వెనక్కు తగ్గిన వేగనార్​

వెనక్కు తగ్గిన వేగనార్​
  • మధ్యవర్తిత్వం వహించిన బెలారస్​ అధ్యక్షుడు లుకాషెంకో
  • వెనక్కు తగ్గిన ప్రిగోజిన్​, పుతిన్​
  • రష్యన్​ ప్రజల హర్షం

మాస్కో: రష్యాపై తిరుగుబాటు బావుటా ఎగురవేసి మాస్కో దిశగా తన ప్రైవేటు సైన్యంతో చుట్టుముట్టేందుకు నిర్ణయించిన ప్రిగోజిన్​ తన నిర్ణయాన్ని వెనక్కు తీసుకొని తన సైన్యాన్ని ఉక్రెయిన్​బోర్డర్​లోని బంకర్​లకు తరలించారు. ఈ నిర్ణయంతో ఇటు రష్యన్​లు, ప్రపంచదేశాలు ఉపిరిపీల్చుకున్నాయి. మరోవైపు పుతిన్​ వార్నింగ్​కు భయపడి ప్రిగోజిన్​ తన నిర్ణయాన్ని ఉపసంహరించుకున్నట్లు కూడా చెబుతున్నారు. కాగా  ప్రిగోజిన్, పుతిన్​మధ్య సయోధ్యకు బెలారస్ అధ్యక్షుడు అలెగ్జాండర్ లుకాషెంకో మధ్యవర్తిత్వం వహించడం వల్లే వేగనార్​ సైన్యం వెనక్కి తగ్గినట్లు ఆ దేశ మీడియా ప్రకటించింది. ఏది ఏమైనా ప్రిగోజిన్​ నిర్ణయాన్ని రష్యన్​లు కూడా స్వాగతించారు. ఈ సందర్భంగా వేగనార్​ సైన్యం తమ భారీ యుద్ధట్యాంకులు, కాన్వాయ్​తో వెళుతుండగా చప్పట్లతో హర్షం వ్యక్తం చేశారు. ఈ విషయంపై వేగనార్​ సైన్యం అధ్యక్షుడు ప్రిగోజిన్​ మీడియాతో మాట్లాడుతూ.. వేగనార్​కు రష్యన్​ల రక్తం చిందించడం ఇష్టం లేదన్నారు. తాము నిజమైన దేశభక్తులమైనందునే తమ నిర్ణయాన్ని ఉపసంహరించుకున్నామన్నారు. పుతిన్​ తమను దేశద్రోహులని పెద్ద తప్పుచేశాడన్నారు. దీనికి మూల్యం పుతిన్​ చెల్లించుకుంటారని హెచ్చరించారు. ప్రజాక్షేత్రంలో శాంతిస్థాపనే తమ ఉద్దేశ్యంగా ప్రిగోజిన్​ ప్రకటించారు. అందువల్లే వెనక్కు తగ్గామన్నారు. 

ఈ తిరుగుబాటు బావుటాపై వెనక్కు తగ్గడంతో ఇటు పుతిన్​కూడా చల్లబడ్డారు. శనివారం వేగనార్​ సైన్యానికి ధీటుగా జవాబివ్వాలన్న, ప్రిగోజిన్​ను అరెస్టు చేయాలన్న నిర్ణయాన్ని ఉపసంహరించుకున్నట్లు స్థానిక మీడియా వెల్లడించింది. ఈ నేపథ్యంలో ఇరువురి మధ్య సఖ్యత కుదిర్చిన బెలారస్​ అధ్యక్షుడేనని మీడియా స్పష్టం చేసింది. ఆయన మధ్యవర్తిత్వంపై ఇటు రష్యన్​లు, అటు వేగనార్​ సైన్యం కూడా హర్షం వ్యక్తం చేస్తున్నాయి. మరోవైపు రష్యా చర్యలపై ఉక్రెయిన్​ అధ్యక్షుడు జెలెన్​స్కీ ఆగ్రహం వ్యక్తం చేశాడు. తాను తవ్వుగోతిలో తనే పడ్డాడని వ్యాఖ్యానించాడు. శాంతికాముక దేశంగా ఉన్న ఉక్రెయిన్​లో ప్రైవేటు సైన్యాన్ని మోపే ఆరోపణ నిజమేనని ఈ ఘటనతో ప్రపంచదేశాలకు తెలిసివచ్చిందన్నారు. వేగనార్​ తిరుగుబాటు బావుటాతో రష్యా సైనిక బలం తగ్గిందని అన్నారు. ఇతరులను నాశనం చేద్దామనుకున్న పుతిన్​కు తగిన శాస్తే జరిగిందని శాపనార్థాలు పెట్టాడు జెలెన్​స్కీ.