ఆయుధాలతో సాధించలేనిది అహింసతో సాధించ వచ్చు

ఆయుధాలతో సాధించలేనిది అహింసతో సాధించ వచ్చు
  • అదే గాంధీ మార్గం
  • జిల్లా కలెక్టర్ తేజస్ నందలాల్ పవర్

ముద్ర ప్రతినిధి, వనపర్తి :భారతదేశ స్వతంత్ర పోరాటం సమయంలో ఆధునిక మారణాయుధాలు కలిగిన బ్రిటిష్ వారితో ఎదురు వెళ్లి అదే ఆయుధాలతో పోరాటం చేయడం వల్ల ఫలితం ఉండదని గ్రహించిన గాంధీ అహింసా వాదంతో తిరుగులేని ఆయుధాన్ని బ్రిటిష్ వారిపై ప్రయోగించి, వారు ఏర్పాటు చేసిన సమావేశాలలో పాల్గొంటూ చాలా చాకచక్యంగా స్వాతంత్రాన్ని సంపాదించారని,  ఆ స్ఫూర్తిని ప్రతి ఒక్కరూ పొందాలని వనపర్తి జిల్లా కలెక్టర్ తేజస్ నందలాలు పవార్ పిలుపునిచ్చారు.

వనపర్తి జిల్లా కార్యాలయాల సమీకృత భవన ప్రాంగణంలో సోమవారం జాతిపిత గాంధీ, మాజీ ప్రధాని లాల్ బహుదూర్ శాస్త్రి  జయంతి ఉత్సవాలు అట్టహాసంగా జరిగాయి. ఈ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ గ్రామస్థాయిలో సమాజం ఆర్థికంగా, వ్యవసాయకంగా, విద్య, వైద్య రంగాలలో అభివృద్ధి చెందినప్పుడే దేశం అభివృద్ధి చెందుతుందని ఆశించిన గాంధీ  కలలు సహకారం అవుతున్నాయని ఆయన అన్నారు . ప్రశ్నించడానికి భయపడే ఆనాటి సమాజంలో అందరినీ ఒక తాటిపైకి తీసుకొచ్చి శాంతియుతంగా అహింసా మార్గంలో నడిపించి బ్రిటీష్ వారి లో వణుకు పుట్టించిన గాంధీ గారి ఆలోచన విధానం నేటికీ విశేషంగానే చెప్పబడుతుందని ఆయన అన్నారు. ప్రతి వ్యక్తి సొంతంగా తన పని తానే చేసుకోవడం, సమాజంలో అందరినీ భాగస్వాములు చేయడం, శాంతియుతంగా పోరాడటం అనే విషయాలను ఆచరించి ప్రజలకు ఆ మేరకు పిలుపు నిచ్చారని అన్నారు. అలాగే వ్యవసాయం, దేశ రక్షణకు లాల్ బహుదూర్ శాస్త్రి మొదటి ప్రాధాన్యం ఇచ్చారని, కష్ట సమయంలో భారతదేశంలో ప్రధానమంత్రిగా బాధ్యతలు తీసుకున్న లాల్ బహుదూర్ శాస్త్రి జై జవాన్ జై కిసాన్ అనే నినాదంతో ముందుకు వెళ్లారని  కలెక్టర్ పేర్కొన్నారు.  ఒకే సమయంలో  ఆహార ఉత్పత్తికి, దేశ రక్షణకు వారు తీసుకున్న ప్రణాళిక బద్ధమైన కార్యక్రమాలు నేడు ఎంతగానో విజయం సాధించాయని ఆయన కొనియాడారు.

ప్రజాస్వామ్యంలో ఓటు హక్కు ద్వారా తమ ప్రతినిధులను తామే ఎంచుకొని సుపరిపాలన దిశగా అడుగులు వేసే అవకాశాన్ని రాజ్యాంగం కల్పించిందని ఈ దిశగా జిల్లాలో  కలెక్టర్ ఆధ్వర్యంలో విశేషంగా జరుపుతున్నారని వనపర్తి జిల్లా పరిషత్ అధ్యక్షులు ఆర్ లోకనాథ్ రెడ్డి పేర్కొన్నారు. ప్రతి ఒక్కరూ ఓటరుగా నమోదు కావడానికి ఓటింగ్ శాతం పెంచడానికి జిల్లాలో విశేషమైన జరుగుతుందని గాంధీజీ కలలు కన్న గ్రామ స్వరాజ్యం దిశగా ఫలితాలు అనుభవంలోకి వస్తున్నాయని ఆయన అన్నారు. గాంధీజీ ఇచ్చిన స్ఫూర్తి ఎల్లవేళలా ఆచరణీయ మని ఆ స్ఫూర్తిని కొనసాగించాలని పిలుపునిస్తూ, మంచి చేయాలని సంకల్పం ఉంటే చాలు తక్కువ సమయంలోనే సమాజానికి అవసరమైన మేలు చేయొచ్చని ప్రధాని లాల్ బహుదూర్ శాస్త్రి నిరూపించాడని ఆయన కొనియాడారు. డిపిఓ నర్సింలు, వ్యవసాయ మహిళా కళాశాల ప్రిన్సిపల్ తదితరులు ప్రసంగించారు. ఈ కార్యక్రమంలో జిల్లా స్థాయి అధికారులు సిబ్బంది పాల్గొన్నారు. అనంతరం పదవి విరమణ చేసిన వ్యవసాయ మహిళ డిగ్రీ కళాశాల ప్రిన్సిపల్ ఎం సుధాకర్ ను, కొత్తగా బాధ్యతలు తీసుకున్న ఏ కృష్ణ అగ్రాణమి ప్రొఫెసర్  లను సత్కరించారు.