ప్రభుత్వాలను సవాల్‌ చేస్తున్న మురళీమోహన్‌

ప్రభుత్వాలను సవాల్‌ చేస్తున్న మురళీమోహన్‌

రెండు తెలుగు రాష్ట్రాల ప్రభుత్వ సహాయ స‌హ‌కారంతో  ‘తెలంగాణ ఫిలిం ఛాంబర్స్‌ ఆఫ్‌ కామర్స్‌’ ఆధ్వర్యంలో 13 మంది జ్యూరీ  సభ్యుల సమక్షంలో `టీఎఫ్‌సీసీ నంది అవార్డ్స్ సౌత్ ఇండియా 2023` వేడుక‌లు ఆగస్టు 12 న దుబాయ్‌లోని వరల్డ్ ట్రేడ్ సెంటర్ లో ఘ‌నంగా నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. అయితే 13 మంది జ్యూరీ  సభ్యులను సెలెక్ట్  చేసుకొన్న  సందర్బంగా  పాత్రికేయుల సమావేశం ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమానికి బి. గోపాల్, మురళీ మొహన్, సుమన్, శివాజీ రాజా, రేలంగి నరసింహారావు, రోజా రమణి, జర్నలిస్ట్ ప్రభు తదితరులు ముఖ్య అతిధులుగా పాల్గొని ఆగస్టు 12 న దుబాయ్‌లోజరిగే టీఎఫ్‌సీసీ నంది అవార్డ్స్ విజయవంతం కావాలని అన్నారు. ఈ సందర్బంగా టియ‌ఫ్ సీసీ చేర్మెన్ డా. మురళీమోహన్​ మాట్లాడుతూ... రెండు తెలుగు రాష్ట్రాల ప్రభుత్వాలకు రాజకీయాల్లో వున్న శ్రద్ధ సినిమారంగంలో లేదని  ఈ సందర్భంగా ఆయన తెలిపారు. ఒకవైపు ఆర్‌.ఆర్‌.ఆర్‌. వంటి సినిమాతో ప్రపంచంలో గుర్తింపు తెచ్చుకున్న తెలుగు పరిశ్రమను మన ప్రభుత్వాలు అసలు పట్టించుకోవడంలేదు. ఒకప్పుడు నంది అవార్డులు అని కళాకారులకు ప్రోత్సాహాలుగా బహుమతులు ఇచ్చేవారు. ఎప్పుడయితే రాష్ట్రాలు విడిపోయాయో అప్పటి నుంచి నంది అవార్డుల గురించి పట్టించుకోవడం మానేశారని ఆయన వాపోయారు.  ప్రైవేట్‌ సంస్థలు టైమ్స్‌, సంతోషం సురేష్​కొండేటి ఇలా కొంత మంది ప్రతి ఏడాది ఇచ్చే కొన్ని సంస్థలు దక్షిణాది కళాకారులకు అవార్డులు ఇవ్వడం చాలా మంచి పరిణామం. ఒక రకంగా ప్రభుత్వాలకు సవాల్ గా నిలిచాయని చెప్పాలి. 

తాజాగా నంది అవార్డుల పేరుతో తెలంగాణ ఛాంబర్‌ ఆఫ్‌ కామర్స్‌ అధ్యక్షుడు ఆర్‌.కె.గౌడ్‌ నంది అవార్డుల ప్రదానం పేరుతో ఇటీవలే దుబాయ్‌ వెళ్ళి అక్కడ కార్యక్రమం నిర్వహించారు. హైదరాబాద్‌లో కొందరు స్క్రూటినీ సభ్యులతో ఎంపికచేసి 24 శాఖలలో ఉత్తములకు అవార్డులు ఇవ్వడం జరుగుతంది. ఈ సందర్భంగా నంది అవార్డుపేరుతో ఇవ్వడం పట్ల సీనియర్‌ నటుడు మురళీమోహన్‌ పైవిధంగా స్పందించారు. నంది అవార్డు అనేది ప్రభుత్వం ఇవ్వాలి. అందుకు తగిన విధివిధానాలను చూసుకుని ఇవ్వమని నిర్వాహకులను కోరారు. అదేవిధంగా ప్రభుత్వానికి చేతకాకపోతే ఫండ్‌ రైజింగ్‌ చేసుకుని అయినా ఇవ్వాలని ఆయన  సూచించారు. అవార్డులకు ఎంతో ఖర్చు అవ్వదని మొత్తం మీద ఒక కోటి రూపాయల వరకు ఖర్చు అవుతుందేమోనని ఒకవేళ అది ప్రభుత్వం ఇవ్వలేని పరిస్థితుల్లో స్పాన్​సర్స్​ద్వారా అయినా ఇవ్వవలసిందిగా ఆయన సూచించారు.  తెలుగు పరిశ్రమ ఎంతో వినోదపు పన్ను ప్రభుత్వాలకు కడుతుంది. అవి ఏమి చేస్తున్నారని ఈ సందర్భంగా ఆయన నిలదీశారు. “ఎన్టీఆర్ సీఎంగా ఉన్నప్పుడు కానీ, చంద్రబాబునాయుడు సీఎంగా ఉన్నప్పుడు కానీ, నేను ఎఫ్ డీసీ చైర్మన్ గా ఉన్నప్పుడు ఓ సీల్డ్ కవర్ లో పేర్లు ఉంచి సీఎంకు ఇచ్చేవాళ్లం. వాళ్లు ఓకే చేసి సంతకం పెట్టేవాళ్లు. అంతే తప్ప, ఆయన గానీ, ఈయన గానీ అందులో ఏ పేర్లు ఉన్నాయని ఏనాడూ చూడలేదు. ఎప్పుడూ కులాల ప్రసక్తే రాలేదు… టాలెంట్ ను చూసి అవార్డులు ఇచ్చాం. సినిమా అనేదే మాకు కులం. ఇవాళ అందరూ రెండు తెలుగు రాష్ట్రాల ప్రభుత్వాలను కోరాల్సింది ఏమిటంటే… అయ్యా, దయచేసి అవార్డులు ఇవ్వండి. ఏడెనిమిదేళ్లుగా అవార్డులు ఇవ్వడంలేదని ఆయన అన్నారు.

ప్రముఖ దర్శకులు బి.గోపాల్ మాట్లాడుతూ..గ‌త కొన్నేళ్లుగా ఆగిపోయిన నంది అవార్డ్స్ ని ఇవ్వాలనే చాలా మంచి ఆలోచనతో చేస్తున్న రామకృష్ణ గారికి మా సపోర్ట్ ఎప్పుడూ ఉంటుందని అన్నారు. అదే విధంగా అవార్డుల కోసం కోటి రూపాయలు కాదు అవసరమైతే 5కోట్లు అయినా వెచ్చించాలని ఆయన అన్నారు. వినోదపు పన్ను సినీ రంగం నుంచి చెల్లిస్తున్నప్పుడు వారు కళాకారులను గుర్తించకపోతే ఎలా అంటూ ఆయన కూడా ప్రశ్నించడం జరిగింది.