హోల్డింగుల్లో కనిపించని ఎమ్మెల్యే పద్మ ఫోటో

హోల్డింగుల్లో కనిపించని ఎమ్మెల్యే పద్మ ఫోటో

చర్చనీయాంశమైన మైనంపల్లి రోహిత్ ఎంట్రీ కటౌట్లు
 ముద్ర ప్రతినిధి, మెదక్:  మల్కాజిగిరి ఎమ్మెల్యే మైనంపల్లి హనుమంతరావు తనయుడు మైనంపల్లి సోషల్ సర్వీస్ ఆర్గనైజేషన్ అధ్యక్షులు మెదక్ ఎంట్రీ సందర్భంగా పట్టణంలో ఏర్పాటు చేసిన భారీ కటౌట్ లలో మెదక్ జిల్లా బిఆర్ఎస్ పార్టీ అధ్యక్షురాలు, స్థానిక ఎమ్మెల్యే పద్మాదేవేందర్ రెడ్డి ఫోటో లేకపోవడం చర్చనీయాంశంగా మారింది. రాబోయే ఎన్నికల్లో మెదక్ నుండి మైనంపల్లి రోహిత్ పోటీ చేసేందుకు సోషల్ సర్వీస్ ఆర్గనైజేషన్ ద్వారా పలు సేవా కార్యక్రమాలతో ఎంట్రీ అవుతున్నాడు.

ఇందులో భాగంగా శుక్రవారం మెదక్ పట్టణంలో రంజాన్ మాసం పురస్కరించుకొని 1000 మంది నిరుపేదలకు ఒక్కొక్కరికి 2500 రూపాయలు విలువజేసే కిట్లు అందజేసే కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. అందులో భాగంగా పిల్లి కొట్టాల నుండి రాందాస్ చౌరస్తా వరకు భారీ వాహన ర్యాలీ నిర్వహించారు. భారీ స్థాయిలో ఉండాలన్న ఉద్దేశంతో మెదక్ పట్టణ ప్రధాన రహదారులు గులాబీ మయంగా మార్చారు. గులాబీ తోరణాలు, వందకుపైగా భారీ హోల్డింగ్లు, కటౌట్లు ఏర్పాటు చేశారు.  ఈ హోర్డింగ్లలో సీఎం, బిఆర్ఎస్ అధినేత కెసిఆర్, వర్కింగ్ ప్రెసిడెంట్ కెటిఆర్, జిల్లా మంత్రి హరీష్ రావు, స్థానిక పార్లమెంట్ సభ్యులు కొత్త ప్రభాకర్ రెడ్డి, మెదక్ నియోజకవర్గానికి చెందిన ఎమ్మెల్సీ శేరి సుభాష్ రెడ్డి ఫోటోలు కనిపించాయి. కానీ మెదక్ జిల్లా బీఆర్ఎస్ అధ్యక్షురాలు, స్థానిక ఎమ్మెల్యే పద్మాదేవేందర్ రెడ్డి ఫోటో ఎక్కడా లేకపోవడంతో చర్చించుకోవడం కనిపించింది.