దేవాలయాలు ఆధ్యాత్మిక కేంద్రాలు

దేవాలయాలు ఆధ్యాత్మిక కేంద్రాలు
  • మనిషిలో మంచి పరివర్తన తెచ్చే నిలయాలుగా దేవాలయాలు మారాలి
  • శ్రీ వేణుగోపాల స్వామి దేవాలయ భద్రపీఠం పునర్ ప్రతిష్టలో శ్రీశ్రీశ్రీ త్రిదండి రామానుజ చిన్న జీయర్ స్వామి
  • పురాతన ఆలయాల పునరుద్ధరణకు ప్రభుత్వం కట్టుబడి ఉంది
  • త్వరలోనే వెంకటేశ్వర స్వామి దేవాలయ పునర్నిర్మాణం చేసుకుందాం : మంత్రి జగదీష్ రెడ్డి

 ముద్ర ప్రతినిధి సూర్యాపేట : దేవాలయాలు ఆధ్యాత్మిక కేంద్రాలని అవి మనిషిలో మంచి పరివర్తన తెచ్చే నిలయాలు కావాలని శ్రీశ్రీశ్రీ త్రిదండి రామానుజ చిన్న జీయర్ స్వామి అన్నారు. సూర్యాపేట జిల్లా కేంద్రంలోని శ్రీ వేణుగోపాల స్వామి దేవాలయంలో మూలవిరాట్ విగ్రహాల భద్ర పీఠం పునర్ ప్రతిష్ట కార్యక్రమం కన్నుల పండువగా ఘనంగా జరిగింది. ఆలయంలో బుధవారం ఉదయం అర్చకులు సంప్రోక్షణ పూర్ణాహుతి కార్యక్రమాలను నిర్వహించగా మధ్యాహ్నం జీయర్ స్వామి చేతుల మీదుగా విగ్రహ పునర్ ప్రతిష్ట కార్యక్రమాన్ని నిర్వహించారు ఈ సందర్భంగా చిన్న జీయార్ స్వామి భక్తులను ఉద్దేశించి ప్రవచిస్తూ దేవాలయాల్లో పూజలు ప్రసాదాలు కాకుండా ఆధ్యాత్మిక కేంద్రాలుగా ఉన్నాయని అవి అందరికీ మంచి చేసేలా ఉపయోగపడాలన్నారు. సమాజంలో ప్రతి ఒక్కరు వాల్మీకి వ్యాసుడు రాసిన రామాయణం భాగవతం గురించి తెలుసుకోవాల్సిన అవసరం ఉందన్నారు. ఈ కార్యక్రమానికి అతిథిగా హాజరైన సూర్యాపేట శాసనసభ్యులు రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి గుంటకండ్ల జగదీష్ రెడ్డి స్వామి వారి ఆశీస్సులు అందుకొని భక్తులను ఉద్దేశించి మాట్లాడారు. స్వామివారి పరిపూర్ణమైన అనుగ్రహంతో ఇక్కడ అనేక రకాల ఆధ్యాత్మిక కార్యక్రమాలను చేపట్టుతున్నామని ముందు ముందు కూడా ఇలాగే కొనసాగిస్తామన్నారు. త్వరలోనే వెంకటేశ్వర స్వామి దేవాలయ పునర్నిర్మాణం చేపట్టుకుందామన్నారు. రామాయణంలో పక్షపక్షాదులను సమానంగా చూసిన చరిత్ర మనదే అన్నారు.  రాష్ట్రంలోని పురాతన ఆలయాల పునరుద్ధరణకు ప్రభుత్వం కట్టుబడి ఉందన్నారు. ఈ కార్యక్రమంలో అహోబిల జీయర్ స్వామి కృష్ణమాచార్యులు, దేవాలయ అర్చకులు నల్లన్ చక్రవర్తుల మురళీధరాచార్యులు, నల్లన్ చక్రవర్తుల వేణుగోపాలాచార్యులు, దైవ సేవకులు ఉప్పల గోపాలకృష్ణయ్య,  వీర్లపాటి సత్యనారాయణ, కొత్తపేట రామకృష్ణ,  కందిమల్ల శంకర్,  విజయ్ కుమార్, శ్రీరంగం సోమలక్ష్మి,  పద్మ,  శ్రీరంగం రాము తదితరులు పాల్గొన్నారు.