిర్యాదు చేయాలని, తగిన చర్యలు తీసుకోవడం జరుగుతుందని అన్నారు.

జిల్లా పశు సంవర్ధక శాఖ  అధికారి డాక్టర్ కృష్ణ మాట్లాడుతూ, యాదాద్రి జిల్లా వ్యవసాయంతో పాటు పశు పోషణలో ముందుందని, పాల దిగుబడి అధికంగా ఉందని, ఇక్కడ సంకర జాతి పశువులు అధికంగా వున్నాయని, న్యాయ సదస్సులు రైతు మేలు కొరకు వారి ముందుకే వచ్చి పరిష్కరించడం బాగుందని, ప్రధానంగా ఇన్సూరెన్స్ కంపెనీలు వెంటనే క్లెయిమ్స్ చేసేలా చూడాలని, చిన్న చిన్న సాకులు చూపి రైతులకు సకాలంలో ఇన్యూరెన్స్ చెల్లించకపోవడం పట్ల ఈ వేదికలు రైతులకు న్యాయం చేస్తాయని, ముఖ్యంగా ప్రకృతి వైపరీత్యాలు, జాతీయ విపత్తులు, విద్యుత్ ట్రాన్స్ఫార్మర్లు, తదితర కారణాల వలన పశు సంపదకు నష్టం జరిగితే రైతు సత్వర న్యాయ సహాయం పొందవచ్చునని, రైతులు కూడా తమ సమస్యలను అధికారులతో పంచుకోవాలని కోరారు. జిల్లా బార్ అసోసియేషన్ ప్రెసిడెంట్, జిల్లా లీగల్ సర్వీసెస్ అధారిటీ సభ్యులు నాగారపు అంజయ్య మాట్లాడుతూ, ప్రభుత్వ సదుద్దేశాలను అధికారులు రైతుల వద్దకు తీసుకెళ్లాలని, రైతులు కూడా తమకు జరిగే కష్టనష్టాలను తెలియచెప్పి పరిష్కారం పొందాలని అన్నారు. 

ఈ కార్యాక్రమంలో భువనగిరి డిప్యూటీ చీఫ్ లీగల్ ఎయిడ్ కౌన్సిల్ జి.శంకర్,  న్యాయవాదుల సంఘం కార్యదర్శి సి.హెచ్. రాజశేఖర్ రెడ్డి పాల్గొన్నారు.