చాయ్ తాగాలన్న కోరిక..

చాయ్ తాగాలన్న కోరిక..

ఆ ముగ్గురి చావుకు కారణం అయింది

స్టేషన్ ఘన్ పూర్, ముద్ర: చాయ్ తాగాలన్న కోరిక హైదరాబాద్ (నాచారం) కు చెందిన జీవన్ బాబు, వసుంధర దేవి, నేహా రాయ్ అనే ఆ ముగ్గురి చావుకు కారణమైంది. జనగామ జిల్లా స్టేషన్ ఘన్ పూర్ మండలం మీదికొండ క్రాస్ రోడ్డు వద్ద బుధవారం ఆర్టీసీ బస్సు-కారును ఢీకొన్న ప్రమాదంలో తల్లి కూతుర్లు అక్కడికక్కడే మృతి చెందిన విషయం విధితమే. వివరాల్లోకి వెళితే... ఆంధ్రప్రదేశ్ గుంటూరు జిల్లా కు చెందిన దేవరపల్లి జీవన్ బాబు హైదరాబాదు నాచారంలో స్థిరపడ్డాడు. వృత్తిరీత్యా సివిల్ ఇంజనీర్ గా కువైట్ లో పనిచేస్తున్నాడు. వేసవి సెలవులకు హైదరాబాద్ వచ్చిన జీవన్ బాబు తన ఇంట్లో పనిమనిషి కుమారుడి పెళ్లికి హాజరయ్యేందుకు బుధవారం వరంగల్ జిల్లా రాయపర్తి మండలం, పెరికేడు కు భార్య వసుంధర దేవి, కూతురు స్నేహరాయితో కలిసి వెళ్లారు. తిరుగు ప్రయాణంలో స్టేషన్ ఘన్ పూర్ మండలం చాగల్లు దాటుతుండగా గ్రామ శివారులో ఎంజెఆర్ దాబా కనిపించడంతో అక్కడ చాయ్ తాగాలని నిర్ణయించుకున్నారు.

జాతీయ రహదారిపై కొంత దూరం వెళ్లిన తర్వాత మీది కొండ క్రాస్ రోడ్డు వద్ద యూటర్న్ తీసుకొని ఎంజెఆర్ దాబాకు వచ్చి చాయ్ తాగి హైదరాబాదుకు తిరిగి ప్రయాణమయ్యారు. ఈ తిరుగు ప్రయాణంలో మీది కొండ క్రాస్ రోడ్డు వరకు ఆపోజిట్ డైరెక్షన్లో వచ్చి రోడ్డు దాటుతుండగా హైదరాబాదు నుండి హనుమకొండకు వస్తున్న రాజధాని బస్సు జీవన్ బాబు కుటుంబ సభ్యులు ప్రయాణిస్తున్న కారును ఢీ కొట్టింది. ఈ ప్రమాదంలో దేవరపల్లి వసుంధర దేవి, దేవరపల్లి నేహా రాయ్ లు అక్కడికక్కడే మృతి చెందగా ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న దేవరపల్లి జీవన్ బాబు గురువారం మృతి చెందాడు. పనిమనిషి కొడుకు పెళ్లికి వచ్చి తిరిగి వెళ్లే క్రమంలో చాయ్ తాగాలన్న కోరిక ఆ ముగ్గురి ప్రాణాలను అనంత వాయువుల్లో కలిపింది. మృతుడు జీవన్ బాబు కుమారుడు దేవరపల్లి మోహన్ రాయ్ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు సిఐ రాఘవేందర్  తెలిపారు.