ముత్తిరెడ్డిపై ముప్పేట దాడి

ముత్తిరెడ్డిపై ముప్పేట దాడి
  • అటు ‘పోచంపల్లి’.. ఇటు ‘శ్రీరాములు’
  • మరో వైపు కూతురు తుల్జాభవానీరెడ్డి
  • ఒకరు సోషల్‌ మీడియాలో పోస్టులు
  • మరొకరు స్థానిక నేతగా బహిరంగ పోస్టర్లు
  • ఇంకొకరు కేసులు పెడుతూ బహిరంగంగా నిలదీత
  • అయోమయంలో జనగామ ఎమ్మెల్యే

ముద్ర ప్రతినిధి, జనగామ : ఎన్నికల సమయం దగ్గర పడుతున్న కొద్దీ జనగామ ఎమ్మెల్యే ముత్తిరెడ్డి యాదగిరిరెడ్డిపై ఉచ్చు బిగుస్తోందా..? సొంత పార్టీలోనే వ్యతిరేకులు పెరుగుతున్నారా..! అంటే అవుననే సమాధానం వినిపిస్తోంది. ఎమ్మెల్యేకు వ్యతిరేకంగా బహిరంగంగా ఎవరూ మాట్లాడకున్నా వారి చేతలు చూస్తే మాత్రం ఆయనకు సీటుకు ఎసరు పెడుతున్నట్టే అనిపిస్తోంది. మరోవైపు ముత్తిరెడ్డి కూతురు తుల్జాభవానీరెడ్డి పెట్టిన కేసులతో ఎమ్మెల్యే ఉక్కిరి బిక్కిరి అవుతున్నట్టు తెలుస్తోంది. ఆ అసహనంతోనే ఇటీవల జరిగిన బీఆర్‌‌ఎస్‌ ఆత్మీయ సమ్మేళనాల్లో ఎమ్మెల్యే కొండెంగలు, చీడ పురుగులు, బుడ్డర్‌‌ ఖాన్‌ గాళ్లు.. అంటూ విరుచుకుపడ్డారు. 

సొంత పార్టీ లీడర్లతోనే ఎసరు..!

జనగామ ఎమ్మెల్యే ముత్తిరెడ్డి యాదగిరిరెడ్డిపై సొంత పార్టీ లీడర్లే వ్యూహాలు రచిస్తున్నట్టు తెలుస్తోంది. ఇప్పటికే ఓ పక్క ఎమ్మెల్సీ పోచంపల్లి శ్రీనివాస్‌రెడ్డి జనగామ టికెట్‌ కోసం వ్యూహాత్మకంగా అడుగులు వేస్తున్నట్టు సమాచారం. మంత్రి కేటీఆర్‌‌ సన్నిహితుడిగా పేరున్న ఈయనకే దాదాపు జనగామ టికెట్‌ కన్​ఫర్మ్​అంటూ ఆయన అనుచరవర్గం సోషల్‌ మీడియాలో ప్రచారం చేస్తోంది. అయితే ఈ ప్రచారాలపై గతంలో ప్రెస్‌ మీట్‌ పెట్టి ఖండించిన పోచంపల్లి.. ప్రస్తుతం సైలెంట్‌గా ఉండడం చర్చకు దారి తీస్తోంది. అయితే పోచంపల్లి ఎమ్మెల్సీగా గెలిచి రెండేళ్లు కావొస్తోంది. ఇంకా నాలుగేళ్ల పదవీ కాలం ఉన్న పోచంపల్లికి బీఆర్ఎస్​అధిష్ఠానం టికెట్‌ ఇస్తుందా..! అనేది కూడా ఆలోచించాల్సిన విషయయే. మరోవైపు తాజాగా సీనియర్‌‌ నేత, ఆప్కో మాజీ చైర్మన్‌ మండల శ్రీరాములు మరోవైపు నుంచి స్థానిక నేతను అంటూ ప్రచారంలో దిగడం పార్టీలో కొత్త చర్చకు దారి తీస్తోంది. జనగామ నియోజవర్గంలోని చేర్యాల, మద్దూరు, కొమురవెల్లి, దూళ్మిట్ట, జనగామ ప్రాంతాల్లో వాల్‌ పోస్టర్లు వేయడం ఎమ్మెల్యే వర్గీయుల్లో ఆందోళన రేపుతోంది. ఇప్పటికే పోచంపల్లితో చిక్కుల్లో ఉన్న తమ నేతకు ఇంకో సెగ ఏంటని తలలు పట్టుకుంటున్నారు. బీసీ నేతగా పేరున్న శ్రీరాములు టీడీపీ నుంచి ఓసారి ఎమ్మెల్యేగా పోటీ చేసి ఓడిపోయారు. తెలంగాణ ఆవిర్భావం తర్వాత బీఆర్‌‌ఎస్‌లోకి వచ్చిన ఈయన పార్టీలో క్రీయాశీలకంగా పనిచేస్తున్నారు. అయితే చేరిక సమయంలో మండలకు ఎమ్మెల్సీ ఇస్తామని కేసీఆర్‌‌ హామీ ఇచ్చినట్టుగా కూడా ప్రచారం ఉంది. అయితే ఇప్పటివరకు పార్టీలో ఎలాంటి కీలక పదవులుగానీ, నామినేటెడ్‌ పోస్టులు కానీ మండలకు ఇవ్వలేదు. స్థానిక నేతగా సుదీర్ఘ అనుభవం ఉన్న ఈయన ఈసారి బీసీ కోటాలో జనగామ టికెట్‌ ఆశిస్తున్నట్టు తెలుస్తోంది.

కూతురుతో పెరుతున్న తలనొప్పి..!

ఎమ్మెల్యే ముత్తిరెడ్డి కూతురు తుల్జాభవానీరెడ్డితో ఆయనకు తలనొప్పులు ఎక్కువవువుతున్నాయి. ఇప్పటికే తన సంతకాన్నీ ఫోర్జరీ చేసి భూమి రిజిస్ట్రేషన్‌ చేశారని ఉప్పల్‌ పీఎస్‌ కేసు పెట్టిన విషయం తెలిసిందే. తాజాగా విషయంపై ఆమె ఎమ్మెల్యే ముత్తిరెడ్డి యాదగిరిరెడ్డిని నిలదీసింది. సోమవారం హరిత దినోత్సవంలో భాగంగా జనగామ ఇరిగేషన్ ఆఫీస్‌ ప్రాంగణంలో ఎమ్మెల్యే మొక్కలు నాటారు. ఆయన బయలుదేరే సమయంలో కూతురు తుల్జాభవానీరెడ్డి, అల్లుడు రాహుల్‌రెడ్డి అక్కడికు చేరుకుని అడ్డుకున్నారు. సిద్దిపేట జిల్లా జనగామ నియోజకవర్గం చేర్యాలలో ఆమె పేరిట కొనుగోలు చేసిన స్థల వివాదంపై ఎమ్మెల్యేను అధికారులు, ప్రజాప్రతినిధుల సమక్షంలో నిలదీయడం స్థానికంగా చర్చనీయాంశంగా మారింది. చేర్యాల ప్రాపర్టీ తనకు తెలియకుండా తన పేరిట చేయడంతో అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నానని ఆమె పేర్కొన్నారు. రిజిస్ట్రేషన్ సమయంలో తాను సంతకం కూడా చేయలేదని, ఎవరు చేశారో చెప్పాలంటూ తుల్జాభవానీరెడ్డి మీడియా ముందు ఎమ్మెల్యేను నిలదీశారు. చేర్యాల ప్రాపర్టీ విషయంలో ఒక రోజు మొత్తం నన్ను బెదిరించి ప్రాపర్టీ నాపైకి వచ్చేలా చేశారని ఎమ్మెల్యే ఎదుట ఆమె ఆరోపించారు. కాగా తండ్రీ కూతుళ్ల వాదనలకు సంబంధించిన వీడియోలు సోషల్‌ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి.

  • నేనేంటో కేసీఆర్ కు తెలుసు
  • ఎమ్మెల్యే ముత్తిరెడ్డి యాదగిరిరెడ్డి

నేను నిత్యం ప్రజాక్షేతం ఉండే నేతను. నేనేంటో మా అధినేత కేసీఆర్‌‌కు తెలుసు. కొందరు చేతగాని దద్దమ్మలు నా బిడ్డను అడ్డం పెట్టుకుని రాజకీయం చేస్తున్నరు. నాపై కావాలనే నా బిడ్డ, అల్లుడిని ఉసిగొల్పుతున్నారు. వాళ్లకు ఏం మాట్లాడాలో కూడా తెలియడం లేదు. మా నాన్న నాకు తెలియకుండా భూమి కొనిచ్చాడు అంటోంది. సంతకం ఫోర్జరీ చేసిన అంటుంది. ఆస్తి కొనివ్వడం ఫోర్జరీ అవుతుందా..! నాకు టికెట్‌ ఇవ్వకుండా ఎవరు ఎన్ని కుట్రలు చేసినా ఫలితం లేదు. నేను ఎలాంటి వాడిని అనేది కేసీఆర్‌‌కు తెలుసు.