గ్రూప్‌-1 ప్రిలిమ్స్‌ రద్దుపై  హైకోర్టు డివిజన్‌ బెంచ్‌కు టీఎస్పీఎస్సీ 

గ్రూప్‌-1 ప్రిలిమ్స్‌ రద్దుపై  హైకోర్టు డివిజన్‌ బెంచ్‌కు టీఎస్పీఎస్సీ 

రేపు విచారించనున్న న్యాయస్థానం

ముద్ర, తెలంగాణ బ్యూరో : తెలంగాణలో గ్రూప్-–1 ప్రిలిమ్స్ పరీక్షను రద్దు చేస్తూ హైకోర్టు తీర్పును వెలువరించిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో రెండోసారి కూడా పరీక్షను రద్దు కావడంతో తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ హైకోర్టుకు అప్పీలుకు వెళ్లింది. అత్యవసర విచారణకు లంచ్ మోషన్ అనుమతి కోరింది. అయితే ఈ అప్పీల్‌పై స్పందించిన హైకోర్టు డివిజన్ బెంచ్.. మంగళవారం విచారణ జరిపేందుకు అంగీకరించింది. కాగా, ఈ నెల 23న సింగిల్‌ బెంచ్‌ జడ్జి ఇచ్చిన తీర్పుపై అప్పీలుకు వెళ్లింది.  ప్రిలిమినరీ పరీక్ష నిర్వహించిన తీరు, పరీక్ష నిర్వహణకు చేపట్టిన జాగ్రత్తలు తదితర అంశాలతో టీఎస్పీఎస్సీ అప్పీల్‌కు వెళ్లింది. అందులో ప్రధానంగా 3 అంశాలను ప్రస్తావించినట్లు తెలిసింది. గతేడాది అక్టోబర్‌ 16న తొలిసారి గ్రూప్‌-–1 ప్రిలిమ్స్‌ పరీక్షలో బయోమెట్రిక్‌ విధానాన్ని అమలు చేసిన టీఎస్పీఎస్సీ ఈ యేడాది జూన్‌ 11న నిర్వహించిన పరీక్షలో  ఎందుకు అమలు చేయలేదన్న విషయంపై డివిజన్‌ బెంచ్‌కు స్పష్టత ఇవ్వనున్నది. ప్రిలిమ్స్‌కు హాజరైన 2,33,506 మంది అభ్యర్థుల్లో కేవలం ముగ్గురి కోసం పరీక్షను మళ్లీ వాయిదా వేస్తే మిగిలిన 2,33,503 మంది ఇబ్బంది పడతారని, వారిపై ఆర్థిక భారం పడడంతోపాటు విలువైన సమయం వృథా అవుతుందనే విషయాన్ని ప్రధానంగా ప్రసావించనున్నట్లు సమాచారం. గ్రూప్‌-–1 ఉద్యోగానికి ప్రిలిమినరీ పరీక్షే ప్రధానం కాదని, మెయిన్స్‌ పరీక్ష కూడా ఉన్నదనే విషయాన్ని బలంగా వినిపించాలని కమిషన్‌ భావిస్తున్నట్టు సమాచారం.
యూపీఎస్సీలోనూ బయోమెట్రిక్‌ లేదు

ఉద్యోగ నియామక పరీక్షకు తొలిసారి టీఎస్పీఎస్సీయే ప్రయోగాత్మకంగా బయోమెట్రిక్‌ విధానాన్ని ప్రవేశపెట్టింది. సివిల్‌ సర్వీస్‌ నియామకాల కోసం యూనియన్‌ పబ్లిక్‌ సర్వీస్‌ కమిషన్‌ (యూపీఎస్సీ) నిర్వహించే పరీక్షల్లోనూ ఈ విధానం లేదు. గతేడాది అక్టోబర్‌ 16న గ్రూప్‌-–1 ప్రిలిమ్స్‌ సమయంలో బయోమెట్రిక్‌ హాజరు తీసుకునేటప్పుడు కొన్ని ఇబ్బందులు తలెత్తాయి. అభ్యర్థుల్లో చాలామంది ఒకేసారి పరీక్షా కేంద్రాలకు రావడం, సమయం సరిపోకపోవడం తదితర అంశాలు ఇందుకు కారణం. వీటిని పరిగణనలోకి తీసుకున్న టీఎస్పీఎస్సీ రెండోసారి ప్రిలిమినరీ పరీక్ష నిర్వహించినప్పుడు అభ్యర్థుల సౌలభ్యం కోసమే బయోమెట్రిక్‌ విధానాన్ని తొలగించింది. ఈ విషయాన్ని అభ్యర్థులందరికీ ముందుగానే తెలియజేయడంతోపాటు ప్రతి పరీక్షా కేంద్రంలో పకడ్బందీగా మూడంచెల తనిఖీలు చేపట్టింది. పరీక్ష జరిగిన రోజు ప్రాథమిక సమాచారం మేరకే అభ్యర్థుల సంఖ్యను తెలిపిన టీఎస్పీఎస్సీ ఓఎంఆర్‌ పత్రాల స్కానింగ్‌ తర్వాత మొత్తం అభ్యర్థుల సంఖ్యను ప్రకటించింది. ఈ అంశాలను కూలంకషంగా హైకోర్టు డివిజన్‌ బెంచ్‌కు వివరించాలని కమిషన్‌ భావిస్తున్నట్లు సమాచారం.