పది రోజులుగా కురుస్తున్న వర్షాలకు పొంగిపొర్లుతున్న వాగులు అలుగులు పోస్తున్న చెరువులు

పది రోజులుగా కురుస్తున్న వర్షాలకు పొంగిపొర్లుతున్న వాగులు అలుగులు పోస్తున్న చెరువులు
  • పలు గ్రామాల మధ్య వాగులు పొంగడంతో స్తంభించిన రవాణా
  • పది రోజులుగా కురుస్తున్న వర్షంతో జీవాలకు నష్టం కలుగుతుందంటున్న గొర్రెల కాపరులు

తుంగతుర్తి ముద్ర: తుంగతుర్తి నియోజకవర్గంలో గత పది రోజులుగా ఎడతెరిపి లేకుండా కురుస్తున్న భారీ వర్షాలకు పలు గ్రామాల్లోని చెరువులు కుంటలు అలుగులు పోస్తున్నాయి. పలు గ్రామాలకు వెళ్లే రహదారులు వాగులు పొంగి ఒక గ్రామం నుండి ఇంకో గ్రామానికి వెళ్లకుండా కావడంతో రైతులు ప్రజలు నానా ఇబ్బందులు పడుతున్నారు .ముఖ్యంగా రైతాంగం తమ వ్యవసాయ బావుల వద్దకు కనీసం పశువులకు మేత వేయడానికి కూడా వీలు కాకుండా వాగులు పొంగుతున్నాయని అంటున్నారు .తుంగతుర్తి మండలం సంగం గ్రామం  నుండి అరవపల్లి మండలం కోడూరు వెళ్లే రహదారి మధ్యలో ఉన్న వాగు పొంగిపొరుతుంది. అలాగే వెలుగు పెళ్లి నుండి కేశవాపురం వెళ్లే వాగు సైతం పొంగిపొరడంతో రాకపోకలు బంద్  అయ్యాయి. పది రోజుల క్రితం వరకు నియోజకవర్గంలోని చెరువులలో కుంటలలో సగం వరకు సాగునీరు ఉండగా వర్షాలకు చెరువుల నుండి అలుగులు పోయడం రైతులకు ఆనందాన్ని ఇచ్చే విషయంగా చెప్పవచ్చు.  ఇప్పటికే చెరువుల కింద వరి నారు పోసుకున్న రైతులు చెరువులు నిండడంతో కొంచెం  వరి నాట్లు వెనకకైనా పొలాలు సాగవుతాయని సంతోషం వ్యక్తం చేస్తున్నారు. పది రోజులుగా కురుస్తున్న వర్షం పత్తి చేలకు కొంత నష్టం కలిగేదిగా ఉన్న వరిచేలకు మాత్రం లాభం అవుతుందని రైతులు అంటున్నారు .వర్షాలు ఇలాగే కురిస్తే చిరు వ్యాపారులు సామాన్య ప్రజానీకం ఇబ్బంది పడవచ్చని అంటున్నారు .

ముఖ్యంగా గ్రామాల్లో గొర్రెల కాపరులకు ఈ వర్షం కడు ఇబ్బందికరంగా మారిందని కనీసం తమ జీవాలు మేత మేయడానికి  కూడా సమయం లేకుండా పోతుందని నిరంతరం వర్షం కురుస్తూనే ఉందని దీనివల్ల జీవాలకు తీవ్ర నష్టం కలుగుతుందని గొర్రెల కాపరులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు . ఏది ఏమైనా కురుస్తున్న వర్షాలు కొంతమేర లాభం కొంతమేర నష్టాన్ని కలిగించేవిగా ఉన్నాయని పలువురు అభిప్రాయపడుతున్నారుకురుస్తున్న వర్షాలు ఒకటి రెండు రోజులతో ఆగిపోతాయా లేక ఇంకా ఇలాగే కొనసాగుతాయ వేచి చూడాల్సిందే.