"ముద్ర" ఎఫెక్ట్..

"ముద్ర" ఎఫెక్ట్..
  • మట్టి కొట్టుకుపోతున్నారు కథనానికి స్పందన
  • గంటల వ్యవధిలోనే కదిలిన రెవిన్యూ యంత్రాంగం
  • పనుల నిలుపుదల.. చర్యలు తీసుకుంటామన్న అధికారులు
  • మట్టి త్రవ్వకాలు జరుపితే ఉపేక్షించేది లేదు..
  • విజయ భారతి, జిల్లా మైనింగ్ ఆర్ఐ

ఇబ్రహీంపట్నం, ముద్ర: విలువైన మట్టి కొట్టుకుపోతున్నారు.. అన్న శీర్షికన "ముద్ర ఆన్లైన్ ఎడిషన్"  లో ప్రచురితమైన కథనానికి రెవెన్యూ అధికారులు స్పందించారు. కథనం ప్రచురితమైన గంటల వ్యవధిలోనే రెవెన్యూ అధికారులు తమ సిబ్బందిని మట్టి త్రవ్వకాలు జరుగుతున్న ప్రదేశానికి పంపించారు. తుర్కయంజాల్ మున్సిపాలిటి తొర్రూర్ రెవిన్యూ పరిధి సర్వే నంబర్  383/1, ప్రభుత్వ భూమిలో మట్టి అక్రమ తవ్వకాలు జరుగుతున్నాయి. ఈ మట్టిని టిప్పర్ లలో ఖాళీ స్థలాలు, లేఅవుట్లకు తరలిస్తూ ఒక్కొక్క టిప్పర్ కి రూ. 5 నుండి 10 వేల వరకు వసూలు చేస్తున్నారు. భారీగా మట్టి వ్యాపారం చేస్తూ సొమ్ము చేసుకుంటున్నారు. దీంతో కోట్లాది రూపాయలు ప్రభుత్వ ఆదాయానికి గండి పడుతోందని ముద్ర కథనాన్ని ప్రచురించింది. దీనికి స్పందించిన స్థానిక రెవిన్యూ అధికారులు ముందుగానే పనులు నిలిపివేయాలని వ్యాపారులకు సమాచారం ఇచ్చారు. రంగారెడ్డి జిల్లా మైనింగ్ ఆర్ఐ విజయ భారతి హుటహుటీన మట్టి త్రవ్వకాలు జరుగుతున్న ప్రదేశానికి చేరుకుని పరిశీలించారు. 

మట్టి త్రవ్వకాలు జరుపితే ఉపేక్షించేది లేదు..
విజయ భారతి, జిల్లా మైనింగ్ ఆర్ఐ
అనుమతులు లేకుండా మట్టి తవ్వకాలు జరిపితే ఉపేక్షించేది లేదని రంగారెడ్డి జిల్లా మైనింగ్ ఆర్ఐ విజయభారతి హెచ్చరించారు. ప్రస్తుతం మట్టి త్రవ్వకాలకు ఎక్కడా మైనింగ్ శాఖ నుండి అనుమతులు ఇవ్వడం లేదని స్పష్టం చేశారు. తాము వెళ్ళే సరికే పనులు నిలిపి వేశారని, మట్టి త్రవ్విన ప్రదేశాన్ని పరిశీలించి కొలతలు తీసుకున్నట్లు "ముద్ర "కి తెలిపారు. పూర్తి స్థాయిలో వివరాలు సేకరించి బాధ్యులపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని వివరించారు.