పెద్దబడి సిద్ధం 

పెద్దబడి సిద్ధం 
  • ఈనెల 20న మంత్రి కేటీఆర్ చేతుల మీదుగా ప్రారంభోత్సవం 
  • 8 కోట్లతో జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల నిర్మాణం
  • బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షులు తోట ఆగయ్య

ముద్ర,ఎల్లారెడ్డిపేట:రాజన్న సిరిసిల్ల జిల్లా ఎల్లారెడ్డిపేట మండల కేంద్రంలో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకున్న మన ఊరు మనబడి లో భాగంగా జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలను మంత్రి కేటీఆర్ మంజూరు చేసిన 8 కోట్లతో కార్పోరేట్ విద్యావ్యవస్థకు దీటుగా సకల సౌకర్యాలతో సర్వాంగ సుందరంగా తీర్చిదిద్ది  ఈనెల 20న మంత్రి కేటీఆర్ చేతుల మీదుగా ప్రారంభోత్సవం జరుగుతుందని శనివారం బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షులు తోట ఆగయ్య విలేఖరుల సమావేశంలో పేర్కొన్నారు. అంగన్ వాడి, ప్రాథమిక పాఠశాలను కలుపుతూ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలను  ఒకే ప్రాంగణంలో నిర్మాణం చేశారని అన్నారు. మా పూర్వ విద్యార్థుల మందరము చదువుకున్న పెద్దబడి రూపురేఖలను మార్చిన ఘనత  మంత్రి కేటీఆర్ దని ప్రశంసించారు.

గత సంవత్సరం గంభీరావుపేట మండల కేంద్రంలో కేజీ టు పీజీ  కళాశాలను 11 కోట్లతో  తెలంగాణ రాష్ట్రంలో మొట్టమొదటిగా కట్టి ప్రారంభించిన ఘనత ముఖ్యమంత్రి కేసీఆర్, మంత్రి కేటీఆర్ లది అని కొనియాడారు. విద్యార్థుల భవిష్యత్తు కోసం నిర్మాణం చేసుకున్న బడిలో పూర్వ విద్యార్థులందరు పాల్గొని ప్రారంభోత్సవం జరుపుకోవాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో మండల ఎంపీపీ పిల్లి రేణుక కిషన్, జెడ్పిటిసి చీటీ లక్ష్మణ్ రావు, మండల సెస్ డైరెక్టర్ వరుస కృష్ణ హరి, సింగిల్ విండో అధ్యక్షులు గుండారపు కృష్ణారెడ్డి, మండల ఎస్సీ సెల్ అధ్యక్షులు ఎడ్ల సందీప్, మండల యూత్ అధ్యక్షులు ఎడ్ల లక్ష్మణ్, చందనం శివరామకృష్ణ, మాద ఉదయ్ పాఠశాల ఉపాధ్యాయులు పాల్గొన్నారు.