ఎన్నికల కోడ్ రావడంతో గ్రామాలు, మండల,పట్టణ కేంద్రాల నుంచి జిల్లా కేంద్రానికి మారిన ప్రజల ఆందోళన

ఎన్నికల కోడ్ రావడంతో గ్రామాలు, మండల,పట్టణ కేంద్రాల నుంచి జిల్లా కేంద్రానికి మారిన ప్రజల ఆందోళన
  • నిరసనలు-ధర్నాలు- ఆందోళనతో అట్టుడుకుతున్న సూర్యాపేట కలెక్టరేట్
  • దళితబంధు, గృహలక్ష్మి అందలేదని, అసర్సులకు,ఇచ్చారని, అక్రమాలు నవరించాలని
  • మధ్యాన్న బోజనకార్మికులకు జీతాలు పెంచాలని, గొర్రెల పంపిణీ చేయాలని

ముద్రప్రతినిధి, సూర్యాపేట:-ఇన్నాళ్ళుగా ఆయా గ్రామాలు, మండల, పట్టణ కేంద్రాలకు పరిమితమైన ఆందోళనలు, రాస్తారోకోలు, నిరసన కార్యక్రమాలు ఇప్పుడు సూర్యాపేట జిల్లా కేంద్రంలోని నూతన కలెక్టరేటకు చేరుకున్నాయి. గతంలో ఎన్నికల కోడ్ రానిసమయంలో ఆయా శాఖల అధికారులకు విన్నవించడానికి, లేదంటే సంబంధిత మంత్రి, శాసనసభ్యులకు చెప్పుకోవడానికి గ్రామాలనుంచి అవసరమయితే నియోజకవర్గానికి వెళ్ళి సమస్యలను సంబంధిత రాజకీయ నాయకులకు విన్నవించేవారు. అందుకు అనుగుణంగా పరిష్కారం పొందేవారు.
అయితే నేడు ఆ పరిస్థితి మారింది. ఎన్నికల పుణ్యమా అని మోడల్ కోడ్ ఆఫ్ కాండక్ట్ అమలు చేయడంతో గ్రామాలు, మండల, పట్టణ, నియోజకవర్గ కేంద్రాల్లో జరగాల్సిన నిరసనలు, ఆందోళనలు, ధర్నాలు, రాస్తారోకోలు సూర్యాపేట జిల్లా కేంద్రానికి సీన్ మారింది. గత కొన్ని రోజులుగా ఎవరు ఏ ప్రాంతం నుంచి వచ్చినా మొదట సూర్యాపేట జిల్లా కేంద్రంలోని నూతన కలెక్టరేట్ ఎదుట తమ తమ ఆందోళనలు చేపడుతున్నారు. ఆయా ప్రాంతాల్లోని ఎంఎల్వేలు కొత్తగా ఏ శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేయకుండా ఎన్నికల కోడ్ అడ్డు రావడంతో
ఇగ జిల్లా పాలనాధికారి కలెక్టరే తమ సమస్యలను పరిష్కారం చేస్తాడనే దిశగా ప్రజలు ఆలోచించి తమ డిమాండ్ల సాధన కోసం సూర్యాపేట జిల్లా కేంద్రానికి క్యూ కట్టారని చెప్పవచ్చు. ఇటీవల హుజుర్ నగర్ నియోజకవర్గం గరిడేపల్లి.

మండలం పొనుగోడు గ్రామానికి చెందిన గ్రామస్థులు తమ గ్రామంలో గృహలక్ష్మి లబ్దిదారుల ఎంపికలో జరిగిన అక్రమాలను అరికట్టి అర్హులకు అందేలా చర్యలు తీసుకోవాలని ధర్నా చేశారు. అలాగే గరిడేపల్లి మండలం తాళ్ళమల్కాపురం గ్రామస్థులు దళితబంధులో జరిగిన అక్రమాలను అరికట్టాలని కలెక్టర్ కార్యాలయం ఎదుట నిరసన చేయడంతో కలెక్టర్ జోక్యం చేసుకుని వెంటనే చర్యలు తీసుకుంటానని హామి ఇచ్చారు. అలాగే సూర్యాపేట రూరల్ మండలం బాలెంల గ్రామానికి చెందిన వారు తమ గ్రామంలో సర్పంచ్, గ్రామకార్యదర్శి చేతివాటం ప్రదర్శించి అనర్హులకు, అదీ కొందరికే దళితబంధు ఇచ్చారని, తమకు కూడా ఇవ్వాలని నినాదాలిస్తూ ఆందోళన చేశారు. బుధవారం. ఆత్మకూర్(ఎస్) మండలంలోని నెమ్మికల్లు గ్రామస్థులు దళితబంధులో అక్రమాలు జరిగాయని,అనర్హులకు ఇచ్చారని ఆరోపిస్తూ సర్పంచ్, గ్రామకార్యదర్శి, పంచాయితీ సెక్రటరీలను అడ్డుకున్నారు. అదేవిధంగా మోతె మండలం రావిపహాడ్ గ్రామస్తులు డబుల్ బెడ్రూం ఎంపికలో అవకతవకలు జరిగాయని ఆందోళన చేశారు.

రెండవ విడత గొర్రెల పంపిణీ చేపట్టాలని సిపిఎం అనుబంధ సంస్థ గొర్రెలు,మేకల పెంపకందారుల సంఘం ఆధ్వర్యంలో నిరసన చేపట్టారు. అలాగే సిఐటియు ఆధ్వర్యంలో గ్రామపంచాయితీ కార్మికులకు అండగా కొన్ని రోజులపాటు టెంట్ వేసుకుని ధర్నా చేయడంతో అధికార పార్టీ తప్పించి అన్ని పార్టీలు సంఘాలు వారు వచ్చి సంఘీబావం తెలిపారు. సెకండ్ ఏ ఎన్ ఎం, ఆశా వర్కర్ల ఆందోళనకు కూడా ప్రతిపక్షపార్టీలు, ప్రజాసంఘాలు కూడా మద్దతు తెలిపాయి. సిఐటియు ఆధ్వర్యంలో మధ్యాన్న బోజనకార్మికులకు వేతనాలు పెంచాలని ఆందోళన, నిరసన,
ధర్నాలు చేపట్టారు. ఇలా రోజుకు ఒక విధమైన బాధితులతో, సమస్యలతో ఆయా ప్రాంతాల నుంచి వచ్చి సూర్యాపేట కలెక్టరేట్ ఎదుట ఆందోళనలు రోజురోజుకు ఉధృతం అవుతున్నాయి. జిల్లా కలెక్టర్ మాత్రమే ఈ విషయంలో తక్షణ చర్యలు తీసుకుంటారని ప్రజలు విశ్వసించి కలెక్టరేట్ వద్దకు ఆందోళన బాట పట్టారు.