ఉపాధి హామీ కూలీల సమస్యలు పరిష్కరించాలి

ఉపాధి హామీ కూలీల సమస్యలు పరిష్కరించాలి
  • ఉపాధి హామీ పథకంలో కొలతలతో సంబంధం లేకుండా చట్ట ప్రకారం 272 రూపాయలు చెల్లించాలి
  • ఉపాధి పని దినాలు ప్రతి మనిషికి 200 రోజులకు పెంచి,రోజు కూలీ 600 ఇవ్వాలి
  • గ్రామీణ ఉపాధి హామీ చట్టం పరిరక్షణ కమిటీ డిమాండ్

ముద్ర ప్రతినిది, భువనగిరి: కొలతలతో సంబంధం లేకుండా ఉపాధి పథకంలో పనిచేస్తున్న కూలీలకు చట్ట ప్రకారము 272 రూపాయలు చెల్లించి, ఉపాధి పని దినాలు ప్రతి మనిషికి 200 రోజులకు పెంచి, రోజు కనీస కూలీ 600 రూపాయలు ఇచ్చి ఉపాధి హామీ కార్మికుల సమస్యలను పరిష్కరించాలని తెలంగాణ వ్యవసాయ కార్మిక సంఘం రాష్ట్ర కార్యదర్శి కొండమడుగు నర్సింహ, పీపుల్స్ మానిటరింగ్ రాష్ట్ర కన్వీనర్ సుర్పంగ శివలింగం, బి.కే.ఎం.యు జిల్లా అధ్యక్షులు ఉప్పల ముత్యాలు ప్రభుత్వాన్ని డిమాండ్ చేసినారు. గ్రామీణ ఉపాధి హామీ చట్ట పరిరక్షణ (AiAWU, PMC, BKMU,DBSU ) జిల్లా కమిటీ ఆధ్వర్యంలో ఉపాధి హామీ కార్మికుల సమస్యలు పరిష్కరించాలని జిల్లా కలెక్టర్ కార్యాలయం ముందు ధర్నా నిర్వహించడం జరిగింది.ఈ సందర్భంగా నర్సింహ, శివలింగం, ముత్యాలు పాల్గొని మాట్లాడుతూ 2005లో అనేక ప్రజా సంఘాలు వామపక్ష పార్టీల పోరాటల ఫలితంగా వచ్చిన గ్రామీణ ఉపాధి హామీ చట్టాన్ని కేంద్రంలో బిజెపి ప్రభుత్వం 2014 లో అధికారంలోకి నుండి చట్టాన్ని ఎత్తివేయాలని, నిర్వీర్యం చేయాలని కుట్ర చేస్తూ ఏటేటా కేంద్ర బడ్జెట్లో నిధులు తగ్గిస్తూ, పనిలో కఠిన నిబంధనలు పెట్టి పేదలకు, వ్యవసాయ కూలీలకు ఉపాధి లేకుండా చేస్తుందని విమర్శించారు.

గ్రామీణ పేదలకు వ్యవసాయ కూలీలకు వ్యవసాయ పనుల తర్వాత జీవనోపాధి కోసం ఆర్థిక వెసులుబాటు కోసం కుటుంబ పోషణ కోసం ఉపయోగపడుతున్న ఉపాధి పథకాన్ని రద్దుచేసి పేదలను మళ్లీ వలస బాటలు పట్టించాలనే కుట్రలను బిజెపి ప్రయత్నిస్తుందని అన్నారు. ఇప్పటికే బెంగాల్, ఉత్తర భారత దేశంలోని కొన్ని రాష్ట్రాల్లో ఉపాధి హామీ పథకం రద్దు చేసిందని వారు విమర్శించారు. గత ప్రభుత్వాలు 14 లక్షల కోట్ల బడ్జెట్లో 98 వేల కోట్లు కేటాయిస్తే నేడు బిజెపి అధికారంలోకి వచ్చాక 40 లక్షల కోట్ల బడ్జెట్లో కేవలం 63 వేల కోట్లు కేటాయించి ఉపాధి కార్మికులకు కూలీ గిట్టకుండా, సరిపోను పని దినాలు లేకుండా చేస్తుందని అన్నారు. ఇటీవల కేంద్ర ప్రభుత్వం 333 జీవో తెచ్చి ఉదయం సాయంత్రం ఫోటో అప్లోడ్ చేయాలని, కూలీల జాబు కార్డు, ఆధార్ కార్డు, బ్యాంక్ అకౌంట్ ఫోన్ నెంబర్లను ఆన్లైన్లో లింక్ చేయాలని కొత్త కొత్త నిబంధనలు పెట్టి ఉపాధి కార్మికులకు ఉపాధి లేకుండా దూరం చేయడమే అన్నారు. కొలతలు లేకుండా ఉపాధి కల్పించడానికి తెచ్చిన ఉపాధి హామీ చట్టాన్ని కొలతలు పెట్టి, కొత్త నిబంధనలు తెచ్చి కూలీ గిట్టకుండా చేస్తున్నారని అనేక గ్రామాల్లో 100 రూపాయల నుండి 150 రూపాయలకు మించి కూలీ ఇవ్వటం లేదని దీనితో కూలీలు తమ కుటుంబాలను ఏ విధంగా పోషించుకుంటారని ప్రశ్నించారు.

ప్రభుత్వం నిర్ణయించిన 272 రూపాయలు ఏ గ్రామంలో ఇవ్వటం లేదని పెరిగిన ధరలతో పోల్చుకున్నప్పుడు రోజుకూలీ కనీసం 600 రూపాయలకు పెంచాలని, సంవత్సరానికి ప్రతి మనిషికి 200 రోజులు పని దినాలు కల్పించాలని, కేంద్ర బడ్జెట్లో 2.64 వేల కోట్లు కేటాయించాలని, వారం వారం పే స్లిప్పులు, చేసిన పనికి డబ్బులు ఇవ్వాలనీ,రద్దు చేసిన సమ్మర్ అలవెన్స్ లను పునరుద్ధరించాలనీ,పని ప్రదేశాల్లో కనీస సౌకర్యాలైన టెంటు ,మంచినీళ్లు ,మెడికల్ కిట్టు, ఏర్పాటు చేయాలనీ,మున్సిపల్, కార్పొరేషన్, విలీన గ్రామాల్లో కూడా ఉపాధి పని కల్పించాలని వారు డిమాండ్ చేసినారు.ఉపాధి కార్మికులకు బీమా సౌకర్యం కల్పించాలని, పని ప్రదేశంలో వడదెబ్బకు గానీ,ఇతర ప్రమాదాలతో చనిపోతే 20 లక్షలు ఎక్సిగ్రేషియా ఇచ్చి ఆదుకోవాలి వారు ప్రభుత్వానికి సూచించారు.

అనంతరం ప్రదర్శనగా వెళ్లి డి.ఆర్.డి.ఓ. పిడి నాగిరెడ్డి గారికి వివిధ డిమాండ్లతో కూడిన వినతి పత్రాన్ని ఇవ్వడం జరిగింది. ఇంకా ఈ కార్యక్రమంలో‌ తెలంగాణ వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా అధ్యక్షులు బొల్లు యాదగిరి, దళిత సంఘాల ఐక్యవేదిక జిల్లా కన్వీనర్ బట్టు రామచంద్రయ్య, కుల వివక్ష వ్యతిరేక పోరాట సంఘం జిల్లా కార్యదర్శి సందెల రాజేష్ , డి.బి.ఎస్. యు జిల్లా ఉపాధ్యక్షురాలు భాగ్య, తెలంగాణ వ్యవసాయ కార్మిక సంఘం రాష్ట్ర కమిటీ సభ్యురాలు రాచకొండ రాములమ్మ, రాష్ట్ర కమిటీ సభ్యులు గంగాదేవి సైదులు, జిల్లా ఉపాధ్యక్షులు జూకంటి పౌల్, పల్లెర్ల అంజయ్య, సల్లూరి కుమార్, జిల్లా సహాయ కార్యదర్శులు సిరిపంగి స్వామి, కూకుట్ల చొక్కాకుమారి, బి.కే యం.యు జిల్లా ఉపాధ్యక్షులు సల్ల బిక్షపతి, గాదగోని మాణిక్యం, తెలంగాణ వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా కమిటీ సభ్యులు బోయ యాదయ్య, దొడ్డి బిక్షపతి, కొండాపురం యాదగిరి, బొమ్మ కంటి లక్ష్మీనారాయణ , గడ్డం సుదర్శన్, ఎన్.పి.ఆర్.డి జిల్లా ఉపాధ్యక్షురాలు కొత్త లలిత, ప్రజాసంఘాల నాయకులు కూకుట్ల కృష్ణ, కే సత్తిరెడ్డి, దేవరాజు, ఎల్లయ్య, భారతమ్మ తదితరులు పాల్గొన్నారు.