వరి ధాన్యం కొనుగోలు ప్రక్రియ వేగవంతం చేయాలి- గంగుల కమలాకర్

వరి ధాన్యం కొనుగోలు ప్రక్రియ వేగవంతం చేయాలి- గంగుల కమలాకర్

ముద్ర ప్రతినిధి నాగర్ కర్నూల్: ఎండాకాలం వరి ధాన్యం కొనుగోలు ప్రక్రియను మరింత వేగవంతం చేయాలని రాష్ట్ర పౌరసరఫరాలు, బి.సి సంక్షేమ శాఖ మంత్రి గంగుల కమలాకర్ సూచించారు. బుధవారం వరి ధాన్యం కొనుగోలు ప్రక్రియ పై జిల్లా కలెక్టర్లు అదనపు కలెక్టర్లు, పౌర సరఫరాల శాఖ అధికారులతో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సమీక్ష నిర్వహించారు.  

ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ అకాల వర్షాలు వచ్చి రైతులు ఇబ్బందులు పడుతున్నారని , రైతులకు ఇబ్బందులు కలుగకుండా కొనుగోలు ప్రక్రియను వేగవంతం చేయాలని ఆదేశించారు.  ఇందుకు కలెక్టర్లు, అదనపు కలెక్టర్లు క్షేత్రస్థాయిలో  కొనుగోలు కేంద్రాలను పర్యవేక్షించాలని సూచించారు రైస్ మిల్లులో లారీలు ఎక్కువ రోజులు నిల్పకుండా వచ్చిన ధాన్యాన్ని ఎప్పటికప్పుడు అన్లోడింగ్ చేసే విధంగా చర్యలు తీసుకోవాలన్నారు కేవలం లారీలను మాత్రమే కాకుండా ట్రాక్టర్లను సైతం ఉపయోగించుకోవాలని సూచించారు.

 ధాన్యం ఎఫ్.సి. ఐ  నిబంధనల మేరకు  కొనుగోలు చేసి రైస్ మిల్లులకు పంపాలని తెలియజేశారు. మిల్లులకు తడిచిన ధాన్యం ఎక్కువగా  వస్తుందని,   ఇతర రాష్ట్రాల నుండి ఏ మాత్రం ధాన్యం రాకుండా చెక్ పోస్టుల వద్ద కట్టుదిట్టం చేయాలని సూచించారు.  రైస్ మిల్లుల లో ధాన్యం పెట్టుకోడానికి స్థలం సమస్య ఉంటే జిల్లాలోని ఇతర గోదాముల ను తాత్కాలిక పద్దతిలో అప్పగించి ధాన్యం నిలువ చేయాలని సూచించారు. 


ఈ వీడియో కాన్ఫరెన్స్ లో పాల్గొన్న జిల్లా కలెక్టర్ పి. ఉదయ్ కుమార్ మాట్లాడుతూ నాగర్ కర్నూలు జిల్లాలో ఇప్పటికే 4,5538 మెట్రిక్ టన్నుల ధాన్యం కొనుగోలు చేసినట్లు తెలిపారు.  జిల్లాలో ధాన్యం సేకరణ ప్రక్రియ సజావుగా సాగుతుందని, ప్రభుత్వం ద్వారా ఇచ్చిన సూచనలు పాటిస్తామని కలెక్టర్ మంత్రికి  తెలియజేశారు. ఈ వీడియో కాన్ఫరెన్స్ లో అదనపు కలెక్టర్ యస్. మోతిలాల్, జిల్లా పౌర సరఫరాల అధికారి మోహన్ బాబు, పౌరసరఫరాల జిల్లా మేనేజర్ బాల్రాజ్ పాల్గొన్నారు.