కనకమామిడిలో వైభవంగా వెంకన్న బ్రహ్మోత్సవాలు

కనకమామిడిలో వైభవంగా వెంకన్న బ్రహ్మోత్సవాలు

ముద్ర న్యూస్ బ్యూరో, హైదరాబాద్: రంగారెడ్డి జిల్లా మొయినాబాద్ మండలం కనకమామిడి గ్రామంలో వెలసిన శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయ 9వ వార్షికోత్సవాల సందర్భంగా బ్రహ్మోత్సవాలు వైభవంగా జరిగాయి. తెల్లవారుజామున 4 గంటలకు స్వామివారికి సుప్రభాత సేవతో కార్యక్రమాలు ప్రారంభమయ్యాయి.

10 గంటలకు తిరుకల్యాణం, మధ్యాహ్నం 12 గంటలకు ఆధ్యాత్మిక ప్రసంగ కార్యక్రమం, ఒంటిగంటకు అన్నదాన కార్యక్రమం జరిగాయి. ఇక సాయంత్రం 4 గంటలకు పుష్పార్చన, పుష్పయాగం వైభవంగా జరిగాయి.

ఈ కార్యక్రమంలో తెలంగాణ రాష్ట్ర ఎన్నికల కమిషనర్ చిట్ల పార్థసారథి కుటుంబ సమేతంగా పాల్గొన్నారు. అనంతరం రాత్రి 8 గంటలకు భక్తులకు అన్నదాన కార్యక్రమం, 10 గంటలకు భక్తులచే భజన కార్యక్రమం జరుగుతాయి. 

   వైకుంఠ ద్వార దర్శనానికి ఏర్పాట్లు పూర్తి 

 23వ తేదీ శుద్ధ వైకుంఠ ఏకాదశి, శనివారంనాడు తెల్లవారుజామున 2 గంటలకు స్వామివారికి సుప్రభాత సేవతో కార్యక్రమాలు ప్రారంభమవుతాయి. ఉదయం 5 గంటలకు వైకుంఠ ద్వార దర్శనం (ఉత్తర ద్వార దర్శనం), 10 గంటలకు ఆధ్యాత్మిక ప్రముఖులచే భగవద్గీతా పారాయణం, విష్ణుసహస్రనామ పారాయణం, హనుమాన్ చాలీసా, తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ సాంస్కృతికశాఖ ఆధ్వర్యంలో చిడతల  కళాకారులచే రామాయణ ప్రదర్శన, మధ్యాహ్నం 12 గంటలకు అన్నదాన కార్యక్రమం, సాయంత్రం 6 గంటలకు ధ్వజారోహణం, దేవతోద్వోసనతో శ్రీవెంకటేశ్వరస్వామివారి నవమ బ్రహ్మోత్సవాలకు స్వస్తి పలుకుతారు.