సూర్యాపేట మెజార్టీని ఫిక్స్ చేసిన‌ సీఎం కేసీఆర్

సూర్యాపేట మెజార్టీని ఫిక్స్ చేసిన‌ సీఎం కేసీఆర్
  • లక్ష‌మంది హాజ‌రుతో గులాబీతోట‌గా మారిన సూర్యాపేట‌
  • జ‌గ‌దీశ్‌రెడ్డిని మ‌ళ్లీ మంత్రిని చేస్తాన‌ని కేసీఆర్‌ ప్ర‌క‌ట‌న‌
  • 73చోట్ల‌ సీఎం సభలు జరిగితే ఉన్నత స్థానం హామీ జగదిష్ రెడ్డికి మాత్రమే
  • సీఎం ప్రకటన పట్ల పేట ప్రజలు, టిఆర్ఎస్ కార్యకర్తల్లో హర్షాతిరేకాలు
  • పేట అభివృద్ధికి మరిన్నినిధుల వస్తాయని ఆశాభావం
  • ఐటి హబ్‌, పారిశ్రామిక వాడ, డ్రైపోర్టుకు ఓకే అన్న సీఎం
  • యువతలో వెల్లువెత్తుతున్న ఉత్సాహం
  • గిరిజన బంధు ప్రకటనతో తండాల గుండెల్లోకి బీఆరెస్‌
  • కెసిఆర్ మాటిస్తే తప్పకుండా అమలు చేస్తారంటున్న గిరిజన నేతలు
  • ఫిట్నెస్ చార్జీలు రద్దు హామీతో ఆటో కార్మికుల్లో కారుకు పెరిగిన క్రేజ్
  • సూర్యాపేట‌కు మ‌రోసారి భారీగా నిధులు ఖాయమంటున్న జ‌నం
  • జగదీష్ రెడ్డి మెజార్టీ 50 వేల‌పైనే అంటూ పేట‌లో మొద‌లైన బెట్టింగులు

ముద్ర ప్రతినిధి సూర్యాపేట: సూర్యాపేట‌లో మంగ‌ళ‌వారం జ‌రిగిన సీఎం కేసీఆర్ జ‌న ఆశీర్వాద స‌భ క‌నీవినీ ఎరుగ‌నంత విజ‌య‌వంత‌మైంది. ఈ స‌భ‌కు సుమారు ల‌క్ష‌మంది హాజ‌రు కావ‌డంతో పేట‌లో మంత్రి జ‌గ‌దీశ్‌రెడ్డి మెజార్టీ ఫిక్స్ అయిపోయింద‌ని రాజ‌కీయ విశ్లేష‌కులు చెబుతున్నారు. భారీస్థాయిలో సూర్యాపేట‌ను అభివృద్ధి చేసిన జ‌గ‌దీశ్‌రెడ్డిని భారీ మెజార్టీతో గెలిపించాల‌న్న కేసీఆర్ మాట‌లు బీఆరెస్ కార్య‌క‌ర్త‌ల్లో, నాయ‌కుల్లో నూత‌న ఉత్సాహాన్నిచ్చాయి. జ‌గ‌దీశ్‌రెడ్డిని మ‌రోసారి మంత్రిని చేస్తాన‌ని, క‌చ్చితంగా ఉన్న‌త‌స్థానంలో ఉంటార‌ని కేసీఆర్ స‌భాముఖంగా హామీ ఇవ్వ‌డంతో ఇటు పార్టీ శ్రేణుల్లో, అటు పేట ప్ర‌జ‌ల్లో హర్షాతిరేకాలు వ్య‌క్త‌మైనాయి. మంచి నాయకుడిని జారవిడుచుకోవద్దంటూ జ‌గ‌దీశ్‌రెడ్డి గురించి సీఎం కేసీఆర్ చెప్పిన మాట‌లు పార్టీ క్యాడ‌ర్‌లో ఉన్న చిన్న చిన్న అసంతృప్తుల‌ను ప‌టాపంచ‌లు చేయ‌డంతోపాటు, అటు ఇటు ఆలోచిస్తున్న ఓట‌ర్ల‌ను కూడా ఏకం చేశాయంటున్నారు. గ‌త ఎన్నిక‌ల్లో చెప్పిన ప్ర‌తి హామీని నెర‌వేర్చి, పేట‌లో రౌడీయిజం, గూండాయిజం, చందాలు- దందాలు, దౌర్జ‌న్యాలు లేకుండా చేసిన జ‌గ‌దీశ్‌రెడ్డి ద్వారానే మ‌రింత అభివృద్ధి జ‌రుగుతుంద‌నే అభిప్రాయం ప్ర‌జ‌ల్లో మెండుగా క‌నిపిస్తోంది. 
పేట ప్రజలకు మూసి మురికి నీళ్లు తాగించిన దౌర్భాగ్య పార్టీ కాంగ్రెస్ అని కేసీఆర్ గుర్తు చేయ‌డంతో, గ‌తంలో కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే అరాచ‌కాలు, అనుచ‌రుల ఆగ‌డాలు మ‌ళ్లీ పేట ప్ర‌జ‌లకు గుర్తు చేసిన‌ట్ల‌యింది. దీంతో వారంతా గ‌తాన్ని గుర్తు తెచ్చుకుని, జ‌గ‌దీశ్‌రెడ్డికి మించిన అభ్య‌ర్థి లేడ‌న్న ఏకాభిప్రాయానికి వ‌చ్చిన‌ట్లు స‌ర్వేలో సైతం స్ప‌ష్ట‌మైంది. గత హామీలన్ని తు.చ. తప్పకుండా అమలు కావడంతో ఈసారి కూడా మ‌రింత అభివృద్ది జగదీష్ తోనే సాధ్యం అని ఓట‌ర్లు భావిస్తున్నారు. మంచిగా ప‌నిచేసే వ్య‌క్తిని కాద‌ని, ఎవ‌రికో ఎందుకు ఓటేయాల‌నే చ‌ర్చా ప్ర‌జ‌ల్లో పెద్ద ఎత్తున జ‌రుగుతోంది. 50వేల పైచిలుకు ఓట్ల‌తో భారీ మెజాిటీతో కారు గుర్తును గెలిపించేందుకు నియోజకవర్గం ఓట‌ర్లు సిద్ధ‌మ‌వుతున్న‌ట్లు తెలుస్తోంది. 

73 స‌భలు జ‌రిగితే మ‌ళ్లీ మంత్రి హామీ ఒక్క జ‌గ‌దీశ్‌కు మాత్ర‌మే!

ఇప్ప‌టివ‌ర‌కు సీఎం కేసీఆర్ 73 చోట్ల ప్ర‌జా ఆశీర్వాద సభలు జరిగితే ఉన్నత స్థానం హామీ ఒక్క జగదిశ్‌ రెడ్డికి మాత్రమే ఇవ్వ‌డంతో కేసీఆర్ ప్ర‌భుత్వంలో మంత్రికి ఉండ‌బోయే ప్రాధాన్య‌త ఎంత‌నేది తేలిపోయింది. దాంతో వివిధ కార‌ణాల వ‌ల్ల లోలోప‌ల అసంతృప్తిగా ఉన్న బీఆరెస్ నేత‌లు కూడా మ‌న‌సు మార్చుకున్నారు. జ‌గ‌దీశ్‌రెడ్డికి అండ‌గా ఉంటేనే రేపు మ‌న‌కూ భ‌విష్య‌త్ ఉంటుంది, లేకుంటే అన్ని విధాలా న‌ష్ట‌మే జ‌రుగుతుంద‌నే అభిప్రాయానికి వ‌చ్చారు. ఎవ‌రిస్థాయిలో వాళ్లు ప్ర‌చారానికి శ్రీ‌కారం చుట్టారు. పార్టీ మ్యానిఫెస్టోను, జ‌గ‌దీశ్‌రెడ్డి చేసిన అభివృద్ధిని ఓట‌ర్ల‌కు వివ‌రిస్తూ ప్ర‌చారంలో బిజీ అయిపోయారు. కార్య‌క‌ర్త‌ల్లో సైతం గెలిచిపోయామ‌న్న ధీమా క‌నిపిస్తోంది. భారీ మెజార్టీ ల‌క్ష్యంగా ప్ర‌చారంలో పాల్గొంటున్నారు. 

జ‌గ‌దీశ్ గెలిస్తే పేట‌కు మ‌రిన్ని నిధులు

సీఎం కేసీఆర్ చెప్పిన‌ట్లు సూర్యా పేట అభివృద్ధికి జ‌గ‌దీశ్‌రెడ్డి ఇప్ప‌టివ‌ర‌కూ 7500 కోట్ల‌కు పైగా నిధులు తెచ్చారు. మళ్లీ గెలిస్తే మంత్రి కావ‌డం ఖాయ‌మ‌ని తేల‌య‌డంతో పేట‌కు మరిన్నినిధుల వస్తాయన్న ఆశ అటు పార్టీశ్రేణుల్లో ఇటు ప్ర‌జ‌ల్లో స్ప‌ష్టంగా క‌నిపిస్తోంది. ఐటి హబ్‌, పారిశ్రామిక వాడ, డ్రైపోర్టు నిర్మాణానికి సీఎం కేసీఆర్ ఓకే చెప్ప‌డంతో వ్యాపారులు, యువ‌త‌లో ఉత్సాహం పెరిగింది. స్థానికంగానే సుమారు 13 వేల మందికి ఉపాధినిచ్చే హామీల‌ను జ‌గ‌దీశ్‌రెడ్డి కోర‌డం, సీఎం కేసీఆర్ స‌రేన‌న‌డంతో యువతలోఉత్సాహం వెల్లువెత్తుతోంది. వ్యాపారాలు మ‌రింత వృద్ధి చెందుతాయ‌న్న ఆశ వ్యాపారుల ముఖంలో చిరున‌వ్వులు పూయిస్తోంది. జ‌గ‌దీశ్‌రెడ్డిని గెలిపించుకుంటే సూర్యాపేట‌కు మ‌రోసారి భారీగా నిధులు రావ‌డం ఖాయమంటు జ‌నం చ‌ర్చించుకుంటున్నారు. 

గిరిజన బంధు ప్రకటనతో తండాల గుండెల్లోకి బీఆరెస్‌

ద‌ళిత‌బంధు త‌ర‌హాలో గిరిజ‌నుల‌కు సైతం గిరిజ‌న బంధు ప‌థ‌కాన్ని అమ‌లు చేస్తామ‌న్న సీఎం కేసీఆర్ హామీతో తండాల గుండెల్లోకి గులాబీ పార్టీ చొచ్చుకుపోయింది. ఇప్ప‌టికే తండాల‌ను గ్రామ పంచాయితీలు చేయ‌డం, పోడు భూముల‌కు ప‌ట్టాలు ఇవ్వ‌డం వంటి ప‌థ‌కాల‌తో తండాల‌కు, గూడెల‌కు ద‌గ్గ‌రైన కారు గుర్తు, గిరిజ‌న బంధు ప్ర‌క‌ట‌న‌తో వారి గుండెల్లో శాశ్వ‌తంగా ఉండిపోయే వాతావ‌ర‌ణం క‌న‌బ‌డుతోంది. కెసిఆర్ మాటిస్తే తప్పకుండా అమలు చేస్తారంటూ గిరిజన నేతలు సైతం విశ్వాసం వ్య‌క్తం చేస్తున్నారు. 

ఆటోకార్మికుల్లో రెట్టింపు ఆనందం!

ఆటో కార్మికుల‌కు ఇప్ప‌టికే ట్రాఫిక్‌ చ‌లాన్ల వేధింపులు లేకుండా చేశారు మంత్రి జ‌గ‌దీశ్‌రెడ్డి, పోలీసుల నుంచి కూడా ఎలాంటి ఇబ్బందులు లేకుండా ప్ర‌త్యేక శ్ర‌ద్ధ తీసుకోవడంతో పేట‌లో ఆటో కార్మికులు ఊపిరి పీల్చుకున్నారు. సీఎం కేసీఆర్ సైతం సూర్యాపేట స‌భ‌లో ఫిట్నెస్ చార్జీలు రద్దు చేస్తామ‌ని హామీ ఇచ్చారు. దీంతో ఆటో కార్మికుల్లో కారు గుర్తుకు భారీగా క్రేజ్ పెరిగింది. ఆటో డ్రైవ‌ర్ల ఓట్ల‌న్నీ ఏక‌ప‌క్షంగా కారు గుర్తుకు ప‌డ‌తాయ‌ని రాజ‌కీయ విశ్లేష‌కులు సైతం అంగీక‌రిస్తున్నారు. 

కారు మెజార్టీపై పేట‌లో బెట్టింగులు!

కేసీఆర్ స‌భ‌కు హాజ‌రైన జ‌నాన్ని చూసి జగదీష్ రెడ్డి మెజార్టీ 50 వేల‌పైనే అంటూ పేట‌లో బెట్టింగులు మొద‌లైన‌ట్లు చెబుతున్నారు. నిన్న‌, మొన్న‌టి వ‌ర‌కూ 10-20 వేల మ‌ధ్య మెజార్టీ ఉండొచ్చు అనుకుంటున్న జ‌నం..సీఎం స‌భ గ్రాండ్ స‌క్సెస్ కావ‌డం, పేట‌కు అడిగిన‌వ‌న్నీ చేసిపెడ‌తాన‌ని కేసీఆర్ హామీ ఇవ్వ‌డం, గిరిజ‌న బంధు, ఆటో కార్మికుల క‌ష్టాలు తీరుస్తాన‌న‌డంతో ఇప్పుడు మెజార్టీ మార్కు 50 వేలంటూ బెట్టింగు రాయుళ్లు పందేలు కాస్తున్న‌ట్లు చెబుతున్నారు. పేట‌లో కారుకు పోటీనిచ్చే పార్టీ ద‌రిదాపుల్లో లేక‌పోవ‌డంతో మెజార్టీ ఎంతైనా రావొచ్చ‌నే ధీమా పార్టీ నేత‌ల్లోనేకాదు, మేధావుల్లో సైతం వ్య‌క్త‌మ‌వుతోంది.