భద్రకాళి చెరువుకు గండి భయాందోళనలో సరస్వతి నగర్

భద్రకాళి చెరువుకు గండి భయాందోళనలో సరస్వతి నగర్

ముద్ర ప్రతినిధి, వరంగల్: వరంగల్ భద్రకాళి చెరువుకు గండి పడింది. శనివారం ఉదయం పోతన నగర్ వైపున కట్ట తెగిపోయింది. పక్కనే ఉన్న పోతన నగర్, సరస్వతి నగర్, జ్ఞాన సరస్వతి టెంపుల్ కాలనీలు ముంపునకు గురవుతున్నాయి. పది రోజులుగా కురుస్తున్న వర్షాలకు భద్రకాళి చెరువు గురువారం సాయంత్రం నుంచి మత్తడి దూకుతోంది. శుక్రవారం నుండి అలుగు ఉధృతంగా ప్రవహిస్తుండడంతో అధికారులు సాయంత్రమే కట్టని పరిశీలించారు. కానీ,ఎటువంటి చర్యలు చేపట్టలేదు. ఫలితంగా శనివారం ఉదయం చెరువుకు గండి పడింది. పక్కనే ఉన్న పోతన నగర్ సరస్వతి నగర్ కాలనీల ప్రజలు తీవ్రభయాందోళనకు గురవుతున్నారు. మత్తడి పక్కన మరో చిన్న బుంగ పడినట్లు తెలుస్తోంది. 

భద్రకాళి చెరువు మొత్తం 700 ఎకరాల్లో విస్తరించి ఉండగా.. 112 కిలోమీటర్ల పరివాహక ప్రాంతం నుంచి చెరువుకు వరద వచ్చి చేరుతోంది. చెరువు కింద 688 ఎకరాల ఆయకట్టుతోపాటు నగర ప్రజలకు తాగునీటిని అందిస్తోంది. 150 మిలియన్ క్యూబిక్ అడుగుల నీటి నిలువ సామర్థ్యం ఈ చెరువు సొంతం. ఇంతటి ప్రఖ్యాతిగాంచిన, ప్రజలకు అవసరమైన చెరువును నిర్లక్ష్యం చేయడంపై అధికారులు, ప్రజా ప్రతినిధులపై నగరవాసులు విమర్శలు గుప్పిస్తున్నారు.