సేవాలాల్ బోధనలు నేటి సమాజానికి ఆచరణీయం: దేవాదాయ శాఖ మంత్రి అల్లోల ఇంద్రకరణ్ రెడ్డి

సేవాలాల్ బోధనలు నేటి సమాజానికి ఆచరణీయం:  దేవాదాయ శాఖ మంత్రి అల్లోల ఇంద్రకరణ్ రెడ్డి

ముద్ర ప్రతినిధి, నిర్మల్: బంజారా తెగ కోసం, వారి అభివృద్ధి కోసం ఎనలేని కృషిచేసిన చారిత్రిక పురుషుడు సేవాలాల్ బోధనలు నేటి సమాజానికి ఆచరణీయాలని రాష్ట్ర దేవాదాయ శాఖ మంత్రి అల్లోల ఇంద్రకరణ్ రెడ్డి అన్నారు. శుక్రవారం సంత్ సేవాలాల్ 284 వ జయంతి ఉత్సవాలను పట్టణంలోని దివ్య నగర్ లో అత్యంత ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా జ్యోతి ప్రజలన చేసి  కార్యక్రమాలను ప్రారంభించారు. అనంతరం బంజారాలను ఉద్దేశించి ఆయన మాట్లాడుతూ రాష్ట్ర ముఖ్యమంత్రిగా చంద్రశేఖర రావు అధికారం చేపట్టినప్పటి నుండి అన్ని వర్గాల సంక్షేమానికి కృషి చేస్తున్నారని పేర్కొన్నారు.

ఇందులో భాగంగా ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుండి అధికారికంగా సేవాలాల్ జయంతి వేడుకలను నిర్వహిస్తూ బంజారాల ఆత్మగౌరవానికి పెద్ద పీట వేస్తున్నట్లు వివరించారు. బడుగులు పేదల సంక్షేమం కోసం సేవాలాల్ సూచించిన మార్గం ప్రస్తుత సమాజంలో ఆచరణీయమని అన్నారు. సేవాలాల్ సూచించిన బోధనలతో సమాజాన్ని తీర్చిదిద్దాలని ఆయన కోరారు. ఈ సందర్భంగా ప్రముఖులు ఉత్సాహంగా బంజారా మహిళలతో కలిసి నాట్యం చేశారు. ఈ కార్యక్రమంలో నిర్మల్ జిల్లా కలెక్టర్ వరుణ్ రెడ్డి, ముధోల్ ఎమ్మెల్యే జి విఠల్ రెడ్డి, ఖానాపూర్ ఎమ్మెల్యే రేఖా శ్యాం నాయక్, జెడ్పీ చైర్మన్ విజయలక్ష్మి రామ్ కిషన్ రెడ్డి, అధికారులు వివిధ ప్రాంతాలకు చెందిన నాయకులు బంజారా నాయకులు పాల్గొన్నారు. అంతకుముందు పట్టణ వీధుల గుండా ఊరేగింపు నిర్వహించారు.