జరిమానా కట్టేదే లేదు! బ్యానర్లు కడితే ఫైన్​ వేస్తారా?

జరిమానా కట్టేదే లేదు! బ్యానర్లు కడితే ఫైన్​ వేస్తారా?
  • జీహెచ్ఎంసీ వద్ద డబ్బులు లేవా?
  • నాంప్లలి దర్గా దగ్గర కూర్చోన్ని అడగండి, మేమే డబ్బులు వేస్తాం
  • బీఆర్ఎస్ నేతల బ్యానర్లపై ఎందుకు ఫైన్ వేయరు?
  • గ్రేటర్​ సిబ్బంది తీరుపై మండిపడిన వి.హనుమంతరావు

ముద్ర, తెలంగాణ బ్యూరో: కాంగ్రెస్ విజయభేరీ సభ, సీడబ్ల్యూసీ సమావేశం కోసం బ్యానర్లు కడితే జీహెచ్ఎంసీ సిబ్బంది జరిమానాలు విధించారని మాజీ ఎంపీ, కాంగ్రెస్ సీనియర్ నేత వి.హనుమంతరావు ఆగ్రహం వ్యక్తం చేశారు. కాంగ్రెస్ కట్టిన బ్యానర్లపై రూ.2.95లక్షలు జరిమానాలు విధించారని ఆయన చెప్పారు. జీహెచ్ఎంసీలో డబ్బులు లేకపోతే నాంపల్లి దర్గా దగ్గర కూర్చొని అడిగితే తామే డబ్బులు వేస్తామని ఆయన ఎద్దేవా చేశారు. బీఆర్ఎస్ మంత్రుల పుట్టినరోజులకు, ఆ పార్టీ సభలకు పెద్ద పెద్ద కటౌట్లు పెడితే ఎందుకు జరిమానా విధించరని గ్రేటర్ అధికారులను ఆయన ప్రశ్నించారు. రాజకీయ కక్షలో భాగంగా జీహెచ్ఎంసీ సిబ్బంది పక్షపాత ధోరణిలో వ్యవహరిస్తుందని ఆయన ఆరోపించారు.

మంగళవారం గాంధీభవన్ లో మీడియాతో వి.హనుమంత రావు మాట్లాడారు. నిజాం ప్రభువు సరెండర్ అయిన సెప్టెంబర్ 17న విమోచన దినోత్సవాలను పురస్కరించుకుని అన్ని పార్టీలు వారు బ్యానర్లు కట్టారని ఆయన తెలిపారు. ఈ సందర్భాన్ని గుర్తించకుండా బ్యానర్లపై జరిమాన విధించడం దారుణమన్నారు. బ్యానర్లపై విధిస్తున్న జరిమానాలను వెంటనే రద్దు చేయాలని ఆయన డిమాండ్ చేశారు. వారం రోజుల్లోగా రద్దు చేయకపోతే మున్సిపల్ కార్పోరేషన్ ఎదుట ధర్నా చేస్తామని ఆయన హెచ్చరించారు. అవసరమైతే జైలుకైనా వెళ్తాం కానీ జరిమానాలను కట్టేది లేదని ఆయన స్పష్టం చేశారు. జరిమానాలను కట్టాలని అధికారులు ఒత్తిడి తెస్తే తిరగబడండని కాంగ్రెస్ కార్యకర్తలకు ఆయన పిలుపునిచ్చారు.